logo

కళ్లు చెదిరే.. ఆర్జన

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం, అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే కేంద్రం.. పటమట. ఆ కేంద్రంలో కొలువు దీరేందుకు ఆయన పోరాడి న్యాయస్థానానికి వెళ్లి మరీ పోస్టింగ్‌ దక్కించుకున్నారు.

Updated : 04 May 2023 10:15 IST

అత్యధిక కమీషన్ల కేంద్రం పటమట
పోరాడి పోస్టు తీసుకున్న రాఘవరావు
నాడు ముగ్గురు డీఐజీలపై వేటు
ఈనాడు, అమరావతి

పేరు: ఆర్జ రాఘవరావు
హోదా: సబ్‌ రిజిస్ట్రార్‌, పటమట
ఆస్తులు: విజయవాడలో ఒక డూప్లెక్సు ఇల్లు, ఒక ఫ్లాట్‌, ఒక నివేశన స్థలం, గుండాలలో రెండు, అవనిగడ్డలో ఒక ఖాళీ స్థలం, మరో నివేశన స్థలం, రెండు కార్లు, రెండు జీప్‌లు, రెండు ద్విచక్ర వాహనాలు, 1.580 కేజీల బంగారం, రూ.12.72 లక్షల నగదు, రూ.18 లక్షల గృహోపకరణాలు, రూ.7 లక్షల విలువైన ప్రామిసరీ పత్రాలు


మ్మడి కృష్ణా జిల్లాలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతం, అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగే కేంద్రం.. పటమట. ఆ కేంద్రంలో కొలువు దీరేందుకు ఆయన పోరాడి న్యాయస్థానానికి వెళ్లి మరీ పోస్టింగ్‌ దక్కించుకున్నారు. సరిగ్గా.. ఆరునెలలు తిరిగే సరికి అవినీతి నిరోధక శాఖ దృష్టి ఆయనపై పడింది. ఆయన ఆదాయంపై లెక్కలు తీశారు. ఒక్కసారిగా దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. గత రెండు రోజులుగా పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆర్జ రాఘవరావు ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి చేరలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం రాఘవరావు భార్య, కుమారుల పేర్లమీద ఉన్న స్థిరాస్తులను గుర్తించారు. కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.12.72 లక్షల నగదు లభ్యమైంది. దీనిపై చర్చ జరుగుతోంది. మరికొన్ని ఆస్తులు వివరాలు బయటకు రావాల్సి ఉందని అనిశా అధికారులు వెల్లడించారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి రెడ్‌ హ్యాండెడ్‌గా లంచం తీసుకునే కేసులో వల పన్నినట్లు తెలిసింది. కానీ త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం.

ఇదీ నేపథ్యం..!

ఆర్జ రాఘవరావు స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖలో ఉన్నతాధికారులతో పోరాడి మరీ పటమట పోస్టింగ్‌ సాధించుకున్నారు. పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లావాదేవీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రతి లావాదేవీలోనూ కమీషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌లకు అందుతుంటాయనేది ఆరోపణ. ఇక్కడ డాక్యుమెంట్‌ రైటర్లదే కీలకపాత్ర. నెలకు దాదాపు 20 కోట్ల స్టాంపు డ్యూటీ ప్రభుత్వానికి అందుతుంది. అంటే దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు రిజిస్టర్‌ అవుతుంటాయి. నెలకు కమీషన్‌ రూపంలోనే రూ.40 లక్షల వరకు ఈ కేంద్రంలో ఆదాయం ఉంటుందని ప్రచారం. కార్యాలయాన్ని డాక్యుమెంట్‌ రైటర్లే శాసిస్తుంటారు. వారు చెప్పిందే వేదం. అలాంటి పోస్టు సాధారణ బదిలీలలో ఒక అధికారికి కేటాయించారని ప్రచారం. డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసే రాఘవరావు కౌన్సెలింగ్‌లో పటమట కోరుకున్నారు. ఆ కేంద్రం తప్ప వేరేది కోరుకోవాలని అధికారులు సూచించారు. ఆయన అదే కేంద్రం కావాలని పట్టుపట్టడంతో కేటాయించారు. వెంటనే ఉన్నతాధికారులు దాన్ని సస్పెండ్‌ చేసి.. తణుకు కేంద్రం పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన అక్కడ చేరకుండా హైకోర్టుకు వెళ్లారు.

ఆయనపై ఏసీబీ కేసు ఉండగా.. పటమట ఎలా కేటాయిస్తారని కౌన్సెలింగ్‌ నిర్వహించిన నోడల్‌ డీఐజీతో పాటు ముగ్గురు డీఐజీలపై ఉన్నతాధికారులు వేటు వేశారు. వారిని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఎట్టకేలకు హైకోర్టు తీర్పు మేరకు పటమట సబ్‌ రిజిస్ట్రార్‌గా రాఘవరావు పోస్టింగ్‌ దక్కించుకున్నారు. ఆయన అంతకు ముందు.... కంకిపాడు, అవనిగడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. తర్వాత డీఐజీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. అవనిగడ్డలో పనిచేసే సమయంలో అనిశా తనిఖీలు జరిగాయి. ఆకేసు విచారణలో ఉంది. అయితే తనపై సోదాలు జరగలేదని కార్యాలయంలో సాధారణ సోదాలు జరిగాయనేది రాఘవరావు వివరణ.

పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలు (పాతచిత్రం)


కాసులదే రాజ్యం..

స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖలో అంతా కమీషన్లదే రాజ్యం. సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టులు నాడు ఒక్కొక్కటీ రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు విక్రయాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కేంద్రాల్లో కమీషన్లను బట్టి రేటు పలికింది. వాటిలో జిల్లాలో మొదటి స్థానం పటమట. దీనికి చాలా మంది పోటీ పడ్డారు.. తనకంటే తనకే వస్తుందని అంచనా వేశారు. అనూహ్యంగా రాఘవరావు దక్కించుకున్నారు. ఈ కేంద్రం పరిధిలో పెనమలూరు మండలం, విజయవాడ తూర్పు పరిధిలోని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయి. నివేశన స్థలాలు, భవనాలతో పాటు, ఎక్కువ బిల్డర్లు, వెంచర్లు వేసిన రియల్టర్లతో సంబంధాలు ఉంటాయి. వాణిజ్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. క్రయ విక్రయాల్లో స్టాంపు డ్యూటీ చెల్లింపుల్లో చలానాల మోసం ఇక్కడ చోటుచేసుకుంది. విక్రయం చేసిన వారి నుంచి వసూలు చేసి డాక్యుమెంటు రైటర్లు ప్రభుత్వానికి చెల్లించకుండా మెక్కారు. తీరా వెలుగు చూసిన తర్వాత వాటిని చెల్లింపులు జరిపారు. వాణిజ్య భవనాలను నివేశన భవనాలుగా మార్పు చేసి చూపడం, లేఔట్‌ లేని నాన్‌ లేఔట్‌ ప్రాంతాలను రిజిస్ట్రేషన్‌ చేయడం వంటి అక్రమాలకు పాల్పడేవారు. డాక్యుమెంటు రైటర్లు చెప్పిన దాన్ని గుడ్డిగా ఆమోదముద్ర వేసిన సందర్భాలు ఉన్నాయి. డబుల్‌ రిజిస్ట్రేషన్లు చోటుచేసుకున్నాయి. ఇలాంటి వివాదాలు ఉన్న వాటికి కమీషన్లు అధికంగా గుంజుతున్నారు. నెలకు రూ.40 లక్షల వరకు ఆదాయం ఉంటుందని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పటమట కేంద్రానికి డిమాండ్‌  ఎక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్‌ (ఎనీవేర్‌) చేయిస్తుంటారు. రాఘవరావు బదిలీ జరిగిన సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఉన్నతాధికారుల్లో ఆయన బదిలీపై రచ్చ జరిగింది. ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవహారంలో ముగ్గురు డీఐజీలపై వేటు వేయడం నాడు చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో పటమట కేంద్రంపై అనిశా దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని