logo

మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు

మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది.

Published : 28 Mar 2024 05:46 IST

శోభారాణితో ప్రవీణ్‌కుమార్‌ (పాతచిత్రం)

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణ క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అనుమానితులపై నిఘా పెట్టడంతో పాటు హతురాలి వివరాల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇబ్రహీంపట్నం జాకీర్‌హుస్సేన్‌ కళాశాల సమీపంలో నివసించే మరేమల్ల శోభారాణి (52) తర్వాత భవానీపురం పున్నమి ఘాట్‌లో ఒంటరిగా ఉండేది. 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌ వెళ్లి నిందితుడు జైన్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో పని చేస్తుండేది. అతడి తల్లి జైన్‌ లత మరణానంతరం శోభారాణి, ప్రవీణ్‌కుమార్‌ విజయవాడ వచ్చి సహజీవనం చేశారు. 2015లో ఉద్యోగం నిమిత్తం ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. గత సంవత్సరం నుంచి ఇద్దరి మధ్య అనుమానాలతో గొడవలు తలెత్తడంతో వేర్వేరుగా ఉండేవారు. అయిదు నెలల కిందట తిరిగి ఇద్దరూ కలిసి భవానీపురం పున్నమిఘాట్‌కు చేరారు. శోభారాణిపై అనుమానం, బంగారం విషయంగా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని ప్రవీణ్‌కుమార్‌ పథకం పన్నాడు. ఏపీ 39 ఆర్‌క్యూ 2337 నంబరు కారులో ఈ నెల 18న శోభారాణిని కారులో దామూలూరు శివారుకు తీసుకెళ్లి జాకీ రాడ్‌తో కొట్టి, గొంతు నొక్కి చంపేశాడు. మృతదేహాన్ని అక్కడే నీరు లేని పంట కాలువలో తోసేసి కారులో పరారయ్యాడు. ఆధారాలు లేకుండా చేయాలని కారు జీపీఎస్‌ సిస్టమ్‌ తొలగించాడు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యేక బృందాలు మరింత లోతుగా దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన టీం సభ్యులను పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా, పశ్చిమ డివిజన్‌ ఇన్‌ఛార్జి డీసీపీ టి.హరికృష్ణ, పశ్చిమ డివిజన్‌ ఏసీపీ పి.మురళీకృష్ణారెడ్డి అభినందిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని