logo

ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్‌గా భైంసా, పురపాలికగా ఖానాపూర్‌ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది.

Updated : 18 May 2024 04:40 IST

ఓపెన్‌ ప్లా(పా)ట్లు.. కనీస చర్యలు కరవు

నిర్మల్‌ అర్బన్, న్యూస్‌టుడే: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్‌గా భైంసా, పురపాలికగా ఖానాపూర్‌ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఎక్కడికక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లు చేసి అమ్ముతున్నారు. స్థిరాస్తి వ్యాపారులు కనీస ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, కొనుగోలు చేసిన యజమానులు వాటి రక్షణ విషయంలో సరైన దృష్టి సారించకపోవడంతో ఇళ్లు నిర్మించుకున్న పలువురికి ఖాళీ ప్లాట్లు చెప్పలేని ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. 

నిర్లిప్తత..

జిల్లాలోని మూడు బల్దియాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. వాటిలో వర్షం, మురుగు నీరు నిల్వ, పిచ్చిమొక్కలు పెరగకుండా, చెత్తాచెదారం వంటివి చేరనీయకుండా సంబంధిత యజమానులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొనడం, చుట్టూ కంచెలు, హద్దులు ఏర్పాటు చేయడంలో చూపుతున్న శ్రద్ధ రక్షణ విషయంలో కనబర్చడం లేదు. ఫలితంగా సమీపంలో ఇళ్లు నిర్మించుకున్న స్థానికులు చెప్పలేని కష్టాలు ఎదుర్కొంటున్నారు. మురుగు, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న వర్షాకాలంలో ఎదురయ్యే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. సంబంధిత పురపాలిక అధికారులను సంప్రదిస్తే యజమానులకు నోటీసులు జారీ చేస్తామని, కానీ వాటి యజమానుల చిరునామా తెలియడం లేదన్న సమాధానం చెబుతున్నారు. 

  • చిన్నపాటి కుంటను తలపిస్తూ, మురుగు చేరి అపరిశుభ్రంగా మారుతున్న ఈ పరిస్థితి జిల్లా కేంద్రంలోని విజయనగర్‌కాలనీలోనిది. ఇక్కడ ఉన్న పలు ఖాళీ ప్లాట్లు ఇలాంటివే కనిపిస్తాయి. తుంగ, గుర్రపుడెక్క అమాంతంగా పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇప్పుడే ఈ దుస్థితి ఉంటే రానున్న వర్షాకాలంలో కాలనీవాసులు ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడే కాకుండా ఇలాంటివి పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. 
  • చెత్తాచెదారం పేరుపోతున్న ఈ ఖాళీ ప్లాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని భాగ్యనగర్‌ కాలనీలో ఉంది. ప్లాస్టిక్‌ తదితర వాటిని పారేయడంతో పరిసరాలు దెబ్బతింటున్నాయి. ఇలాంటి సమస్య జిల్లాలోని మూడు పురపాలికల్లోని పలు కాలనీల్లో ఉంది. 

ఇకనైనా..

ఖాళీ స్థలాల పన్ను (వీఎల్‌టీ) వసూళ్లను గతంలో నిర్మల్, భైంసా పురపాలికల్లో చేపట్టినా.. కొన్నేళ్లుగా విస్మరించారు. ఓపెన్‌ ప్లాట్లతో దోమలు, ఈగలు వృద్ధి చెందడంతోపాటు పందులు, పశువులకు ఆవాసంగా మారి స్థానికులు రోగాల బారినపడుతున్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా బల్దియా అధికారులు వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై నిర్మల్‌ పురపాలిక కమిషనర్‌ సి.వి.ఎన్‌.రాజును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. వెంటనే సదరు యజమానులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. రక్షణ చర్యలు తప్పక తీసుకోవాలని చెప్పారు. లేనిచో బల్దియా ఆధ్వర్యంలోనే చేపట్టి దానికి అయిన ఖర్చును వారి నుంచి వసూలు చేయనున్నామని వెల్లడించారు. స్థానికులు సదరు స్థలాల్లో చెత్తాచెదారం వంటివి వేయకూడదని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని