logo

కనెక్షన్ల కథలో కిరికిరి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు విద్యుత్తు సమస్య తలెత్తుతోంది. ఇటీవల నిర్మిస్తున్న కొత్త భవనాల్లో మీటర్లు అమర్చకుండానే వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 26 Nov 2022 02:26 IST

సచివాలయాలు, ఆర్బీకేలకు విద్యుత్తు సమస్య

అనధికారిక వినియోగంపై ట్రాన్స్‌కో చర్యలు

విద్యుత్తు సరఫరా ఇటీవల కట్‌ చేయడంతో సేవలు నిలిచిపోయిన తడిగిరి సచివాలయం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు విద్యుత్తు సమస్య తలెత్తుతోంది. ఇటీవల నిర్మిస్తున్న కొత్త భవనాల్లో మీటర్లు అమర్చకుండానే వాటిని స్వాధీనం చేసుకున్నారు. సేవలు అందించడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది.  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కొన్ని చోట్ల సమీప కార్యాలయాల నుంచి విద్యుత్తును సర్దుబాటు చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన ట్రాన్స్‌కో అధికారులు అనధికారికంగా విద్యుత్తు వినియోగిస్తున్న కార్యాలయాలపై దాడులకు   దిగుతుండడం తాజాగా చర్చనీయాంశమైంది.

- న్యూస్‌టుడే, పాడేరు/పట్టణం

జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు 352 వరకు ఉన్నాయి. ఇందులో పాడేరు రెవెన్యూ డివిజన్‌లో 212 వరకు ఉండగా చాలా వరకు నిర్మాణ దశలోనే ఉన్నాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలలో కొన్నింటికి విద్యుత్తు మీటర్లకు బిల్లులు చెల్లించి క్రమ పద్ధతిలో విద్యుత్తును వినియోగించుకుంటున్నారు. మరికొన్నింటికి విద్యుత్తు సరఫరాకు సంబంధించి ఇంజినీరింగ్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు సమస్యగా మారింది. విద్యుత్తు మీటర్లకు డబ్బులు చెల్లించకుండానే భవనాలను గుత్తేదార్లు ప్రభుత్వానికి అప్పగించేస్తున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా లేకుండా ఒక్క పని కూడా ముందుకు సాగదు. తీరా సేవలు ప్రారంభించిన తర్వాత విద్యుత్తు లేమితో ఈ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సతమతమవుతున్నారు. సేవలకు ఇబ్బందులు కలుగకుండా స్థానిక ఉద్యోగులు పక్క కార్యాలయాల నుంచి అనధికారికంగా విద్యుత్తును తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు ఇటీవల కొన్ని సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసి చర్యలకు దిగారు.

ఎక్కడెక్కడ..?

* హుకుంపేట మండలం తడిగిరి గ్రామ సచివాలయాన్ని సుందరంగా నిర్మించారు. విద్యుత్తు మీటరు అమర్చకపోవడంతో రోజూ వస్తున్న లబ్ధిదారులకు సేవలు అందించడం లేదు. దీంతో వారంతా ఉద్యోగులను నిలదీస్తున్నారు. ఈ బాధ తట్టుకోలేక తాత్కాలిక సర్దుబాటులో భాగంగా విద్యుత్తు సరఫరాను ఏర్పాటు చేసుకుని సేవలు అందిస్తున్నారు. ఇటీవల ట్రాన్స్‌కో అధికారులు ఆ సచివాలయంపై దాడులు చేసి కనెక్షన్‌ను కట్‌ చేశారు.

* పాడేరు మండలం మినుములూరులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు పక్క పక్కనే ఉన్నాయి. అయితే రైతు భరోసా కేంద్రానికి మీటరు అమర్చారు. పక్కనే ఉన్న సచివాలయానికి మీటరు లేక పరస్పర సర్దుబాటుగా ఆర్‌బీకే నుంచి విద్యుత్తును తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే మండలం వంతాడపల్లి సచివాలయం కేంద్రంలోనూ విద్యుత్తు సమస్య నెలకొంది. గుత్తులపుట్టు గ్రామంలో చక్కని రైతు భరోసా కేంద్రం నిర్మించారు. ప్రజా ప్రతినిధులు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా మీటరు లేక పక్కనే ఉన్న పాఠశాల నుంచి కొన్నాళ్ల పాటు సరఫరాను తీసుకున్నారు. అక్కడ సమస్య తలెత్తడంతో పక్కనే ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ నుంచి కనెక్షన్‌ తీసుకున్నారు. టవర్‌కు లోడు సరిపోదని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు తమకు తెలియకుండా వినియోగిస్తున్న విద్యుత్తును కనెక్షన్‌ను తప్పించేశారు. అప్పటి నుంచి విద్యుత్తు సరఫరా లేక ఈ కేంద్రంలో సేవలు స్తంభించాయి. ఇక్కడ సిబ్బంది పక్కనే ఉన్న సచివాలయానికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ఇలా జిల్లాలో చాలా ఇదే పరిస్థితి నెలకొంది.


విద్యుత్తు మీటరు లేక సేవలు స్తంభించిన మినుములూరు రైతు భరోసా కేంద్రం

సరఫరా ఇచ్చేందుకు సిద్ధం

సచివాలయ, రైతు భరోసా కేంద్రాలు కేటగిరీ-2 కిందకు వస్తాయి. దీనికి సంబంధించి విద్యుత్తు మీటరు కోసం రూ.2450 వరకు చెల్లిస్తే సరిపోతుంది. అనధికారిక విద్యుత్తు వినియోగంపై ఫిర్యాదులు అందాయి. ఇటీవల అధికారులు ముమ్మర దాడులు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు. విద్యుత్తు మీటరుకు డబ్బులు చెల్లించిన  మరుక్షణమే 50 మీటర్ల లోపు దూరంలో ఉంటే మేమే కనెక్షన్‌ ఇచ్చేస్తాం. అలా కాకుండా 50 మీటర్లు దాటి ఉంటే అదనంగా పడే విద్యుత్తు స్తంభానికి సంబంధిత పార్టీ వారే భరించుకోవాలి. సమీపంలో ఉన్న సచివాలయాలకు ఇప్పటికే విద్యుత్తు మీటరు అమర్చాం. సమీపంలో విద్యుత్తు స్తంభాలు లేని చోట్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా పక్క కార్యాలయాల నుంచి అనధికారికంగా కనెక్షన్లు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమే. దీనిపై సర్వే చేపట్టి గుర్తించిన అనధికార వినియోగంపై చర్యలు తీసుకుంటాం.

- ప్రభాకరరావు, పాడేరు, హుకుంపేట మండలాల ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని