logo

అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ దిక్సూచి

అరబిక్‌, యూరోపియన్‌, ఇతర పాశ్చాత్య దేశాలతో సమానంగా వ్యాపార రంగంలో భారత్‌ అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి వైపు స్థిరంగా వెళ్లడం శుభపరిణామమని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

Published : 05 Feb 2023 05:39 IST

జ్యోతి వెలిగిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, అరుణ్‌కోమర్‌ హార్డియన్‌,
కమలేష్‌ ప్రకాష్‌, అహ్మద్‌ సులే, డా.జితేంద్రజోషి, డా.శంకర్‌ప్రసాద్‌శర్మ

విజయవాడ (కరెన్సీనగర్‌), న్యూస్‌టుడే: అరబిక్‌, యూరోపియన్‌, ఇతర పాశ్చాత్య దేశాలతో సమానంగా వ్యాపార రంగంలో భారత్‌ అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి వైపు స్థిరంగా వెళ్లడం శుభపరిణామమని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. గ్లోబల్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడ నోవోటెల్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన ‘నేషనల్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌-2023’ అవార్డుల ప్రదానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలువురు ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసేందుకు, స్వావలంబన సాధనకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా... పథకాలు ఆత్మనిర్బర్‌ భారత్‌ను సాకారం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా వివిధ పథకాలు, ప్రోత్సాహకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ వరి సాగుకు ప్రసిద్ధి చెందిందని, అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కావడంతో ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొచ్చిందన్నారు. దేశంలో హస్తకళలకు రాష్ట్రం ఎంతో పేరుగాంచిందని వివరించారు.  కార్యక్రమంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ సురినామ్‌ రాయబారి అరుణ్‌కోమర్‌ హార్డియన్‌, ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ నైజీరియా హైకమిషనర్‌ అహ్మద్‌ సులే, నేపాల్‌ రాయబారి డాక్టర్‌ శంకర్‌ ప్రసాద్‌ శర్మ, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఫిజీ హై కమిషనర్‌ కమలేష్‌ ప్రకాష్‌, గ్లోబల్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ జితేంద్ర జోషి, పలువురు పారిశ్రామిక వేత్తలు, అవార్డు విజేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని