logo

సమున్నత లక్ష్యం.. శతశాతం ఓటింగ్‌తోనే పదిలం

ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్‌ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది.

Updated : 08 May 2024 06:54 IST

ఓటు వదులుకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఓటర్లు

లక్షెట్టిపేట, న్యూస్‌టుడే: ఓటు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బలమైన పునాది. వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత చేకూరుతుంది. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవడంతో పాటు శత శాతం పోలింగ్‌ నమోదుకు ఎన్నికల సంఘం, వివిధ స్థాయిలో అధికార యంత్రాంగం కార్యక్రమాలు చేపడుతోంది. ఓటు ప్రాధాన్యత గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. స్వీప్‌ పేరిట ఎన్నికల అధికారులు ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పించింది. దివ్యాంగులు, మహిళలు, యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయినప్పటికీ విద్యావంతులు, ఉద్యోగులు, పట్టణ ప్రాంత వాసులు, ప్రవాసులు, ఇతర ప్రాంతాల్లో నివాసముండే వారు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు.

పట్టణ ఓటర్లూ.. నిర్లిప్తత వీడండి

ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చైతన్య సదస్సులు, అవగాహన ర్యాలీలు  నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఓటింగ్‌ సరళి పెరిగినప్పటికీ గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో వెనుకబడే ఉన్నారు. దగ్గరలోనే పోలింగ్‌ కేంద్రాలు, అన్ని సదుపాయాలు ఉండి విద్యావంతులు అయినప్పటికీ ఓటేయడంలో నిర్లిప్తత ఉంటోంది. పనులన్నీ వదులుకుని ఓటేయడం అవసరమా అనే ధోరణి ఇంకా కనిపిస్తోంది. ఒకటి, రెండు ఓట్లతోనే ఫలితాలే తారుమారైన సంఘటనలు ఉన్నప్పటికీ ఓటు వేయడాన్ని చాలా మంది బాధ్యతగా గుర్తించడం లేదు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా దీన్ని గుర్తించిన నాడే మెజారిటీ ప్రజల నిర్ణయానికి అనుగుణంగా పాలకులను ఎన్నుకునే అవకాశముంటుంది.

వేలల్లో ఉన్నా... నమోదు తక్కువే..

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఏ జిల్లాలో చూసినా ప్రవాసుల సంఖ్య తక్కువగా ఉండటం లేదు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా వేల సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండగా  ఇలాంటి వారి కోసం ఎన్నికల కమిషనర్‌ ఫారం 6కు అవకాశం కల్పించింది. వారిలో  కొంత మంది ఓటరుగా నమోదు చేసుకోకపోగా, చేసుకున్న వారు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా  కొంతలో కొంత ప్రజాసేవ చేసే వారిని ఎంచుకునే విచక్షణ ఉండే విద్యావంతులు, పట్టణ ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండటం వల్ల ప్రజాస్వామ్య పరిరక్షణకు తీరని ముప్పు కలిగే అవకాశం ఉంది.

బాధ్యతగా గుర్తించాలి

పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. చిన్నారులకు పదిహేను రోజులుగా ఆటవిడుపు దొరికింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం చాలామంది తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్లారు. మరికొంతమంది వెళ్లడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13వ తేదీ అధికారిక సెలవు కాగా ముందు రెండ్రోజులు రెండో శనివారం, ఆదివారం కలిసివచ్చాయి. దీంతో చాలా మంది సెలవులు తీర్థయాత్రలు, విహార యాత్రలకు కేటాయించే అవకాశముంది. ఎవరు ఎక్కడికి వెళ్లినా ఎన్నికల రోజు విధిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరముంది.

గతం.. కారాదు పునరావృతం

2019 పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి స్థానంలో 65.57, ఆదిలాబాద్‌లో 71.41 శాతం పోలింగ్‌ జరిగింది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో 30 శాతం లోపు నమోదైంది. నస్పూర్‌లోని చాలా కేంద్రాల్లో పోలింగ్‌ తక్కువగా నమోదైంది. 233 పోలింగ్‌ కేంద్రంలో 29,  234, 236 కేంద్రాల్లో 31 శాతం మాత్రమే నమోదైంది. ఈ ఎన్నికల్లో ఇలా తక్కువ పోలింగ్‌ నమోదైన కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు