logo

ఆగని ఇసుక అక్రమ రవాణా

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఇసుకాసురుల ధన దాహానికి అంతు లేకుండా పోతోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.

Published : 08 May 2024 04:23 IST

కంచికచర్ల, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఇసుకాసురుల ధన దాహానికి అంతు లేకుండా పోతోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్‌ చేస్తూ.. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. మండలంలోని మున్నలూరు రీచ్‌ నుంచి ఇసుక దర్జాగా తరలిస్తున్నారు. లారీలను ఎవరూ ఆపలేరనే ధీమాతో అక్రమార్కులు ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఇసుక అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐదేళ్లలో మండలంలోని చెవిటికల్లు, గనిఆత్కూరు, మున్నలూరు రీచ్‌ల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో కృష్ణా నదిలో రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి ఇసుక తోడారు. 15 నుంచి 20 అడుగుల లోతు గుంతలు తీసి బావులను తలపించేలా చేసి లక్షల టన్నుల ఇసుక తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించారు. కొన్ని రోజుల కిందట మీడియాలో కథనాలు రావడంతో ఇసుక తవ్వకాలు ఆపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్‌ల్లోకి వాహనాలు వెళ్లకుండా గండ్లు కొట్టారు. ఆదేశాలు పట్టించుకోకుండా మళ్లీ ఇప్పుడు రీచ్‌ నుంచి ఇసుక అక్రమంగా రవాణా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణా అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు