బోధనలో భేష్
‘దేశంలోనే అత్యుత్తమ విద్యా విధానంతో చిన్నారులను తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థల జాబితాలో విజయవాడకు చెందిన రెండు పాఠశాలలకు చోటుదక్కింది.
అత్యుత్తమ విధానాలతో విద్యార్థులకు పాఠాలు
సీఐపీఎస్ జాబితాలో అభ్యాస విద్యాలయం, వికాస విద్యావనం
అభ్యాస విద్యాలయంలో కాగితాలతో ఆకృతులు
ఈనాడు, అమరావతి: ‘దేశంలోనే అత్యుత్తమ విద్యా విధానంతో చిన్నారులను తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థల జాబితాలో విజయవాడకు చెందిన రెండు పాఠశాలలకు చోటుదక్కింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ (సీఐపీఎస్) సంస్థ దేశ వ్యాప్తంగా అత్యుత్తమ, వినూత్న విద్యా విధానంతో బోధన చేస్తున్న 37 పాఠశాలలను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఎంపికైన రెండు పాఠశాలలూ విజయవాడలోనే ఉన్నాయి. విజయవాడ గుణదలలో ఉన్న అభ్యాస విద్యాలయం, పోరంకి, అడవినెక్కలంలో ఉన్న వికాస విద్యావనం ఈ రెండు సీఐపీఎస్ ఎంపిక చేసిన జాబితాలో ఉన్నాయి. ఇక్కడ అమలవుతున్న అత్యుత్తమ విద్యాబోధనా పద్ధతులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించి.. దానిని అన్ని రాష్ట్రాలకు పంపించనున్నారు.
నేర్చుకుంటూ చదువు...
గుణదల గంగిరెద్దులదిబ్బ ప్రాంతంలో ఉన్న అభ్యాస విద్యాలయంలో బోధనా విధానమే వినూత్నంగా ఉంటుంది. ప్రధానంగా ప్రాథమిక స్థాయి తరగతుల బోధనలో విద్యార్థుల మెదడుకు పదును పెట్టేలా బోధన సాగుతుంది. ఒకటి, రెండు, మూడు, నాలుగు తరగతి గదులు పేర్లతో ఉండవు. మేథ్స్, సైన్స్, తెలుగు, క్రాఫ్ట్ ఇలా సబ్జెక్టుల వారీగా తరగతి గదులుంటాయి. తరగతి గదిలో విద్యా శాఖ ప్రమాణాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు అనుగుణంగా పాఠ్యాంశాల బోధనతో పాటు విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించేలా ప్రతి విషయాన్ని నేర్పిస్తారు.
* మేథ్స్ గదిలో తూనికలు కొలతల పరికరాల నుంచి రకరకాల వస్తువులు, డబ్బులు, సామగ్రి ఉంటాయి. విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అన్నీ చెబుతూ లెక్కలు నేర్పిస్తారు. * తెలుగు గదిలో భాషకు సంబంధించినవి ఉంటాయి. విద్యార్థులతో ప్రాథమిక దశ నుంచే రాయించిన కథలు, వారి ఆలోచనలు అన్నీ ఎప్పటికప్పుడు రాయిస్తూ.. వాటిని పుస్తకాలుగా మార్చి భద్రపరుస్తుంటారు. చదువుతో పాటు ఆటలు, క్రాఫ్ట్, ఆర్ట్, కళలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో వైద్యులు, ఇంజినీర్లే కాదు.. కళాకారులు, చిత్రకారులు, ఆర్కిటెక్ట్‌లు ఇలా అందరూ ఉన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్య అందరికీ అందాలనే లక్ష్యంతో 1993లో 30 ఏళ్ల క్రితం దీప మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యాస విద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపల్ వై.వి.కృష్ణ, వ్యవస్థాపకురాలు జ్యోత్స్న వెల్లడించారు.
వికాస విద్యావనంలో బడి సంత
మనో ‘వికాస విద్యావనం’..
చదువంటే విద్యార్థుల మనోవికాసానికి తోడ్పాటు అందించడం, విలువలు నేర్పించడం, విద్యార్థుల్లోని నైపుణ్యాలకు మెరుగుపెట్టడం, చిన్నారులను ఆడుకోనివ్వడం.. వారిని స్వేచ్ఛగా ఎదగనివ్వడం అనేది వికాస విద్యావనంలో ఎటుచూసినా కనిపిస్తుంది. విజయవాడలోని పోరంకిలో 1983లో 40 ఏళ్ల క్రితం డాక్టర్ ఎస్.ఆర్.పరిమి ఈ పాఠశాలను నెలకొల్పారు. దీనికి అనుబంధంగా 12ఏళ్ల క్రితం అడవినెక్కలం గ్రామం సమీపంలోని అక్కినేని సుదర్శనపురంలో ప్రశాంతమైన వాతావరణంలో జీవన వికాస విద్యావనం పేరుతో మరో పాఠశాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు స్వేచ్ఛగా నేర్చుకుంటూ ఎదగాలనేదే ప్రధాన లక్ష్యం. పాఠశాలలోని తరగతులను యాక్టివిటీ గదులని పిలుస్తారు. చదువుతో పాటు జీవితానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను ఇక్కడ నేర్పిస్తారు. పిల్లలు సమగ్ర వికాసవంతులుగా ఎదిగినప్పుడే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారనే కోణంలోనే ఇక్కడ బోధన సాగుతుంది. ప్రధానంగా విద్యార్థులు ఇంటి దగ్గర ఎంత ఉత్సాహంగా ఉంటారో పాఠశాలలోనూ అలాగే ఉన్నప్పుడే వారు తేలికగా ఏదైనా నేర్చుకుంటారనేది వికాస విద్యావనం తత్వం. చిన్నారులకు విద్యాబోధనే కాకుండా.. వారిని మన సంస్కృతి, సంప్రదాయాలకు దూరం కాకుండా ఉండేలా విలువలను నేర్పిస్తారు. ఈ పాఠశాలలోనూ పుస్తకాల మోత, హోంవర్కుల గోల, శిక్షలు ఏవీ ఉండవు. ఇవన్నీ కేవలం యాక్టివిటీ గదులకే పరిమితమవుతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!
-
Sports News
Team India: డబ్ల్యూటీసీ ఫైనల్.. అప్పటికి ఆటగాళ్లు సిద్ధం: భారత కోచింగ్ సిబ్బంది
-
Movies News
Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా