logo

మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?

ఉయ్యూరు పట్టణంలోని టిడ్కో గృహాలు అందక లబ్ధిదారులు నానా అవస్థలుపడుతుంటే.. మరోవైపు రూ.వేలు డిపాజిట్‌ చెల్లించి అనర్హులుగా ప్రకటితులైన బాధితులు తమ సొమ్ము కోసం వైకాపా నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

Updated : 08 May 2024 07:44 IST

పది రోజుల్లో చెల్లిస్తానని పత్తాలేరు
టిడ్కో గృహాలకు అనర్హులుగా చేశారు
నిధులున్నా ఎందుకు చెల్లించరంటూ పలువురు ఆగ్రహం

ఏం చెప్పారు?
వివిధ కారణాల వల్ల టిడ్కో ఇళ్లకు అనర్హులైన వారికి రావాల్సిన డిపాజిట్‌ సొమ్ము పది రోజుల్లో అందేలా చర్యలు తీసుకుంటాం. నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎవరూ బాధపడాల్సిన అవసరం.

- జనవరిలో సభావేదికపై మంత్రి హోదాలో జోగి రమేష్‌ హామీ


ఏం జరిగింది
చెప్పిన మాటలకు, చేతలకు సంబంధం లేకుండాపోయింది. ఇళ్లకు అనర్హులుగా ప్రకటించి నప్పుడు వారి డబ్బులు వారికి ఇప్పించాలన్న నైతికత జోగి రమేష్‌లో కొరవడింది. ఎన్నికల కోడ్‌ సాకు చూపి సమస్య నుంచి తప్పించుకున్నారు.

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరు పట్టణంలోని టిడ్కో గృహాలు అందక లబ్ధిదారులు నానా అవస్థలుపడుతుంటే.. మరోవైపు రూ.వేలు డిపాజిట్‌ చెల్లించి అనర్హులుగా ప్రకటితులైన బాధితులు తమ సొమ్ము కోసం వైకాపా నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక, వివిధ కారణాల వల్ల గృహాలు రాక బాధపడుతుంటే.. న్యాయంగా వారికి చెల్లించాల్సిన డబ్బులను కూడా ప్రభుత్వం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ సమస్యను తాను పది రోజుల్లో పరిష్కరిస్తానని జనవరిలో పట్టణ టిడ్కో గృహాల వద్ద వైకాపా ఆధ్వర్యంలో జరిగిన సభావేదికపై గృహ నిర్మాణ మంత్రి హోదాలో జోగి రమేష్‌ హామీ ఇచ్చి ముఖం చాటేశారు.

ఏమని అడిగితే ఎన్నికల కోడ్‌ అంటూ సమాధాన్ని దాటవేస్తున్నారని డిపాజిట్‌ కోసం ఎదురు చూస్తున్న పలువురు వాపోతున్నారు. ఇళ్లు ఇవ్వనప్పుడు తమ డిపాజిట్‌ సొమ్ము ప్రభుత్వం వద్ద ఎందుకని పలువురు జోగిని సభావేదికపైనే నిలదీశారు. తాము వడ్డీలకు తెచ్చి మరీ ప్రభుత్వానికి తమ వాటాగా చెల్లించామని, ఏళ్లుగా వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వీరు కేటగిరి వారీగా రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.12 వేలు చెల్లించారు.

జాబితాలో తికమక

టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పలు లోపాలు ఉన్నాయని, వైకాపా నాయకులు తమకు కావాల్సిన వారి పేర్లు జాబితాలో కొనసాగించి, కొంతమంది పేర్లను కావాలనే తొలగించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏదోఒక కారణంతో తమను అనర్హులుగా ప్రకటించారని, ఇందుకు తగ్గు మూల్యం చెల్లించుకుంటారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ డిపాజిట్‌ సొమ్ము చెల్లించడం లేదని, తమ ఓట్లు కూడా వారికి అవసరం లేనట్టు ఉందని గుర్రుగా ఉన్నారు. జోగి రమేష్‌ తీరును దుయ్యబడుతున్నారు.


డిపాజిట్‌ సొమ్ము తక్షణమే చెల్లించాలి

 - దొడ్ల రమణ, పేదల ఇళ్ల స్థలాల సాధన కమిటీ ప్రతినిధి

టిడ్కో గృహాల కోసం ఎంపికైన అనేక మంది నాడు అధికారులు అడిగితేనే వారు అష్టకష్టాలు పడి తమ వాటా కింద సొమ్ము డిపాజిట్‌గా చెల్లించారు. ఇళ్లా మంజూరు చేయలేదు. సరికాదా వివిధ కారణాలు చూపి వారిని అనర్హులుగా ప్రకటించారు. కానీ వారి డిపాజిట్‌ సొమ్ము తిరిగి వాపసు చేయకుండా ప్రభుత్వం వద్ద ఉంచుకోవడం సరికాదు. ఇది ఒకరకంగా వారిని ఆర్థికంగా నష్టపర్చడమే. ఇప్పటికైనా వారికి రావాల్సిన సొమ్ము నయాపైసాతో సహా చెల్లించాలి. 


ఏళ్లుగా డబ్బు ఉంచుకున్నారు

- అఫ్తరున్నీసా, 18వ వార్డు

ఇల్లు కోసం అధికారుల సూచన మేరకు గతంలో రూ.25 వేలు తన వాటాగా చెల్లించి ఏళ్లు గడచింది. ఏదోసాకు చూపి అనర్హులుగా గుర్తించినప్పుడు వెంటనే డిపాజిట్‌ సొమ్ము కూడా వాపసు చేయాలి కాదా? కానీ తమ డబ్బును చెల్లించడకుండా ప్రభుత్వం తన ఖాతాలో ఉంచుకోవడం దారుణం. మా సొమ్ము పది రోజుల్లో ఇచ్చేస్తామని అధికారులు హామీ ఇచ్చి నెలలు దాటుతున్నా కార్యరూపం దాల్చలేదు. చేతిలో డబ్బులు లేక ఇబ్బందిగా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు