logo

AP News: ఫలితం ముందే ‘వెల’విల.. తామొగ్గలేమని తేల్చిచెబుతున్న వైకాపా శ్రేణులు

‘‘భీమవరానికి చెందిన కొందరు రాజులు బాపులపాడు వైకాపా నాయకులతో పందెం కాశారు. కూటమి ప్రభుత్వమే వస్తుందని భీమవరం రాజులు, వైకాపానే గెలుస్తుందని బాపులపాడు వాళ్లు పందెం ఒడ్డారు.

Updated : 25 May 2024 09:39 IST

రెండింతల సొమ్ము ఇస్తామని పందేలకు సై...

‘‘భీమవరానికి చెందిన కొందరు రాజులు బాపులపాడు వైకాపా నాయకులతో పందెం కాశారు. కూటమి ప్రభుత్వమే వస్తుందని భీమవరం రాజులు, వైకాపానే గెలుస్తుందని బాపులపాడు వాళ్లు పందెం ఒడ్డారు. కూటమి వస్తే వైకాపా నాయకులు రూ.25 లక్షలు ఇచ్చేలా.. వైకాపా గద్దెనెక్కితే భీమవరం రాజులు రూ.50 లక్షలు ఇచ్చేలా పందెం కాసి ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. కొంత సొమ్ము మధ్యవర్తుల వద్ద ఉంచారు.’’

మళ్లీ వైకాపా ప్రభుత్వం వస్తుందనీ, జగన్‌ సీఎం అవుతారని నందిగామలో వైకాపా నాయకుడు తన స్థలాన్ని పందెం కాశాడు. తెదేపా అభిమాని ఆ భూమి విలువ కంటే రెట్టింపు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పందెంలో పెట్టిన స్థలం ఒప్పంద రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు.

ఈనాడు, అమరావతి:  సంక్రాంతి వేళ కోడిపందేల బరులు.. జోరుగా పందేలు సుపరిచితమే. బలిష్టమైన కోడి ఉంటే.. ఒకటికి రెండు రెట్లు పందెం కాస్తుంటారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఒకటికి రెండని పందెంరాయుళ్లు తిరుగుతున్నారు. ఆకర్షణీయ పందెం ఆఫర్‌ చేస్తున్నా.. వైకాపా వారు ముందుకు రావడం లేదు. అడపాదడపా.. ప్రభుత్వ ఏర్పాటుపై పందెం కాస్తున్నారే తప్ప.. ఎమ్మెల్యేల గెలుపుపై ఉలుకూ పలుకూ లేదు. నిన్నమొన్నటి వరకు ఆధిక్యాలపై పందెం కాసిన వారూ వెనుకంజ వేస్తున్నారు. తాము తప్పక గెలుస్తామని ప్రకటించిన వైకాపా ఎమ్మెల్యేల ఇలాకాల్లోనూ 1:2 పందేలు జరుగుతున్నా స్పందన లేదు. బుకీలు సైతం కిమ్మనడం లేదు. కోదాడ, ఖమ్మం, నూజివీడు, భీమవరం, ఏలూరు ప్రాంతాల వారూ తెదేపా తరఫున భారీగా ఆఫర్‌ చేస్తూ ఊరిస్తున్నా పందెంరాయుళ్లు ముందుకు రావట్లేదు.

ఇదీ పరిస్థితి..!

విజయవాడ సెంట్రల్, మైలవరం, పెనమలూరు, గుడివాడ, గన్నవరం, బందరుల్లో గెలుపు కోసం వైకాపా చేయని అరాచకాలు లేవు. పోలింగ్‌ సరళి తర్వాత వైకాపా నేతల్లో నిరుత్సాహం నెలకొంది. అటుతిప్పి ఇటుతిప్పి కనీసం 500 ఓట్లతో బయటపడతామనే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ 1:2 మేర పందేనికి సై అన్నా.. ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. 

  • బాపులపాడు మండలంలో గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్‌కు 10 వేల ఓట్ల ఆధిక్యం వస్తుందనీ.. అంత రాదని వైకాపా అభిమానులు రూ.10 లక్షల చొప్పున పందెం కాసి మధ్యవర్తి వద్ద డబ్బులు ఉంచారు. ఇక్కడ ఎమ్మెల్యే గెలుపుపై ఎవరూ పందెం కాయడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపైనే కొందరు పందెం కాశారని తెలిసింది. అవికూడా హెచ్చు పందేల ఒప్పందాలే. ఐప్యాక్‌ కార్యాలయాన్ని సీఎం సందర్శించాక వైకాపా తరపున పూర్తిగా పందేలు తగ్గాయని ఒకరు విశ్లేషించారు. 
  • గుడివాడలో తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధిస్తారని 1:2 చొప్పున పందేలు కాస్తున్నారు. కొందరు నూజివీడువాసులు.. గుడివాడలో రూ.20 లక్షల పందెం కాశారు. వైకాపా వస్తే.. రూ.20 లక్షలు, కొడాలి నాని గెలిస్తే.. తెదేపా వారు రూ.40 లక్షలు ఇవ్వాలి. ఇలాంటి పందేలకు ముందుకు రావడం లేదు. రి మైలవరం తెదేపా అభ్యర్థికి 10 వేల ఆధిక్యం వస్తుందనీ, పది వేలలోపు ఉంటుందని.. విజయవాడ గ్రామీణంలో వైకాపా కార్యకర్తల మధ్య పందెం జరిగింది. ఇరువురు సొమ్మును మధ్యవర్తిగా సర్పంచి వద్ద భద్రపరిచారు. 
  • విజయవాడ పశ్చిమలో వైకాపా గెలుపు ధీమాతో ఉండేది. ఇక్కడ భాజపా తరపున సుజనా బరిలో దిగాక సమీకరణాలు మారాయి. వైకాపా గెలుపుపై ఒక్కరూ ముందుకు రావడం లేదు.

‘తూర్పు’లో ఆసక్తికర చర్చ

విజయవాడ తూర్పులో వైకాపా తరపున పందేలతో ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ఎన్నికల్లో గుడివాడలో పోటీ చేసి ఓడిపోవడం, సీనియర్‌ నాయకుడి కుమారుడిగా గుర్తింపుతో అవినాష్‌ సానుభూతి కోసం యత్నించారనీ.. మరోవైపు హ్యాట్రిక్‌ ముందున్న గద్దె రామ్మోహన్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌ సులువుగా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెదేపా గెలిచే తొలిసీటు తూర్పే అనీ.. స్వల్ప ఆధిక్యంతోనైనా హ్యాట్రిక్‌ కొడుతున్నామని పందేలకు సై అంటున్నారు. పామర్రులోనూ అంచనాలు మారడంతో తెదేపా అభ్యర్థి వర్ల కుమార్‌రాజా గెలుస్తున్నారని పలు గ్రామాల్లో రూ.లక్షకు రూ.1.50 లక్షలు ఇచ్చేలా పందేలు కాశారు.  

ఆ పార్టీ నుంచి స్పందన నిల్‌..!

గత ఎన్నికల్లో జిల్లాలో రూ.కోట్లలో పందేలు జరిగాయి. నాడు ఎకరాలనే పణంగా పెట్టారు. తెదేపా గెలుస్తుందని పందేలు కాసి రూ.లక్షలు, రూ.కోట్లు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం అధికారంలలో ఉన్న వైకాపా అదే మాదిరి ప్రభుత్వం వస్తుందని ఆశలు కల్పిస్తుందనీ, పోలింగ్‌ సరళి తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని భావించి వైకాపా తరపున ఆసక్తి ప్రదర్శించడంలేదు. 1:2, 1:3 చొప్పున ఆకర్షణీయ పందేలకు మాత్రం కొందరు మొగ్గు చూపుతున్నారు. అదీ చంద్రబాబు సీఎం అవుతారనే దానిపైనే పందేలు కాస్తున్నారు. విజయవాడ ఎంపీ గెలుపు, ఆధిక్యంపై ఒక్కరూ స్పందించడంలేదు. కేశినేని చిన్ని గెలుపుపై 1:1.5 చొప్పున ముందుకు వస్తున్నా.. పందెం పడటంలేదు. బందరు ఎంపీ బాలశౌరి గెలుపుపై ఒకటికి మూడు రెట్లు ఇస్తామన్నా.. వైకాపా తరపున రావడం లేదు.
విజయవాడ సెంట్రల్‌లో మాజీ మంత్రి వెలంపల్లి తరఫున ఒక్క పందెం రాకపోగా.. ఓడిపోతారని పందెం కాస్తున్నారు. పెనమలూరు జోగిపై అదే తీరు. పెనుగంచిప్రోలులో కూటమి ప్రభుత్వం వస్తే రూ.10 లక్షలు, వైకాపా గద్దెనెక్కితే రూ.15 లక్షలు ఇచ్చేలా ఓ పందెం జరిగింది. బందరులో పేర్ని కిట్టూ గెలుపుపై ఒక్కరూ పందెం కాయడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని