logo

అమ్మ సొమ్మంటే అంత అలుసా?

దుర్గగుడి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము రూ.కోట్లలో వృథా అవుతోంది. కట్టడం.. కూల్చడం ఇక్కడ అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 31 Mar 2023 05:19 IST

రూ.కోట్లు వృథా చేస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు

వృథాగా ఉన్న మొబైల్‌ క్యూలైన్లు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము రూ.కోట్లలో వృథా అవుతోంది. కట్టడం.. కూల్చడం ఇక్కడ అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మవారి చరిత్ర భక్తులకు వివరించేందుకు 2017లో రూ.3 కోట్లు వెచ్చించి అప్పటి ఈవో సూర్యకుమారి ఇంద్రకీలాద్రిపై లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన భక్తులను ఆకట్టుకోలేకపోయింది. ఆరేళ్లలో దీని గురించి పట్టించుకున్నవారే కరవయ్యారు. ఇటీవల ఈ ప్రదర్శన ఏర్పాటు చేసే ప్రాంతంలో ఉన్న తెరను తొలగించారు. ఈ ప్రాంతంలో గతంలో కూలగొట్టిన ఈవో కార్యాలయాన్ని పునరుద్ధరించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక్కడ మట్టి పరీక్ష కార్యక్రమానికి ఇంజినీరింగ్‌ అధికారులు తెరతీశారు. కొండపై ఏం ఉండకూడదని భక్తులకు ఉపయోగపడే ఇక్కడ ఉన్న భవానీదీక్షా మండపం, ఈవో కార్యాలయం, దుకాణాల సముదాయం, క్యూలైను తొలగించారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.లక్షలు వెచ్చించి పాదరక్షలు, సెల్‌ఫోను స్టాండ్‌, దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈవో కార్యాలయం కూడా యథాస్థానంలో నిర్మించాలన్న ప్రతిపాదనలూ సిద్ధం చేశారు.
నిరుపయోగంగా మొబైల్‌ క్యూలైన్లు

భక్తులను వరుసలో పంపేందుకు రూ.36 లక్షలు ఖర్చు చేసి మొబైల్‌ క్యూలైన్లు ఏర్పాటు చేసేందుకు నాలుగేళ్ల కిందట నిర్ణయించారు. ప్రస్తుతం మొబైల్‌ క్యూలైన్లు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నాయో కూడా ఆలయ అధికారులకు తెలియడం లేదు. ద్విచక్ర వాహనాలు, కార్లు నిలపడానికే స్థలం లేదని చెబుతున్న అధికారులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన మొబైల్‌ క్యూలైన్లను వినియోగించకుండా వదిలివేయడంతో తుప్పుపట్టి పోతున్నాయి.

మూలకు చేరిన ఈ టాయిలెట్స్‌

అధికారులకు తెలిపినా..

దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఈ-టాయిలెట్స్‌ను రూ.వేలు వెచ్చించి ఘాట్‌ రోడ్డు, కనకదుర్గానగర్‌లో ఏర్పాటు చేశారు. అవి పనిచేయడం లేదని భక్తులు మొత్తుకుంటున్నా పట్టించుకునే అధికారులు కరవయ్యారు. శుక్రవారం, ఆదివారం పర్వదినాల్లో వేలాది భక్తులు దుర్గమ్మ దర్శనానికి క్యూలైన్లో బారులు తీరుతున్నారు. వారి కోసం ఈ-టాయిలెట్లను గతంలో ఏర్పాటు చేశారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దుర్గగుడి పాలకమండలి, సంబంధిత అధికారులు అమ్మవారి సొమ్ము వృథా కాకుండా చర్యలు తీసుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని