logo

దారి తప్పిన బాల్యం..

ఆదిలాబాద్‌ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది.

Updated : 08 May 2024 06:53 IST

చోరీలకు పాల్పడుతున్న ముఠా

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేర విభాగం : ఆదిలాబాద్‌ పట్టణంలో కొందరు బాలలు ముఠాగా ఏర్పడి రాత్రయిందంటే చోరీలకు తెగబడటం పట్టణవాసులకు సమస్యగా మారింది. రహదారి పక్కన, మైదానాల్లో ఆశ్రయాలు ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబాలకు చెందిన కొందరు పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి లేదా తెల్లవారుజామున అవకాశం చూసుకొని చోరీలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. 15ఏళ్లలోపు వారు గతంలో మద్యం దుకాణాల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. తాజాగా పక్షం రోజుల్లో మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాల నేరస్థుల కింద వారిని నిజామాబాద్‌లోని జువైనల్‌ అబ్జర్వేషన్‌ హోంకు పంపిస్తున్నారు. కొన్నాళ్లకు అక్కడ నుంచి వచ్చి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నారు.

బాల నేరస్థుల చట్టం ప్రకారం మైనర్లు ఏదైనా తప్పు చేసినా, చోరీ చేస్తే వారిలో మానసిక పరివర్తన తీసుకురావటానికి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు హాజరు పర్చి జువైనల్‌ అబ్జర్వేషన్‌ హోంలో ఆశ్రయం కల్పించాల్సి ఉంటుంది. అక్కడ సైతం వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోం సిబ్బంది చూసుకోవాలనే నిబంధనలున్నాయి. దీంతో ఇలాంటి వారిని ఆ హోంలో కొన్నాళ్లపాటు ఉంచి వదిలేస్తున్నారు. ఆదిలాబాద్‌లో చోరీలకు పాల్పడుతున్న బాలలు ఇదివరకే ఆ హోంకు వెళ్లి వచ్చారు. వచ్చాక మళ్లీ అదే విధంగా చోరీలకు పాల్పడటం సమస్యగా మారింది. ఇలాంటి వారు మేజర్లు అయ్యాక దొంగల ముఠాగా ఏర్పడే ప్రమాదం ఉంది.

హోటల్‌లో చోరీకి పాల్పడిన నలుగురే ఆదివారం తెల్లవారుజామున భుక్తాపూర్‌లో ఒక ద్విచక్రవాహనాన్ని చోరీ చేశారు. ఉదయం వాహనం కనబడకపోవటంతో అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చిన్న పిల్లలు తోసుకుంటూ వెళ్తుండటం గమనించారు. వారి కోసం పట్టణంలో గాలించి రిమ్స్‌ వద్ద పట్టుకొని గట్టిగా మందలించటంతో వాహనం దాచిన ప్రదేశాన్ని చూపించారు.

అపార్ట్‌మెంట్లో హుండీ చోరీ

ఆదిలాబాద్‌ రవీంద్రనగర్‌లోని ఓంసాయి రెసిడెన్స్‌ అపార్ట్‌మెంట్లో గత నెల 25న తెల్లవారుజామున నలుగురు బాలలు అక్కడున్న గణపతి గుడిలోని హుండీని ఎత్తుకెళ్లారు. మొదట ద్విచక్రవాహనాలను చోరీ చేయటానికి యత్నించి సాధ్యం కాక హుండీని ఎత్తుకెళ్లారు. అదే రోజు భుక్తాపూర్‌ కాలనీలోనూ ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసే క్రమంలో రోడ్డుపై వరకు తీసుకొచ్చి వదిలేశారు.

హోటల్లో దొంగతనం

ఆదిలాబాద్‌ పట్టణం నడిబొడ్డున ఉన్న గ్రీన్‌ బకెట్ హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున నలుగురు బాలలు వెళ్లి హోటల్‌ వెనుక ఉన్న గ్రిల్స్‌ తొలగించారు. వారిలో ఒకడు లోనికి చొరబడగా ముగ్గురు బయట కాపలా ఉన్నారు. లోనికి చొరబడ్డ బాలుడు క్యాష్‌ కౌంటర్‌లోని రూ.8 వేల నగదు, ఒక చరవాణి చోరీ చేసి బయటకు వచ్చాడు. ఇదే హోటల్‌లో వారు ఇది వరకు కూడా రెండు సార్లు చోరీకి పాల్పడ్డారు.

సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తాం

జీవన్‌రెడ్డి, డీఎస్పీ

బాల నేరస్థులకు శిక్ష వేయటానికి వీలులేదు. జువైనల్‌ హోంలో ఉంచి వారిలో మానసిక పరివర్తన తీసుకురావటానికి కృషి చేయాల్సి ఉంటుంది. వారి తల్లిదండ్రులకు, వారికి కౌన్సెలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌ పట్టణంలో కొందరు పిల్లలు దొంగతనాలు చేస్తున్న మాట వాస్తవం. ఈ సమస్య పరిష్కారానికి ఆలోచించి చట్టం పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు