logo

ప్రాణవాయువుకు లోటు లేకుండా..

పాడేరు జిల్లా ఆసుపత్రిలో కరోనా ఉద్ధృతంగా ఉన్న కాలంలో ప్రాణవాయువు కొరత వేధించింది. ఊపిరాడక కొవిడ్‌ భూతానికి నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే.

Published : 01 Feb 2023 02:01 IST

జిల్లా ఆసుపత్రిలో భారీ ఏర్పాట్లు
పాడేరు, న్యూస్‌టుడే

పాడేరు ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్‌

పాడేరు జిల్లా ఆసుపత్రిలో కరోనా ఉద్ధృతంగా ఉన్న కాలంలో ప్రాణవాయువు కొరత వేధించింది. ఊపిరాడక కొవిడ్‌ భూతానికి నిండుప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే. కొవిడ్‌కు ముందు ఆక్సిజన్‌తో ఆసుపత్రులకు పెద్దగా పని ఉండేది కాదు. కొద్దో గొప్పో నిల్వలు ఉంచుకుని ఊపిరాడని రోగులకు అందించేవారు. ఆ సమయంలో కేవలం ఊపిరందక కొట్టుమిట్టాడుతూ పలువురు మృత్యువాత పడిన ఉదంతాలు ఉన్నాయి. వీటిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లా ఆసుపత్రికి ఓ ఆక్సిజన్‌ యూనిట్‌ను సమకూర్చుతోంది.

ఎల్‌ఎంవో నిల్వ కేంద్రం

500 పడకల స్థాయికి తగ్గట్లుగా...

కొవిడ్‌ సమయంలో స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో విశాఖ కేజీహెచ్‌ నుంచి సిలెండర్ల రూపంలో ఇక్కడకు తరలించేవారు. అవీ అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో రోగులు నానా అవస్థలు ఎదుర్కొనేవారు. ఇక్కడున్న తీవ్రతను గుర్తించిన అమెరికన్‌-ఇండియా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ అప్పట్లో ఓ యూనిట్‌ను సమకూర్చి ఆదుకుంది. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో 500 లీటర్ల ఎల్‌పీఎం (లీటర్‌ ఫర్‌ మినిట్‌) సామర్థ్యమున్న ఓ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. దీంతోపాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో 500 లీటర్లు ఉత్పతి సామర్థ్యమున్న కేంద్రాన్ని నెలకొల్పారు. భవిష్యత్తులో నిల్వలు సమృద్ధిగా ఉండాలని భావించి 500 పడకల ఆసుపత్రి స్థాయికి తగ్గట్లుగా 10 వేల లీటర్ల నిల్వ సామర్థ్యమున్న లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంవో) యూనిట్‌ను తాజాగా ఏర్పాటు చేశారు. ఈ ట్యాంకులో అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ను వేరో చోట నుంచి తీసుకొచ్చి నిల్వ ఉంచుతారు. ఈ మూడు ప్లాంట్‌లు అందుబాటులోకి రావడంతో కొవిడ్‌ వంటి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆక్సిజన్‌ కొరత ఎంత మాత్రం ఉండదని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారావు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని