logo

TDP: ‘బాబు బెయిల్‌ సమయంలో కోవర్టుగా ఎంపీ కేశినేని నాని’

రెండు పర్యాయాలు టిక్కెట్‌ ఇచ్చి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన తెదేపా అధినేత చంద్రబాబుకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) తీరని ద్రోహం చేశారని ఆయన సోదరుడు, తెదేపా పార్లమెంటు ఇన్‌ఛార్జి కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆరోపించారు.

Updated : 18 Feb 2024 10:08 IST

మాట్లాడుతున్న కేశినేని చిన్న్జి

ఈనాడు - అమరావతి: రెండు పర్యాయాలు టిక్కెట్‌ ఇచ్చి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన తెదేపా అధినేత చంద్రబాబుకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) తీరని ద్రోహం చేశారని ఆయన సోదరుడు, తెదేపా పార్లమెంటు ఇన్‌ఛార్జి కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో కోవర్టులా వ్యవహరిస్తూ అన్ని విషయాలను జగన్‌కు చేరవేశారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లాలో పలువురికి టిక్కెట్లు ఇప్పిస్తానని రూ.కోట్లు వసూలు చేశారనీ, అవి తిరిగివ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. విజయవాడలో శనివారం విలేకరుల సమావేశంలో చిన్ని మాట్లాడారు. ‘బాబును అక్రమ అరెస్టు చేస్తే.. తనయుడు లోకేశ్‌ ఎవరెవరని కలుస్తున్నారు..? ఏమేం మాట్లాడుకున్నారు.? వంటి విషయాలను సీఎం జగన్‌కు చేరవేసింది కేశినేని నాని. విజయవాడ కోర్టు లోపల పరిణామాలు కూడా చేరవేయడంతో పోలీసు కమిషనర్‌.. తెదేపా లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లిలా వ్యవహరించారని’ ఆరోపించారు.

ఆయన వసూల్‌ రాజా...: విజయవాడ పశ్చిమ సీటు ఇప్పిస్తానని ఇద్దరి వద్ద రూ.కోట్లు తీసుకున్నారు. మైలవరం సీటు ఇప్పిస్తానంటూ మరో ఇద్దరి వద్ద వసూలు చేశారు. ఆయన ప్రాణ స్నేహితుడి దగ్గర సొమ్ము తీసుకుని ఇవ్వడం లేదు. సీట్ల పేరుతో వసూలు చేసిన సొమ్ము వెంటనే తిరిగివ్వాలి. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయి.

అసిస్టెంటుగా మారారు..: విజయవాడ ఎంపీగా తెదేపాలో ఒక స్థాయి, గౌరవం ఉన్న వ్యక్తి వైకాపాలోకి వెళ్లి జగన్‌ పాలేరుగా మారారు. వెలంపల్లి శ్రీనివాస్‌, దేవినేని అవినాష్‌లకు సహాయకుడిగా పనిచేస్తున్నారు. నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని పరిస్థితి మరో మూడు నెలల్లో తేలుతుంది. ఆయనకు విజయవాడ సీటు కూడా వైకాపా ఇవ్వదు. దేవినేని అవినాష్‌కో, వెలంపల్లి శ్రీనివాస్‌కో, మరో వ్యక్తికో విజయవాడ లోక్‌సభ సీటు ఖాయం కానుంది. నాని వెనుక ఒక్క మనిషి లేరని జగన్‌కు అర్థమైంది. కేశినేని భవన్‌ మనుషులు లేక వెలవెలబోతోంది. ఆయన భవనం దాటి ప్రజల్లోకి రాలేదనీ, అహంభావంతో ఉన్నారని జగన్‌కు తెలుసు. ఎన్నికల తర్వాత కేశినేని నాని అనే వ్యక్తి ప్రజాజీవితంలో ఉండరు. ఇది కచ్చితమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని