logo

బలమైన విద్యా వ్యవస్థ అవసరం

దేశం అభివృద్ధి చెందాలంటే బలమైన విద్యా వ్యవస్థ కలిగి ఉండాలని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు.

Published : 26 Jan 2023 02:26 IST

త్రిదండి చినజీయర్‌ స్వామి

మొక్క నాటి నీరు పోస్తున్న చినజీయర్‌ స్వామి, చిత్రంలో ఏయూ వీసీ
ఆచార్య ప్రసాదరెడ్డి తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: దేశం అభివృద్ధి చెందాలంటే బలమైన విద్యా వ్యవస్థ కలిగి ఉండాలని త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బుధవారం స్వామి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో విద్యార్థులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. భారతీయ విద్యా వ్యవస్థ ఎంతో ఉత్కృష్టమైనదని, గతంలో విదేశీయులు ఎందరో మన దేశానికి వచ్చి విద్య అభ్యసించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తి ఉన్నత స్థానం నుంచి మరింత ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. దీనికి విద్య ఒక సాధనంగా నిలుస్తుందన్నారు. సమాజ హితం కోరుతూ చేసే ప్రతి పని దేవుని సేవతో సమానమన్నారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను సమాజం కోసం వినియోగించాలన్నారు. వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలో సీవీ రామన్‌, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వ్యక్తులు సేవలందించారన్నారు. దేశం కోరుకునే ఉత్తమ పౌరులుగా ఏయూ విద్యార్థులు మారాలని ఆకాంక్షించారు.

ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో భూమి పూజ

అంతకుముందు స్వామీజీ ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో చదును చేసిన 16 ఎకరాల మైదానంలో నాలుగు స్తూపాల నిర్మాణానికి సంబంధించి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేశారు. ఈ నాలుగు స్తూపాల మధ్యలో మరో ఎత్తైన స్తూపం నిర్మించనున్నట్లు వీసీ తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలసి అదే మైదానంలో స్వామీజీ 108 ఔషధ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. శమీ మొక్క నాటి నీరు పోశారు. ఈ మైదానానికి ‘ఊర్జా’ అని నామకరణం చేశారు. ఊర్జా అంటే సంస్కృతంలో తేజస్సు అని అర్థమని వివరించారు. తర్వాత బీచ్‌రోడ్డులోని ఏయూ యోగా విలేజ్‌ను సందర్శించి పతంజలి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఏయూ పరిపాలనా భవనాన్ని సందర్శించి వీసీ ఆచార్య ప్రసాదరెడ్డికి ఆశీర్వచనాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని