logo

ప్రచారానికి వడదెబ్బ

ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Updated : 01 May 2024 05:46 IST

 ఓట్ల కోసం నేతల తిప్పలు
న్యూస్‌టుడే, రాంనగర్‌ 

 ఎండలు మండిపోతున్నాయి. భరించలేనంత ఉక్కపోత.. కాలు బయట పెడితే భగ్గుమంటోంది.. కానీ వెళ్లక తప్పదు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న ఉండటంతో అభ్యర్థులతో పాటు నాయకులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లను రాబటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమయం ఎక్కువగా లేకపోవడంతో ఎండలు దంచికొడుతున్నా.. అవసరమైన జాగ్రత్తలతో ప్రచారానికి వెళ్తున్నారు. ఎక్కువ సేపు ఎండలో తిరగడం వల్ల ఇప్పటికే బోథ్‌ శాసనసభ్యుడు అనిల్‌జాదవ్‌, బోథ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి అడ గజేందర్‌కు వడదెబ్బ తగలడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క ఎండకు అలసిపోయి కాసేపు అలాగే కూర్చుండిపోయారు. ఇలాగే ఆయా పార్టీలకు చెందిన కొంత మంది కార్యకర్తలకు సైతం వడదెబ్బ తగలడంతో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఒక వైపు ప్రచారానికి ఎక్కువ సమయం లేదు. మరో వైపు ఎండలు.. తెల్లవారగానే గ్రామాలకు వెళితే కూలీలు ఉపాధి హామీకి వెళితే.. రైతులు పొలం పనులకు వెళ్తున్నారు. ఆలస్యంగా వెళదామంటే ఎండ వేడిమి బెంబేలెత్తిస్తోంది. రోడ్‌ షోలు చేయలేక, ఇంటింటికీ తిరగలేక, నేతలు ముప్పుతిప్పలు పడుతున్నారు.

వడదెబ్బ తగిలిన కాంగ్రెస్‌ నాయకుడు గజేందర్‌

నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అయితే వారం రోజులుగా ఎండల తీవ్రత కారణంగా పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నారు. తెల్లవారుజామున బయలుదేరి గ్రామాలకు వెళ్లే సరికి కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. గ్రామంలో కొంత మందిని కలిసేలోగా ఎండ తీవ్రత పెరగడంతో మరో గ్రామానికి వెళ్ల లేకపోతున్నారు. తిరిగి సాయంత్రం ఆరు గంటల తరువాత గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. అప్పటికే అలసిపోయి ఇళ్లకు చేరుకున్న గ్రామీణులు నేతలను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధి ఎక్కువగా ఉండటంతో గ్రామాలను చుట్టి రావడం కష్టంగా మారింది. బడా నేతలు ఒకటి, రెండు రోజులతోనే ప్రచారాన్ని సరిపెట్టుకున్నారు. వామ్మో.. ఈ ఎండలకు రోడ్‌ షోలు పెట్టకండి. ఏ గ్రామంలోనైనా తప్పని సరి అంటే తెల్లవారుజామున వస్తామని చెబుతున్నారు. ఇక  ఆడవాళ్లయితే.. ఇంట్లో కూర్చొనేవాళ్లం.. పదవులని చెప్పి ఎండల్లో తిప్పుతున్నారని మండిపడుతున్నారు. ఏది ఏమైనా ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడం, అందులో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెళ్లామా.. వచ్చామా.. అన్నట్లుగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం సాగుతోంది.

ఉక్కిరిబిక్కిరి..

జిల్లాలో వారం రోజులుగా ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాల వారీగా 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకోవడంతో క్షణం పాటు బయట తిరగలేని పరిస్థితి ఉంది. ప్రచారానికి వెళ్లే వారి పరిస్థితి భిన్నంగా ఉంది. కారులో ఉన్నంత సేపు ఏసీ వేసుకొని వెళ్తున్నారు. గ్రామం వచ్చిందంటే కారు దిగి ఓటర్లను కలవాలంటే ఎండలోనే వెళ్లాల్సి వస్తోంది. ఇటు ఏసీ.. అటు ఎండలతో నేతలు పరేషాన్‌ అవుతున్నారు. జిల్లా సగటు ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు కాగా జిల్లాల వారీగా ఇంకా ఎక్కువే ఉంది.

ఎండల కారణంగా రాత్రి వేళ గ్రామస్థులతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సుగుణ

చికిత్స పొందుతున్న బోథ్‌ శాసనసభ్యుడు అనిల్‌జాదవ్‌

ఎండల కారణంగా ఉదయం వేళ ఉపాధిహామీ పని చేస్తున్న కూలీలతో భాజపా అభ్యర్థి గోడం నగేష్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని