logo

చేతికి డబ్బిస్తేనే చితికి నిప్పు

కాసులిస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కుమారుడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఆరేళ్లుగా కుమార్తె వద్దే తల దాచుకుంటున్న ఆ వృద్ధ దంపతులపై కుమారుడు కనికరం చూపకపోవడంతో ఏర్పడ్డ ఈ దుస్థితి అందరినీ కంటతడి పెట్టించింది.

Published : 04 Feb 2023 03:27 IST

ఓ కుమారుడి నిర్వాకం.. అంత్యక్రియలు చేసిన కుమార్తె

అంత్యక్రియల్లో పాల్గొన్న కుమార్తె విజయలక్ష్మి

పెనుగంచిప్రోలు : కాసులిస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కుమారుడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఆరేళ్లుగా కుమార్తె వద్దే తల దాచుకుంటున్న ఆ వృద్ధ దంపతులపై కుమారుడు కనికరం చూపకపోవడంతో ఏర్పడ్డ ఈ దుస్థితి అందరినీ కంటతడి పెట్టించింది. దీంతో కన్న కూతురే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. మండలంలోని గుమ్మడిదుర్రులో శుక్రవారం మృతి చెందిన గింజుపల్లి కోటయ్యకు కన్న కొడుకు ఉండి కూడా కుమార్తె తలకొరివి పెట్టడం గమనార్హం. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడుకు చెందిన గింజుపల్లి కోటయ్య (80)కు ఆస్తి విషయంలో కొడుకుతో తరచూ గొడవలయ్యేవి. గతంలో కోటయ్యకు ఉన్న భూమిని విక్రయించగా సుమారు రూ.కోటి వచ్చాయి. అందులో రూ.30 లక్షలు తన వద్ద ఉంచుకొని మిగిలిన సొమ్మును కుమారుడికి ఇచ్చాడు. ఆ సొమ్మును కూడా ఇవ్వాలని కొడుకు తండ్రితో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కోటయ్య, అతని భార్య గత కొంతకాలంగా గుమ్మడిదుర్రులోని కుమార్తె వద్ద ఉంటున్నారు. అనారోగ్యానికి గురైన కోటయ్య శుక్రవారం మృతి చెందారు. తండ్రి మృతి విషయాన్ని కుటుంబ సభ్యులు కుమారుడికి చెప్పారు. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఖర్మ చేసేందుకు కుమారుడు నిరాకరించాడు. తండ్రి వద్ద ఉన్న డబ్బు ఇస్తేనే అంతిమసంస్కారాలు చేస్తానని భీష్మించాడు. కనీసం చూసేందుకు కూడా రాకపోవడంతో చేసేది లేక కుమార్తె విజయలక్ష్మి కర్మకాండ పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని