logo

ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు

జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

Published : 17 May 2024 04:23 IST

ముందుగా లెక్కించేది పోస్టల్‌ బ్యాలట్లే

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ముందుగా పోస్టల్‌ బ్యాలట్‌లను లెక్కించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను తరలించడానికి, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్యలు రాకుండా, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒక్కోదానికి 14 చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ.. కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ఠమైన మూడు అంచెల భద్రత ఉన్నట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, తలుపులకు వేసిన సీళ్లు, సెక్యూరిటీ, పరిసరాలు కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, భద్రత పర్యవేక్షణపై నియమించిన గెజిటెడ్‌ అధికారులు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తింపు కార్డులేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని స్పష్టం చేశారు. డీఆర్వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఏవో నాగలక్ష్మి, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంటు ఎం.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని