logo

భారీ వర్షం.. కాస్త ఉపశమనం!

తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

Published : 08 May 2024 03:39 IST

ఈదురుగాలులతో ఇబ్బందులు.. విద్యుత్తు సరఫరాలో అంతరాయం

వాంకిడి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ చౌరస్తాలో నిలిచిన వరద నీరు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : తీవ్రమైన ఎండలు, వేసవి తాపం, ఉక్కపోతతో కొన్నిరోజులుగా అల్లాడుతున్న జిల్లావాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో, కొన్నిచోట్ల రాళ్ల వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో కొన్నిచోట్ల వరి పంట నేలవాలింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి చెరువులను తలపించాయి. కొన్నిచోట్ల కాలువల నుంచి మురుగంతా రోడ్లపై పారడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసిఫాబాద్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండా, మబ్బులతో కనిపించింది. సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి చీకటిగా మారింది. అదే సమయంలో వడగళ్లు పడ్డాయి.

  • జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్‌లో కాలువల నుంచి నీరంతా రోడ్డుపై చేరి చెరువులను తలపించాయి. మురుగు ప్రవహించడంతో ఇబ్బందులు పడ్డారు. పాత సినిమా టాకీస్‌ లైన్‌లోని కాలువ నిండి మురుగు నీరు పలువురి దుకాణాల్లోకి చేరాయి. జిల్లా కేంద్రంలో ఓ చెట్టుకొమ్మ విరిగి పోవడంతో కొంత సేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మండలంలోని అప్పపల్లి, ఈదులవాడ, బూరుగూడ ప్రాంతాల్లో కొందరి రైతుల వరి పంట నేలవాలింది.
  • సిర్పూర్‌(టి) మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్ల కొమ్మలు విరిగి పోయాయి. కొంత సేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కౌటాల మండలంలో భారీ వర్షం కురిసింది. నాగెపల్లి గ్రామ సమీపంలో పిడుగు పడి ఎద్దు మృతి చెందింది. దహెగాం మండలంలోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని ఓ రైస్‌ మిల్లు సమీపంలో పిడుగు పడడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాంకిడి, కెరమెరి, రెబ్బెన, లింగాపూర్‌, కాగజ్‌నగర్‌.. ఇలా అన్ని మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయాయి.
  • వాంకిడి మండల కేంద్రంలోని పాత ఎస్బీఐ చౌరస్తాలో హనుమాన్‌ మందిరం నుంచి వచ్చే వరద నీరు వెళ్లేందుకు దారి లేకపోవడంతో జాతీయ రహదారి పక్కన చేరింది. దీంతో బస్టాండ్‌, ఆలయం వైపు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు ఎస్సై సాగర్‌ దృష్టికి తీసుకెళ్లగా జేసీబీ తెప్పించి వరద నీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
  • గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి కార్మికులు నివసించే క్వార్టర్‌ లైన్‌లోని రెండు విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఆరుఫోర్సున్‌ క్వార్టర్లలోని ఒక స్తంభం తీగలపై చెట్టు పడటంతో రెండు స్తంభాలు విరిగి పడ్డాయి. స్తంభానికి అమర్చిన నియంత్రిక సైతం కిందపడిపోయింది. పలు క్వార్టర్ల వెనుకాల షెడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడిపోవడంతో సిమెంటు, ఇనుప రేకులు దెబ్బతిన్నాయి. అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. కైరిగూడలోని గొల్లగూడ గ్రామంలో ఒక విద్యుత్తు స్తంభం విరిగిపోయి సరఫరా నిలిచిపోయింది.
  • కాగజ్‌నగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో వడగాళ్ల వాన కురిసింది. నామానగర్‌, వల్లకొండ, గువ్వలగూడ, జంబుగా, గొల్లగూడ, గన్నారం తదితర గ్రామాల్లో కోత దశలోని వరిపంట నేలమట్టమైంది. గువ్వలగూడ గ్రామానికి చెందిన రైతు నాగేందర్‌సింగ్‌కు చెందిన 18 ఎకరాల్లోని వరి వడగాళ్లవానతో నేలమట్టం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాగజ్‌నగర్‌-పెంచికల్‌పేట ప్రధానరహదారి సార్సాల సమీపంలో రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు