logo

అమ్మ సాక్షిగా.. వైకాపా పాపాలు!

వైకాపా పాపాల చిట్టాలో ఆలయాలకూ మినహాయింపు లేదు... రూ.కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించేయడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అజెండాగా ఐదేళ్ల పాలన సాగింది. అర్హతలేనివారిని అందలమెక్కించి.. అస్తవ్యస్త, అపసవ్య విధానాలతో ఆలయాల పవిత్రతతను దెబ్బతీసింది.

Updated : 08 May 2024 07:20 IST

ఐదేళ్ల పాలనలో ఎన్నెన్నో అకృత్యాలు
భక్తులిచ్చిన ముడుపుల సొమ్మూ పక్కదారి
నమూనాలతో ఆటలాడిన ఇద్దరు మంత్రులు
నిధులిస్తానని చెప్పి మాట తప్పిన జగన్‌
ఈనాడు - అమరావతి

వైకాపా పాపాల చిట్టాలో ఆలయాలకూ మినహాయింపు లేదు... రూ.కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించేయడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అజెండాగా ఐదేళ్ల పాలన సాగింది. అర్హతలేనివారిని అందలమెక్కించి.. అస్తవ్యస్త, అపసవ్య విధానాలతో ఆలయాల పవిత్రతతను దెబ్బతీసింది.

విజయవాడ దుర్గగుడి.. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయం. ఏటా రెండుకోట్ల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటుంటారు. సాలీనా రూ. 150 కోట్లకుపైగా ఆదాయం. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ దేవస్థానం పేరుకు మచ్చ తెచ్చే పనులెన్నో చేసింది వైకాపా ప్రభుత్వం. భక్తుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో సింహభాగం పక్కదారి పట్టించడం మొదలుకుని.. కూల్చివేతలతోనే కాలం గడిపేసింది. కనీసం ఒక్క భవనానికీ పునాదులు తీసింది లేదు. అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాల చోరీ దగ్గర్నుంచి దర్శనం టిక్కెట్ల

పునర్వినియోగం.. ఉద్యోగుల రాసలీలల వరకూ అనేక అకృత్యాలకు పాల్పడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దేవాదాయశాఖను వెలగబెట్టిన మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొట్టు సత్యనారాయణ ప్రణాళికల పేరుతో హడావుడి చేయడం తప్పించి.. ఒక్క పనీ చేపట్టిన పాపాన పోలేదు. ఒకరు రూ. 70 కోట్లతో అభివృద్ధి అంటే.. అబ్బే కాదు.. రూ. 220 కోట్లతో చేసేస్తామంటూ మరొకరు గొప్పలకు పోవటం, ఈ ప్రణాళికల పేరుతో నమూనాలకు డబ్బులు తగలేయడం తప్ప వీళ్లిద్దరూ చేసిందేమీ లేదు.


రూ. 5 కోట్ల పెర్గోలా కూలగొట్టారు..

దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ సరిగ్గా బదిలీ అవ్వడానికి రెండువారాల ముందు.. కనకదుర్గానగర్‌లోని రాతి మండపాన్ని (పెర్గోలా) అడ్డంగా కూల్చేసి వెళ్లారు. రహదారికిరువైపులా ఆధ్యాత్మిక శోభ కనిపించాలన్న ఉద్దేశంతో ఆరేళ్ల కిందట రూ. 5 కోట్ల వ్యయంతో ఈ రాతి మండపం నిర్మించారు. గత దసరా ముందు పెద్దపెద్ద యంత్రాలతో పెర్గోలా రాళ్లను కోసేసి మరీ తొలగించి తీసుకెళ్లిపోయారు. అసలెందుకు ఇంత హడావుడిగా రాళ్లను కత్తిరించారో ఎవరికీ తెలియదు. వీటిని నిరుపయోగంగా పడేశారు. దసరా వేడుకల వేళ ఈ మండపం ప్రత్యేక శోభనిచ్చేది. ఇప్పుడాప్రాంతం బోసిపోయింది.


కొండరాళ్లకూ పరిష్కారం లేదు..

కొండరాళ్ల సమస్యను పరిష్కరిస్తామంటూ జగన్‌ స్వయంగా వచ్చి ఇచ్చిన మాటనూ నిలబెట్టుకోలేదు. వర్షం పడితే.. ఇప్పటికీ ఘాట్‌రోడ్డుపై రాకపోకలు ఆపేయాల్సిందే. గతంలో నిపుణుల బృందం మొత్తం పరిశీలించి ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్పింది. కొండపైన కురిసిన వర్షం నీరు రాళ్ల మధ్యకు చేరడంతో మట్టి కరిగిపోయి బండలు జారి పడిపోతున్నాయని, పరిష్కారంగా కొండపైభాగాన ఓ కాలువ నిర్మించి ప్రతీనీటిబొట్టూ దాంట్లోంచి నేరుగా దిగువకు వచ్చేలా చేయాలని సూచించింది. ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. రాళ్లపై ఇనుప వల వేశారు. రాళ్లు జారినా.. రహదారిపైకి రాకుండా గోడ కట్టారు. రాళ్లకు మేకులేశారు. వర్షంపు నీరు రాళ్ల మధ్యకు వెళ్లకుండా మాత్రం చేయలేకపోయారు. అంతటి ఘనులున్నారిక్కడ ఇంజినీరింగ్‌ విభాగంలో.


దుర్గమ్మకిచ్చిన మాట తప్పిన జగన్‌..

2020 అక్టోబరు 21న దుర్గగుడిలో దసరా వేడుకల సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పెనుప్రమాదం తప్పింది. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అదేరోజు గుడికి వచ్చిన జగన్‌.. ఆలయ అభివృద్ధి కోసం రూ. 70 కోట్లను వెంటనే విడుదల చేస్తానంటూ మాటిచ్చారు. వీటితో కొండరాళ్లు జారిపడకుండా.. శాశ్వత చర్యలు తీసుకుంటామంటూ సెలవిచ్చారు. మిగిలిన సమస్యలనూ పరిష్కరించేస్తామంటూ ఊదరగొట్టారు. ముక్కుతూ.. మూలుగుతూ.. ఇప్పటికి రూ. 10 కోట్లే ఇచ్చారు. అదీ పనులు చేసిన గుత్తేదారులు బిల్లులివ్వండి మహాప్రభో అంటూ కాళ్లరిగేలా తిరిగాకే.  


కల్లబొల్లి మాటల వెలంపల్లి

గన్‌ మాటిచ్చారంటే మడమ తిప్పరు. ఆయన డబ్బులిచ్చేస్తారు.. మేం అన్ని సమస్యలనూ కూకటివేళ్లతో పెకలించేస్తామంటూ అప్పటి దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. పెద్ద నమూనాలు గీయించేసి.. సీఎం చేతులమీదుగా ఆవిష్కార కార్యక్రమం చేపట్టి లక్షల రూపాయలను వృథా చేశారు. ఇందులో కనీసం ఒక్క భవనానికీ పునాదులు తీయకుండానే ఆయన రెండున్నరేళ్ల మంత్రి జమానా ముగిసి పక్కకెళ్లిపోయారు. ఈయన హయాంలో దుర్గగుడి పేరుకు మచ్చ తెచ్చే సంఘటనలెన్నో జరిగాయి. ముఖ్యంగా పట్టపగలు ఆలయ ప్రాంగణంలోని వెండి రథం సింహాలను కోసి తీసుకెళ్లిపోయారు. ఇప్పటివరకూ సరైన చర్యలే తీసుకోలేదు. ఇప్పటికీ ఆ చోరీపై అనేక అనుమానాలున్నాయి. ఆలయ ఆదాయాన్ని కరిగించేయడంలో వెలంపల్లి ముందున్నారు. దసరా, భవానీ దీక్షల వేడుకల కాంట్రాక్టులను తన బినామీలకే ఇప్పించుకుని భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.


కొట్టు... మళ్లీ మొదలుపెట్టు..

వెలంపల్లి తర్వాత ఆ శాఖ మంత్రిగా వచ్చిన కొట్టు సత్యనారాయణ హయాంలోనూ నమూనాల పేరుతో లక్షల రూపాయలను వృథా చేయడం తప్ప ఒక్కటీ కట్టింది లేదు. పైగా ఆయన వచ్చీరాగానే వెలంపల్లి హయాంలోని ప్రణాళికలన్నింటినీ చెత్తబుట్టలో పడేశారు. అన్నదాన భవనం, కేశఖండనశాల, ప్రసాదాల పోటు నమూనాలు బాగోలేదని, అసలివి ప్రణాళికలే కాదని, తాను కొత్తగా రూపొందిస్తానంటూ మళ్లీ మొదలుపెట్టారు. పాత టెండర్లను రద్దు చేయించి.. కొత్తగా రూ. 220 కోట్లతో బృహత్తర ప్రణాళిక అంటూ నమూనాలు గీయించారు. విచిత్రంగా వీటిని కూడా సీఎం జగన్‌ చేతుల మీదుగానే ఆవిష్కరింపజేశారు. ఆయన కూడా ఇదే తొలిసారన్నట్టు అన్నదానభవనం, ప్రసాదాలపోటు, కేశఖండనశాల నమూనాలను మళ్లీ ఆవిష్కరించారు. ఎన్నికలకు ఆరునెలల సమయం కూడా లేదు.. ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్టు నమూనాలు అవసరమా? అన్న విమర్శలనూ కొట్టు పట్టించుకోలేదు. శిలాఫలకాలను కూడా వేసేసి.. సీఎం జగన్‌ను మళ్లీ తీసుకొచ్చి భూమిపూజ చేయించారు. ఇప్పటికీ వాటి అతీగతీ లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు