logo

పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేస్తేనే ఓటు వేస్తాం

నిడమర్రు పంచాయతీ ఎస్సీవాడలో ఉన్న పోలింగ్‌బూత్‌ను కిలో మీటరు దూరంలో ఉన్న గౌడపాలెం మార్చారు.

Published : 08 May 2024 04:56 IST

నిడమర్రు ఎస్సీవాడ(కృత్తివెన్ను): నిడమర్రు పంచాయతీ ఎస్సీవాడలో ఉన్న పోలింగ్‌బూత్‌ను కిలో మీటరు దూరంలో ఉన్న గౌడపాలెం మార్చారు. అలాకాకుండా గతంలో ఉన్న విధంగానే నిడమర్రు ఎస్సీవాడలోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేయాలని అలా చేస్తేనే తాము ఈనెల 13న నిర్వహించే ఎన్నికల్లో ఓటు వేస్తామని, లేదంటే పూర్తిగా బహిష్కరిస్తామని మంగళవారం స్థానికులు నిరసన తెలిపారు. నిడమర్రు పంచాయతీలో సుమారు 5వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఈ పంచాయతీలో బస్వానివారిపేట, పోడు,ధర్మాపురం, పెదగొల్లపాలెం, నిడమర్రు, ఒర్లగొందితిప్ప, నిడమర్రు గౌడపాలెం, నిడమర్రు ఎస్సీవాడ గ్రామాలు ఉన్నాయి.

గతంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో..

2019 ఎన్నికలకు ముందు వరకు ఈ పోలింగ్‌ కేంద్రాన్ని తుపాన్‌ రక్షిత భవనంలో ఏర్పాటు చేశారు. ఇది శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉండడంతో 2019 ఎన్నికలను పక్కనే ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. కమ్యూనిటీ హాలుకు నెంబరు కేటాయించకపోవడంతో ఈసారి కూడా వీఆర్వో దుర్గ పోలింగ్‌ బూత్‌ 208 కేంద్రమైన తుపాన్‌ రక్షిత భవనం ఫొటో తీసి ఎన్నికల అధికారులకు పంపడంతో ఈ కేంద్రాన్ని పక్కనే కిలోమీటర్‌ దూరంలో ఉన్న నిడమర్రు గౌడపాలెంకు తరలించారు. అంతదూరం వెళ్లి ఓటు వేయడం కష్టమని గతంలో వలె అదే కమ్యూనిటీ హాలులో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


ఎన్నికల నియమావళి ప్రకారమే

-సుందర్‌సింగ్‌, ఎమ్మార్వో

ఎన్నికల నియమావళి ప్రకారమే పోలింగ్‌ కేంద్రాన్ని గౌడపాలెం తరలించారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం అధికారులదే తుది నిర్ణయం. మా చేతిలో ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో మార్చడానికి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం  గౌడపాలెం కేంద్రంలోనే పోలింగ్‌ జరుగుతుంది. పరిస్థితి అర్థం చేసుకుని ఓటు హక్కును అక్కడే వినియోగించుకోవాలి.


ఆందోళనలు చేస్తే చర్యలు

-కె.నాగరాజు, ఎస్‌ఐ

ఎన్నికల నియమావళి ప్రకారం 144సెక్షన్‌ అమల్లో ఉంది. ఎటువంటి ధర్నాలు,నిరసనలు జరిపినా కఠిన చర్యలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు