logo

బందరు ఓడరేవు పనుల్లో కదలిక

అది గతంలోనే బందరు పోర్టుకు కేటాయించిన భూమి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదిగా ఉంది.

Published : 01 Dec 2022 06:12 IST

1730 ఎకరాలకు సర్వే నోటిఫికేషన్‌ జారీ
పీఎఫ్‌సీ రుణం మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌

ఈనాడు, అమరావతిన్యూస్‌టుడే, కోనేరు సెంటర్‌,గొడుగుపేట: అది గతంలోనే బందరు పోర్టుకు కేటాయించిన భూమి. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదిగా ఉంది. తాజాగా ఈ భూమి అన్‌సర్వే భూమిగా పేర్కొంటూ ప్రజాప్రయోజనాల కోసం సర్వే చేసి నెంబర్లు కేటాయించాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సముద్ర మట్టానికి దగ్గరలో ఉన్న భూమిని గుర్తిస్తూ.. 1730.32ఎకరాలను నోటిఫై చేశారు. బందరు పోర్టు నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2019 ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేశారు. అక్కడ దాదాపు 700 ఎకరాలు నిర్మాణ సంస్థ నవయుగకు స్వాధీనం చేశారు. తాజాగా మళ్లీ నోటిఫికేషన్‌ చేయడం విశేషం.

‘డిసెంబరు 21న బందరు ఓడరేవుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా దీనికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నాం. పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణం ఇచ్చేందుకు అంగీకరించింది..!’ అని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల వెల్లడించారు. బుధవారం మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
బందరుపోర్టు  పనులు ఎప్పుడు ప్రారంభిస్తారనేదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నా.. ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని తెలిసింది. ఈ అనుమతులు వచ్చిన వెంటనే మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం వ్యయంలో 75శాతం పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణం, 25 శాతం ఏపీ మారిటైం బోర్డు భరించనుంది. మొత్తం రూ.5,253.89కోట్లు ఖర్చుకానుంది.

కొత్త డీపీఆర్‌ ప్రకారమే..

తెదేపా ప్రభుత్వ హయాంలో రూపొందించిన డీపీఆర్‌ను పక్కన పడేశారు. తాజాగా రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం నిర్మాణం చేయనున్నారు. మొదటి దశలో 4 బెర్తులు నిర్మాణం జరుగుతుంది. వీటిలో మూడు కార్గో, ఒకటి సాధారణ బెర్తు ఉంటుంది. ఒకటి ప్రత్యేకంగా బొగ్గు, ఇనుప ఖనిజం కోసం కేటాయించనున్నారు.  26.12 మిలియను టన్నుల కార్గొ ఎగుమతి లక్ష్యం. రెండో దశలో 12 బెర్తుల నిర్మాణం పూర్తి చేస్తారు. దీనికి 89.85మిలియన్‌ టన్నుల కార్గో  ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 16 బెర్తుల సామర్థ్యం సుమారు 106 మిలియన్‌ టన్నులు.  పోర్టు నిర్మాణం ద్వారా 20 వేల మందికి ప్రత్యక్ష పరోక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగాల కల్పన జరుగనుందని డీపీఆర్‌లో పేర్కొన్నారు. రూ.3,683.83కోట్లతో  డీప్‌ వాటర్‌ పోర్టు 4 బెర్తులు నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికి 33 నెలలు నిర్మాణ గడువు.  ఇంతవరకు భూమిని అప్పగించలేదు.

రెండు దశల్లో సేకరణ

రెండు దశలకు కలిపి మొత్తం 3,876 ఎకరాలు సరిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుతం మొదటి దశలో 1730 ఎకరాలను ప్రభుత్వ భూమి తీసుకోనున్నారు. దీనికి అదనంగా రోడ్డు, రైలు మార్గం అనుసంధానానికి 235 ఎకరాలు కావాల్సి ఉంది. రెండో దశలో 1906 ఎకరాలు సేకరించనున్నారు. మొదటి దశ సముద్రపు భూమి కోసం (అన్‌సర్వే ల్యాండ్‌) సర్వే,సెటిల్‌మెంట్‌ ల్యాండ్‌ రికార్డు కమిషనర్‌ సిద్దార్థజైన్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మచిలీపట్నం మండల పరిధిలో మంగినపూడి బీచ్‌ సమీపంలో 788.07 ఎకరాలు, తెవిసిపూడి గ్రామం పరిధిలో అన్‌సర్వే భూమి326.90 ఎకరాలు, గోపవానిపాలెం గ్రామం పరిదిలో 477.12 ఎకరాలు, కరగ్రహారం పరిధిలో138.23 ఎకరాలను కేటాయించారు. దీనికి కొత్తగా సర్వే నెంబర్లు కేటాయించి పోర్టుకు అప్పగిస్తారు

మచిలీపట్నం-విజయవాడ రహదారి
ఆరు లైన్లగా అభివృద్ధి: పేర్ని నాని

మచిలీపట్నం పోర్టు పనులు జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉందని  ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. బందరులో బుధవారం విలేకరులతో మాట్లాడారు.  ఇప్పటి వరకు న్యాయపరమైన చిక్కుల వల్ల ఆలస్యం జరిగిందని, అవి తొలగిపోయాయని, కేంద్ర నుంచి పర్యావరణ అనుమతులు సైతం మూడు వారాల్లో వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు లేన్ల రహదారిగా ఉన్న మచిలీపట్నం-విజయవాడ రహదారిని ఆరు లేన్‌లుగా విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధం చేసేలా ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయని చెప్పారు. తానో, ఎంపీ బాలశౌరి, ఇంకా ఎవరో చెబితే రుణాలు మంజూరు చేయరని, ప్రభుత్వ హామీతోనే పవర్‌ కార్పొరేషన్‌ రుణం ఆమోదించిందన్నారు. ముఖ్యమంత్రి జన్మదినమైన డిసెంబరు 23న పోర్టు పనులు ప్రారంభిస్తామంటూ ఎంపీ చేసిన వాఖ్యలపై మాట్లాడుతూ రుణం వచ్చిందన్న ఆనందంతో అలా చెప్పి ఉండవచ్చన్నారు. పోర్టు శంకుస్థాపన అంశాన్ని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని, పోర్టు రాజకీయాలను చీదరించుకుంటున్న నేపథ్యంలో శంకుస్థాపనల హడావుడి లేకుండా ఏకంగా పనులే ప్రారంభించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు.

పోర్టుకు త్వరలోనే పర్యావరణ అనుమతులు

బందరు పోర్టుకు త్వరలోనే పర్యావరణ అనుమతులు వస్తాయని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. ఈ అంశంపై బుధవారం దిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భూపేందర్‌యాదవ్‌ను కలిసి విన్నవించగా.. సానుకూలంగా స్పందించారన్నారు. తుది నిర్ణయం వెలువడించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆ శాఖ అదనపు కార్యదర్శి తన్మయకుమార్‌ను, మెంబర్‌ సెక్రటరీ అమర్‌దీప్‌ రాజాను ఆదేశించారని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని  అన్నారు.

‘పనులు ప్రారంభించకుంటే మళ్లీ ఉద్యమిస్తాం’

పోర్టు నిర్మాణంపై ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకోవాలని పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌ కోస్తా మురళీకృష్ణ అన్నారు. బందరు పోర్టు నిర్మాణంపై ఎంపీ, ఎమ్మెల్యేలు వేర్వేరు ప్రకటనలు చేయడంపై ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పర్యావరణ అనుమతులు ఎప్పుడు వస్తాయి? పోర్టు నిర్మాణానికి తెచ్చే రుణానికి ఏమి పూచీకత్తు చూపిస్తున్నారు? తదితర అంశాలపై స్పష్టత లేదన్నారు. ఏమీ లేకుండా ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నానిలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారని, పనులు ప్రారంభించకపోతే మళ్లీ ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు