logo

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు కొనసాగించాలి

అంబేడ్కర్‌ పేరు కోనసీమ జిల్లాకు కొనసాగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ కోనసీమలో విధ్వంస..

Updated : 26 May 2022 06:13 IST

మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌


లాడ్జికూడలిలో నిరసన ప్రదర్శన చేస్తున్న అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

బ్రాడీపేట, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ పేరు కోనసీమ జిల్లాకు కొనసాగించాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు లాడ్జికూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ కోనసీమలో విధ్వంస వాతావరణాన్ని నెలకొల్పడంపై మాలమహానాడు, దళిత, ప్రజా సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. ముందుగా నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు పట్టుకొని కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలని నినాదాలు చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య దళిత నాయకులను నిలువరించగా, శాంతియుతంగా తమ నిరసన ప్రదర్శన ఉంటుందని, 20 నిమిషాల పాటు అనుమతి ఇవ్వాలని కోరగా ఇచ్చారు. అంతలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడతామని, అనుమతి ఇవ్వాలని కోరగా, డీఎస్పీ కుదరదని చెప్పడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించి విధ్వంసం సృష్టిస్తుంటే చోద్యం చూసిన పోలీసులు శాంతియుతంగా నిరనస తెలియజేస్తామంటే తమను అడ్డుకోవడం సరికాదని, లాడ్జికూడలిలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి దళిత నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. నిరసన ప్రదర్శనను భగ్నం చేస్తే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా గోళ్ల అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ సాక్షాత్తు దళిత మంత్రి విశ్వరూప్‌ ఇంటిపైనే వందల సంఖ్యలో రౌడీమూకలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు నిలువరించలేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని, లేకపోతే త్వరలో చలో కోనసీమను నిర్వహిస్తామని హెచ్చరించారు. భీమ్‌సేనా సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్‌ పేరును కోనసీమ జిల్లాకు వ్యతిరేకించడం సిగ్గుచేటన్నారు. సుమారు రెండు గంటల పాటు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బత్తుల అనిల్‌కుమార్‌, బత్తుల వీరాస్వామి, చార్వాక, మద్దు అంకయ్య, వైకే, శిరిపురపు శ్రీధర్‌, జూపూడి శ్రీనివాస్‌, మాలమహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోదా జాన్‌పాల్‌, చేబ్రోలు మనోరంజని, పిల్లి మేరి, గనిక జాన్సీ, దారా హేమప్రసాద్‌, జొన్నలగడ్డ శ్రీకాంత్‌, పాగళ్ల ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

కోనసీమ జిల్లాలో జరుగుతున్న హింసకు కారకులైన వారిని వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొంతా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు వ్యతిరేకించి విధ్వంసానికి పాల్పడటంపై స్థానిక లాడ్జికూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు నల్లపు నీలాంబరం, చింతా రామ్‌ప్రసాద్‌, చిరతనగండ్ల వాసు, మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని