logo

ప్రతిస్పందన లేదాయె..!

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకున్న రైతులు ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి స్పందనలో పదే పదే ఫిర్యాదులు చేసుకోవాల్సిన దుస్థితి ఈరోజుకీ కొనసాగుతోంది.

Published : 28 Jun 2022 05:53 IST

పరిష్కారమవుతున్నవి తక్కువే

కలెక్టరేట్‌ (మచిలీపట్నం), న్యూస్‌టుడే


అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌లో నిరీక్షిస్తున్న ప్రజలు (పాతచిత్రం)

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకున్న రైతులు ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి స్పందనలో పదే పదే ఫిర్యాదులు చేసుకోవాల్సిన దుస్థితి ఈరోజుకీ కొనసాగుతోంది.


బాపులపాడు మండలానికి చెందిన దివ్యాంగుడు కూతురికి కట్నం కింద ఇచ్చిన 1.90 ఎకరాల భూమి దస్తావేజుల ప్రకారం వెబ్‌ల్యాండ్‌లో లేకపోవడంతో తన గోడు పట్టించుకోవాలంటూ క్రమం తప్పకుండా స్పందనను ఆశ్రయిస్తున్నా ఇప్పటి వరకూ ఫలితం శూన్యం.


ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పందనకు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా పలువురు బాధితులకు ఆశించిన న్యాయం దక్కడంలేదు. పరిష్కార యోగ్యమైన ఫిర్యాదులను సైతం క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్ల అర్జీదారులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సరిచేసుకునే స్థితిలో ఉండే లోటుపాట్లను పట్టించుకోకుండా పరిష్కారయోగ్యం కాదన్న సమాధానంతో సరిపెడుతున్నారు.

రెవెన్యూపరమైన అంశాలే ఎక్కువే

కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికశాతం రెవెన్యూ పరమైనవే. మండల స్థాయిలో సంతృప్తికర సమాధానాలు వచ్చే పరిస్థితి లేనప్పుడు పలువురు కలెక్టరేట్‌ను ఆశ్రయిస్తున్నారు. తిరిగి ఆ ఫిర్యాదులు మండల స్థాయికే వెళ్తుండడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. ఫలితంగా ఒకే సమస్య పరిష్కారం కోసం బాధితులు పదే పదే స్పందనకు అర్జీలు సమర్పిస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనకు సగటున 150 అర్జీలు అందుతుండగా కేవలం వేళ్లమీద లెక్కించే స్థాయి అర్జీలకే సత్వర పరిష్కారం లభిస్తోంది.  

సగటున నెలకు 280 ఫిర్యాదులు

బాధితులకు తక్షణం న్యాయం చేకూర్చాలన్న లక్ష్యంతో ఏడాది నుంచి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో రోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున 280 ఫిర్యాదుల అందుతుండగా వాటిల్లో అత్యధికశాతం మహిళా వేధింపులకు సంబంధిచినవే అవుతుండగా తర్వాత స్థానం నమ్మించి మోసం చేసిన సంఘటనలవిగా ఉంటున్నాయి. వీటితో పాటు ఆస్తి సంబంధిత వివాదాలు,  కన్నబిడ్డలు నిలువనీడ లేకుండా చేశారని, మోసపూరితంగా ఆస్తి కాజేశారని,  తిండి పెట్టకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ వృద్ధులైన తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కౌన్సెలింగ్‌ ద్వారా 15 శాతం ఫిర్యాదులకు సత్వర పరిష్కారం లభిస్తుండగా మిగిలినవి సంబంధిత పోలీస్‌ అధికారులకు బదలాయిస్తున్నారు.

బాధ్యత తీసుకుంటే కచ్చిత పరిష్కారం

సమస్య మూలాల వరకూ అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల పరిష్కారయోగ్యమైన వాటి విషయంలోనూ బాధితులు కలెక్టరేట్‌ చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోందనడానికి మొవ్వ మండలానికి చెందిన శివపార్వతే నిదర్శనం. ఏడాదిన్నర క్రితం మరణించిన భర్తకు మంజూరైన బీమా మొత్తం రూ.2.లక్షలు తనకు అందలేదంటూ అప్పటి నుంచి స్పందనలో అర్జీలు సమర్పిస్తూనే ఉంది. పట్టువిడవకుండా వస్తున్న ఆమె అర్జీపై కలెక్టర్‌ రంజిత్‌బాషా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. శివపార్వతిది జనధన్‌ ఖాతా అవడం, అందులో రూ.50వేలకు మించి నగదు జమపడే అవకాశం లేకపోవడం వల్ల బీమా చెక్కు నాలుగు విడతలుగా వెనక్కి వెళ్లిపోయిన్నట్టు తేలింది.


పదే పదే ఆరా..

ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు రీఓపెన్‌ అర్జీలపై దృష్టి సారించడంతో శివపార్వతి తరహా అర్జీల పరిష్కారం విషయంలో కొంత ఆశావహమార్పులు కన్పిస్తున్నాయి. పదేపదే వచ్చే వాటి గురించి కలెక్టర్‌, జేసీలు ఆరా తీస్తుండటంతో మండల, డివిజన్‌ స్థాయి అధికారులు సునిశితంగా దృష్టిసారిస్తున్నారు. ఇతరత్రా సమస్యలు ఎలా ఉన్నా స్పందన అర్జీలను నిరంతరం సజీవంగా ఉండేలా చేస్తున్న రెవెన్యూ శాఖ పరిధిలోకి వచ్చే భూసంబంధిత సమస్యలు, ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలు, ధాన్యం నగదు చెల్లించే విషయంలో సాంకేతిక కారణాలతో చోటుచేసుకుంటున్న ఎడతెగని జాప్యం వంటి సమస్యల పట్ల అధికార యంత్రాంగం మరింతగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. స్పందన అర్జీల పరిష్కారం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, అపరిష్కృత, రీఓపెన్‌ అర్జీలు లేకుండా ప్రతి వారం సమీక్షిస్తున్నట్టు కలెక్టర్‌ రంజిత్‌బాషా స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని