logo

యువత పెడదోవ

చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయస్సులో యువత పెడదోవ పడుతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని నగరంలో విక్రయాలు సాగుతున్నాయి.

Updated : 28 Mar 2023 06:10 IST

విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు
నగరంలో విస్తరిస్తున్న విష సంస్కృతి
ఈనాడు, అమరావతి

చదువుకుని ప్రయోజకులుగా ఎదగాల్సిన వయస్సులో యువత పెడదోవ పడుతోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని నగరంలో విక్రయాలు సాగుతున్నాయి. ఫలితంగా మత్తుకు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి రవాణాదారులు తాము ఎక్కడా దొరక్కుండా విద్యార్థులతోనే అంతా నడిపిస్తున్నారు. ఇటీవల కొండపల్లిలోని ఓ ఇంట్లో 12 మంది యువకులు పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి వినియోగిస్తూ పోలీసులకు దొరికిపోయారు. విజయవాడకు చెందిన సస్పెక్ట్‌ షీటర్‌ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. మైలవరంలో గంజాయి విక్రయించే ఇద్దరు యువకులు.. పుట్టిన రోజు వేడుకకు రెండు కిలోల గంజాయిని సిద్ధం చేస్తూ సెబ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. సరఫరా అవుతున్న దాంట్లో టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఈబీ, డీఆర్‌ఐ అధికారులకు దొరుకుతోంది స్వల్పమే.

గుట్టుచప్పుడు కాకుండా బెజవాడకు...

విజయవాడ గంజాయి రవాణా ఏఓబీ సరిహద్దుల నుంచి చేరుతోంది. నగరం మీదుగా హైదరాబాద్‌, పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై సరఫరా అవుతోంది. అక్రమ రవాణా పకడ్బందీగా సాగుతోంది. గంజాయి సరఫరా చేసేందుకు ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుపేదలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి సరకును గమ్యస్థానాలకు చేర్చినందుకు కమీషన్‌ రూపంలో నగదు చెల్లిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో ఏజెంట్లు మాత్రమే దొరుకుతున్నారు. విక్రయించే దళారులు, గంజాయి మాఫియా వెనుకు ఉన్న కీలక నిందితుల ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, రైళ్లలో అధికంగా రవాణా జరుగుతోంది. బస్సుల్లో సైతం గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు.

విద్యా సంస్థల చుట్టుపక్కల..

విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన పలువురు చదువుతుంటారు. వీరిలో కొందరు మత్తుకు అలవాటుపడ్డారు. దీనిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమ ఆర్థిక అవసరాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు. వీరు బాగా నమ్మకస్థులకే అందిస్తుంటారు. ఫోన్‌ చేస్తే చాలు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతున్నారు. విద్యా సంస్థల చుట్టుపక్కల ఉండే కిళ్లీషాపులు, పూల దుకాణాలు, బడ్డీ కొట్లలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. కృష్ణలంక, పటమట, మాచవరం, గుణదల, రైల్వేస్టేషన్‌, అజిత్‌సింగ్‌నగర్‌, నున్న, భవానీపురం, వన్‌టౌన్‌, టూటౌన్‌, తదితర ప్రాంతాల్లో అడ్డాలుగా మారాయి.

సరఫరాదారులుగా మారుతున్న విద్యార్థులు

బెజవాడలో మత్తు పదార్థాల విక్రయం అధికమైంది. స్థానిక విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులు అలవాటుపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి సరకును తెప్పించి గుట్టుగా ఇక్కడ చలామణి చేస్తున్నారు. దీనిని అరికట్టడానికి నగర పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నిఘాను ఎంత తీవ్రం చేసినా వీరి కళ్లుగప్పి రహస్యంగా చేరవేస్తున్నారు. విద్యార్థులే విక్రేతలుగా మారుతున్నారు. కొందరైతే ఏజెన్సీకి వెళ్లి కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు.


మత్తు మందు ఆనవాళ్లు

* ఇటీవల కాకినాడకు చెందిన యువకుడు బెంగళూరు నుంచి ఎండీఎంఏ (మిథలీన్‌ డైఆక్సీ మెటాఫెటామిన్‌) అనే సింథటిక్‌ డ్రగ్‌ను రవాణా చేస్తూ విజయవాడలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఆరు నెలలుగా ఇలా బెంగళూరు నుంచి తూర్పుగోదావరికి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఏమైనా సరఫరా చేసేవాడా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

* చెన్నై పోలీసులు గతేడాది విజయవాడలోని మందుల దుకాణాల్లో విస్తృంగా తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి మందుల దుకాణాల నుంచి చెన్నైలోని విద్యార్థులకు ట్రైడాల్‌ అనే మాత్రలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్టు కొనుగొన్నారు. నగరంలోని మూడు మందుల దుకాణాల నుంచి బిల్లులు లేకుండా ముఠా సభ్యులు మాత్రలను భారీఎత్తున కొనుగోలు చేసి తమిళనాడు తరలిస్తున్నట్లు గుర్తించారు.

* గతేడాది నగరం నుంచి ఓ పార్సిల్‌లో 4.5 కిలోల ఎఫిడ్రిన్‌ను పట్టు చీరల మధ్యలో పెట్టి విదేశాలకు పంపించారు. ఇక్కడి నుంచి వెళ్లే వాటిపై పెద్దగా నిఘా ఉండదని గమనించి.. చెన్నైకు చెందిన వ్యక్తి విజయవాడ వచ్చి ఆస్ట్రేలియాకు పంపించాడు. పొరపాటున ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన పార్సిల్‌ కెనడాకు వెళ్లడంతో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగుచూశాయి.

* కమిషనరేట్‌ పరిధిలో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టామని, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని పోలీసు కమిషనర్‌ కాంతిరాణా ‘ఈనాడు’తో చెప్పారు. ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద నిఘా ఉంచడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వివరించారు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో తల్లిదండ్రుల సమక్షంలో సైకాలజిస్ట్‌లతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నామన్నారు. అధికంగా తీసుకునే వారిని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు పంపుతున్నామని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని