logo

శిశువులపై చిన్నచూపు..

ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది.

Published : 08 May 2024 03:31 IST

ఎస్‌ఎన్‌సీయూలో వైద్యులు లేరు.. సౌకర్యాలు కరవు

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌) సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పర్యవేక్షణలో కొనసాగే నవజాత శిశువు సంరక్షణ కేంద్రం సదుపాయాలు కరవై, వైద్యులు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. సౌకర్యాలు కల్పించడంలో ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమవుతుండగా డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) పరిధిలోని ఎంసీహెచ్‌ (మాతా, శిశు ఆరోగ్యకేంద్రం) నిర్వహణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది.

మంచిర్యాల జిల్లాకు 20పడకల ఎస్‌ఎన్‌సీయూ కేంద్రం ఏ మాత్రం సరిపోవడం లేదు.ప్రస్తుత పడకలకైనా సక్రమంగా సేవలు అందడం లేదు. పుట్టుకతో ఆరోగ్య సమస్యలున్న శిశువులకు ఇందులో చికిత్స చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఉండాల్సిన పిల్లల వైద్యనిపుణులు లేరు. గతంలో నియామకం చేసిన వైద్యులు ఒక్కొక్కరుగా వారి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. ఆ స్థానాల్లో నూతన నియామకానికి మొగ్గుచూపడం లేదు. ఈ కేంద్రంలో సేవలు అందించేందుకు నలుగురు వైద్యులకు అనుమతి ఉంది. కానీ భర్తీ చేయడంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సదుపాయాలు సైతం లేవు.

అధికారులు పట్టించుకోరూ..

ఎన్నికల విధుల్లో తలమునకలవుతున్నా ఉన్నతాధికారులు కొంత సమయాన్ని ఆరోగ్య శాఖ సమస్యలపై సైతం దృష్టి పెట్టాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల పదవీ కాలానికి కొంత సమయం ముందుగానే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు గానీ వైద్యులు రాజీనామా చేసినా, ఇతర కారణాలతో వెళ్లిపోయినా వారి స్థానాల్లో నియామకం చేపట్టేందుకు జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నలుగురు ఉండాల్సిన ఎస్‌ఎన్‌సీయూలో ఒక్కరంటే ఒక్కరు లేకపోయినా భర్తీకి ముందుకురాకపోవడంతో నవజాత శిశువుల చికిత్సకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. తాత్కాలికంగా చేపట్టే ఈ నియామక ప్రక్రియకు సైతం జాప్యం చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

అందుబాటులోలేని అత్యవసర పరికరాలు..

ఎస్‌ఎన్‌సీయూలో ఫొర్టెబుల్‌ ఎక్స్‌రే యంత్రం (శిశువు దగ్గరికి వెళ్లి తీసేందుకు వీలుగా), 2డీ ఏకో పరికరం అత్యవసరం. మొదటిది నిమోనియాను గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు, రెండోది గుండె సంబంధిత సమస్యలను మొదట్లోనే తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేయడం లేదు. దీంతోపాటు ఫొటోథెరపీ యూనిట్స్‌, న్యూబార్న్‌ బసినెట్స్‌, బిలిరూబినోమీటర్స్‌, బిలిమీటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్స్‌ ఇలా అనేక రకాల పరికరాలు అవసరముంది.

ఇదీ ఎస్‌ఎన్‌సీయూ పరిస్థితి.. ఒక్కో పడకలో ఇద్దరేసి చొప్పున శిశువులను ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రసవాల ఆధారంగా ఒక్కో సమయంలో ఇదే పడకలో ముగ్గురికి సైతం వైద్యం అందించిన రోజులు కూడా ఉన్నాయి. బాధితులు ప్రశ్నించడం లేదు కదా అని.. అధికారులకు ఆయా సమస్యలపై పట్టింపే లేకుండా పోయింది.

సరిపోని పడకలు..

ప్రస్తుతం కొనసాగుతున్న 20పడకల ఈ ఎస్‌ఎన్‌సీయూ వార్డు ఏమాత్రం సరిపోవడం లేదు. ఒక్కో దాంట్లో ఇద్దరు.. అత్యవసరమైతే ముగ్గురు శిశువులను ఉంచి చికిత్స అందించాల్సి వస్తోంది. దీంతో శిశువులకు ఇతర సమస్యలు వచ్చే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎంసీహెచ్‌లో నిత్యం 15-20 ప్రసవాలు జరుగుతున్నాయి. దాదాపు జన్మించిన శిశువులందరికీ ఎస్‌ఎన్‌సీయూ తప్పనిసరి అవసరం. ఒక్కో శిశువును మూడు నుంచి పక్షం రోజులు, అత్యవసర పరిస్థితి దృష్ట్యా నెలలు ఉంచిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పడకల కొరత తీవ్రమైంది. తప్పని పరిస్థితుల్లో ఇద్దరు, ముగ్గురికి ఒకే పడకలో చికిత్స అందించాల్సిన దుస్థితి వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు