logo

రాజశ్యామల యాగం.. బృహత్తర యజ్ఞం

రాజశ్యామల అమ్మవారి యాగం వ్యాపారం కాదని, అంగ దేవతల హోమాలతో కూడిన బృహత్తర యజ్ఞమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి స్పష్టం చేశారు.

Updated : 01 Feb 2023 06:31 IST

వార్షికోత్సవాల ముగింపులో పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి

పూర్ణాహుతిలో మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు

చినముషిడివాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: రాజశ్యామల అమ్మవారి యాగం వ్యాపారం కాదని, అంగ దేవతల హోమాలతో కూడిన బృహత్తర యజ్ఞమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి స్పష్టం చేశారు. అయిదు రోజుల పాటు జరిగిన పీఠం వార్షికోత్సవాలు మంగళవారం వైభవోపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. హిందూ ధర్మానికి ఉనికి ఆదిశంకరులేనన్నారు. ఆయన తత్వాన్ని అనుసరించి కాపాడుతున్న వారిని పీఠం సత్కరిస్తుందన్నారు. శాస్త్ర, శ్రౌత సభలో ప్రతిభ కనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రికి ‘వ్యాకరణ భాస్కర బిరుదు’ను ప్రదానం చేశారు.

పీఠాధిపతులతో మాట్లాడుతున్న సుబ్బారెడ్డి దంపతులు, చిత్రంలో ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్‌, ముత్తంశెట్టి 

పూర్ణాహుతిలో పాల్గొన్న ప్రముఖులు

రాజశ్యామల యాగం ముగింపును పురస్కరించుకుని జరిపిన మహా పూర్ణాహుతిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు. తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, కంపెనీస్‌ లా ట్రైబ్యునల్‌ న్యాయమూర్తి బదరీనాథ్‌, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెతకంశెట్టి గణబాబు, జిల్లా వైకాపా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు, విజయనగరం ఆర్డీవో ఎంవీ.సూర్యకళ, విశాఖ గ్రామీణ జిల్లా వైకాపా మాజీ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు, సింహాచలం దేవస్థానం ట్రస్టీ గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. శారదాపీఠం వార్షికోత్సవాలు దిగ్విజయంగా జరగడంపై తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ రాజశ్యామల యాగం ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో తితిదే అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఇలాంటి యాగాలు, మహోత్సవాలు హిందూ ధర్మప్రచారానికి ఎంతో దోహదపడుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేసినట్లు వివరించారు. షట్ శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్‌లాల్‌, మణి ద్రావిడ శాస్త్రి, ఆర్‌.కృష్ణమూర్తి, శ్రౌత పండితుడు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని