logo

జెండా ఉంటేనే మనముంటాం!

వచ్చే ఎన్నికల్లో అంతా కష్టపడి వైకాపాను గెలిపించుకోవాలి, పార్టీ జెండా నిలబడితేనే మనకు మనుగడ ఉంటుందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Published : 02 Jul 2022 03:02 IST

వైకాపా ప్లీనరీలో మంత్రి అమర్‌నాథ్‌

జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, పక్కన ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మాజీ మంత్రి బాలరాజు

పాడేరు, న్యూస్‌టుడే: మన్యంలో 2014లో వైకాపా తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెదేపాకు అమ్ముడుపోయారు. వారిలో ఒకరిని దేవుడు తీసుకెళ్లిపోగా, మరొకరికి 2019లో ప్రజలు గుణపాఠం చెప్పార’ని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. వైకాపా జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్థానిక మోదకొండమ్మ ఆలయ ఓపెన్‌ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. తితిదే ఛైర్మన్‌, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తొలుత పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి అమర్‌ మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమూ గుర్తుకురాదన్నారు. సీఎం జగన్‌ గుర్తు పెట్టుకోవడానికి వీల్లేనన్ని పథకాలు ప్రవేపెడుతున్నారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. లక్షన్నర కోట్లు ప్రజలకు అందించామన్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడవగా.. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌ పేరుతో ఓ జిల్లానే ఏర్పాటు చేశారని అమర్‌ పేర్కొన్నారు. ముందుగా అధ్యక్ష హోదాలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడారు. మూడేళ్లలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా వైకాపాను ఓడించలేరన్నారు. తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2024లోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నాం.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపాను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాక్సైట్‌ తవ్వకాల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. పాడేరు వైద్య కళాశాలలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
* ఎంపీ మాధవి మాట్లాడుతూ జిల్లా ప్లీనరీ చూసి ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. జనసేనకు ప్రజల్లో ఆదరణ లేదని, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు ఏమి చేశారని ఓట్లెయ్యాలని ప్రశ్నించారు. అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ తెదేపా దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందిస్తున్నామన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి, ఈ మూడేళ్లలో జరిగిన పనులను ప్రజలు గమనించాలన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చిన సీఎం జగన్‌ ఆదివాసీల పాలిట దేవుడయ్యారన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు, మాజీ మంత్రులు పపుసులేటి బాలరాజు, మత్స్యరాస బాలరాజు, జిల్లా ప్లీనరీ పరిశీలకులు పరీక్షిత్‌రాజు, నాయకులు వినయ్‌, బాలకృష్ణ, 22 మండలాల జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సొంత గూటికి మాజీ ఎంపీపీ
పాడేరు, న్యూస్‌టుడే: అరకులోయ మాజీ ఎంపీపీ అరుణకుమారి సొంత గూటికి చేరారు. గతంలో ఆమె వైకాపా అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆమెతోపాటు భర్త అప్పాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. శుక్రవారం పాడేరులో నిర్వహించిన ప్లీనరీలో తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌, అరకులోయ ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు.

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని