logo
Published : 06 Aug 2022 02:12 IST

కాలనీలకు కావాలి రూ.298 కోట్లు

ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈపీడీసీఎల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌

ఎస్‌.రాయవరం మండలంలోని ఓ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు

ఈనాడు డిజిటల్‌, పాడేరు

పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ఉమ్మడి జిల్లాలో 956 జగనన్న కాలనీల కోసం లేఅవుట్లు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 520 కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన కల్పించడానికి ఆయా శాఖలు అంచనాలు వేశాయి. ఇప్పటికే తాత్కాలికంగా తాగునీరు, విద్యుత్తు సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కాలనీల్లో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే సుమారు రూ.298 కోట్లు అవసరం అవుతుందని తేల్చారు. అయితే కాలనీల్లో మంజూరైన గృహాల్లో 25 శాతం పూర్తిచేస్తేనే ఈ పనులు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు జరగకపోవడంతో శాశ్వత పనులు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. తాత్కాలిక నీటి వసతుల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయని, నిర్మాణాలకు నీరు సరిపోక సొంతంగా ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని జగనన్న కాలనీల్లో 68,939 మందికి ఇళ్లు మంజూరు చేశారు. కాలనీల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం చాలకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు వెయ్యి ఇళ్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేకపోయారు. ముఖ్యంగా కాలనీల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. వర్షం కురిస్తే చెరువులను తలపిస్తున్నాయి. నిర్మాణ సామగ్రి పాడైపోతోంది. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత ఇళ్లు నిర్మించుకుందామని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే మీరు ఇళ్లు కట్టిన తర్వాతే తాగునీరు, విద్యుత్తు సదుపాయం కల్పిస్తామని అధికారులంటున్నారు.

విద్యుత్తుకు రూ.108 కోట్లు..
జగనన్న కాలనీల్లో విద్యుత్తు సదుపాయం కోసం రూ.108.13 కోట్లు అవసరమని ఈపీడీసీఎల్‌ అధికారులు అంచనా వేశారు. వేల సంఖ్యలో ప్లాట్లకు విద్యుత్తు కోసం అవసరమైన సబ్‌స్టేషన్లు, స్తంభాలు, విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు ఈ మొత్తం ఖర్చు చేయనున్నారు. కాలనీల్లో వెయ్యికి పైగా సింగిల్‌ ఫేజ్‌ 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీధి దీపాలు, ప్లాట్లకు కలిపి 70 వేల ఎనర్జీ మీటర్లు అవసరం అవుతాయి. కిలోమీటర్ల మేర లైన్ల నిర్మాణం చేయాలి.

తాగునీటికి రూ.189.88 కోట్లు..
కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల కోసం తాత్కాలికంగా రూ.40 కోట్లతో బోర్లు తీసి, కుళాయిలు ఏర్పాటు చేశారు. 25 శాతం ఇళ్ల నిర్మాణా పూర్తయితే తాగునీటి అవసరాలన్నింటికీ కలిపి రూ.189.88 కోట్ల అంచనాలు వేశారు. తలసరి 50 లీటర్ల నీటి సరఫరాతో లెక్కించి ఈ అంచనాలు తయారు చేశారు.  68 చోట్ల ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. మిగతా కాలనీలకు సమీప నీళ్ల ట్యాంకుల నుంచి పైప్‌లైన్లు వేయాలి. కాలనీల్లో తాగునీటి వనరుల ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌ తెలిపారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, ఇళ్ల నిర్మాణాలు ఎక్కడైతే జోరుగా జరుగుతాయో అక్కడే ముందుగా ఈ పనులు చేస్తామన్నారు.

చోడవరంలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి నీళ్లట్యాంకు


Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని