logo

కడప జిల్లా సంస్థకే కాంట్రాక్టు..!

 కృష్ణా నది వరదల నుంచి విజయవాడ నగరాన్ని కాపాడేందుకు నిర్మించనున్న గోడ కాంట్రాకు కడప జిల్లా గుత్తేదారుకు అభించింది.

Published : 01 Dec 2022 06:12 IST

1.83 శాతం అధిక ధరలకే కృష్ణానది రక్షణ గోడ టెండర్‌

ఈనాడు, అమరావతి:  కృష్ణా నది వరదల నుంచి విజయవాడ నగరాన్ని కాపాడేందుకు నిర్మించనున్న గోడ కాంట్రాకు కడప జిల్లా గుత్తేదారుకు అభించింది. గతంలో రెండో ప్యాకేజీ పనులు చేసిన గుత్త సంస్థకే కట్టబెట్టారు. మొత్తం 1.83 శాతం అధిక రేట్లకు ఈ టెండర్‌ దక్కించుకున్నారు. ముందస్తు వ్యూహం ప్రకారం టెండర్లను దాఖలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.  రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో 1.83శాతం అధిక ధరలకు వీఎస్‌ఎస్‌ కనస్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. మూడో దశ వరద రక్షణ గోడ నిర్మాణానికి జలవనరుల శాఖ రూ.137.85కోట్ల అంచనాలు రూపొందించిన విషయం తెలిసిందే. అక్టోబరులో ఈ అంచనాలను ఆమోదిస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతి జారీ చేసింది. తర్వాత దీన్ని జుడీషయల్‌ కమిటీ అభిప్రాయానికి పంపారు. కృష్ణా నదికి వస్తున్న వరదలకు తరచూ బ్యారేజీ దిగువన ఉన్న కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్‌, యనమలకుదురు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వర్షాకాలం వస్తే కనీసం లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసినా వరద ముంచెత్తుతుండేది. దీని పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయాంలో రక్షణగోడ నిర్మించారు. యనమలకుదురు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మొత్తం 7 కిలోమీటర్ల వరకు నిర్మించాలని నిర్ణయించారు. దీనిలో 2017లో మొదటి దశలో 2.50 కిలోమీటర్లు యనమలకుదురునుంచి రామలింగేశ్వర నగర్‌ వరకు మంజూరు చేశారు. మొత్తం 2.5 కిలోమీటర్ల దూరం రూ.165 కోట్లతో నిర్మాణం చేశారు. రెండో దశ రక్షణగోడ నిర్మాణం 2020లో ప్రారంభించారు. రెండోదశలో 1.25 కిలోమీటర్ల దూరం రామలింగేశర్‌నగర్‌ నుంచి వారధి వరకు నిర్మాణం చేశారు. దీనికి రూ.125 కోట్లను మంజూరు చేశారు. దీని శంకుస్థాపనకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడోదశకూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు రూ.137.85 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ జీవో 1844 ను విడుదల చేసింది. కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్‌(పీఎన్‌బీ బస్సు స్టేషన్‌) వరకు సుమారు 2.20కిలోమీటర్లు దూరం ఉంటుంది.   ఈ రక్షణగోడ నిర్మాణం అంచనాలు, అన్నీ ముందస్తుగా కడప సంస్థ సమకూర్చింది. మూడో దశ పనులు మంజూరులోనే సంస్థదే కీలక ప్రమేయంగా చెబుతున్నారు. ప్రస్తుతం దీని ఎలైన్‌మెంట్‌ మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పలువురు పేదలు ఎప్పటి నుంచో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరి గృహాలను కూల్చకుండా ఎలైన్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఒప్పందం ప్రకారమే..!

ముందస్తు ఒప్పందం ప్రకారమే రెండో ప్యాకేజీ పనులు చేసిన గుత్తసంస్థకే ఈ టెండర్‌ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో స్థానిక నేతలు జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిసింది. రెండోదశ గోడ నిర్మాణం రామలింగేశ్వర్‌నగర్‌ నుంచి వారధి వరకు కడప జిల్లాకు చెందిన సంస్థ వీఎస్‌ఎస్‌ కనస్ట్రక్షన్‌్్స నిర్మాణం చేసింది. ప్రస్తుతం మూడో దశ కూడా దానికే దక్కింది. ఒక డమ్మీ టెండర్‌ దాఖలు అయింది. . దాదాపు రూ.2.16కోట్లు అదనంగా భారం పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు