logo

చేష్టలుడిగిన నేత

చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

Published : 10 May 2024 05:50 IST

మూతపడుతున్న సంఘాలు

పేరుకుపోతున్న బకాయిలు

సంక్షోభంలో చేనేత పరిశ్రమ

 

చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

 - సీఎం జగన్‌


 చేనేత పరిశ్రమకు ముఖ్యమంత్రి చేసిందేమీలేదు. మగ్గాలు ఉన్నవారికి నేతన్న నేస్తం పథకంలో  ఏటా రూ.24వేలు ఇస్తున్నారు. వివిధ కారణాలతో చాలామందిని అనర్హులుగా తేల్చారు. చేనేత సంఘాలన్నీ మూతపడ్డాయి. మగ్గం మీద పనిచేసేందుకు పనిలేకుండా ఇచ్చిన డబ్బులు ఏడాదంతా బతికేస్తామా చెప్పండి. వైకాపా ప్రభుత్వ హయాంలో కార్మికులు అందరూ పనులు లేక హోటళ్లు, ఇతర పనులు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.
- ఇది నేతన్నల ఆవేదన.

సరులు పని చేస్తున్న కార్మికులు

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది నేత పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తారు. రాష్ట్రంలోనే చేనేతలో కృష్ణా జిల్లాకు ప్రత్యేకస్థానం ఉంది. జిల్లా వ్యాప్తంగా 36 సంఘాలు ఉండగా అందులో ఎక్కువశాతం పెడన నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను ఆదుకునే వారు లేక మూత పడేస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో పెడన, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోలవరం, ఐదుగుళ్లపల్లి, మల్లవోలు, రాయవరం గ్రామాలతోపాటు మచిలీపట్నం, ఘంటసాల, చల్లపల్లి, మొవ్వ మండలం కాజ తదితర ప్రాంతాల్లో చేనేత సంఘాలు ఉన్నాయి. వినియోగదారులు, కార్మికులతో కళకళాలాడే సంఘాలు ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. ప్రతి సంఘంలోనూ ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి.

తగ్గిన ఉత్పత్తులు

జిల్లాలోని ఆయా సంఘాల ద్వారా గతంలో ప్రతి నెలా దాదాపు రూ.5కోట్ల ఉత్పత్తులు జరిగేవి. ప్రస్తుతం రూ.2కోట్ల ఉత్పత్తులు జరగడం కష్టంగా ఉందని సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. ఉత్పత్తి చేసినా కొనేవారు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సంఘాల ద్వారా ఎక్కువశాతం చీరలనే ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా ఒక్కో చీర రూ.500 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. చీర తయారీకి ఉపయోగించే నూలు, రంగులు, ఇతరత్రాల ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో వస్త్రాల ధరలను పెంచి విక్రయించాల్సి రావడం ఆ ధరలకు కొనుగోలు చేయడానికి వినియోగదారులు విముఖత చూపించడంతో ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏటేటా తగ్గిపోతూ వచ్చింది. సంఘాల్లో  వస్త్రనిల్వలు కూడా పేరుకుపోవడం, కొనుగోళ్లు లేకపోవడంతో ఉత్పత్తులు నిలిపివేయడంతోపాటు పలుసంఘాలు మూతపడేస్థితికి చేరుకున్నాయి.

సక్రమంగా చెల్లించని రాయితీలు

వివిధ పథకాల ద్వారా రాయితీల తాలూకూ బకాయిలు ఏళ్ల తరబడి పేరుకుపోవడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పండుగల సందర్భంగా చేనేత వస్త్రాలపై 30శాతం రాయితీ కల్పిస్తారు. 126 రోజులు రాయితీ వర్తిస్తుంది. ఆ సమయంలో అమ్మిన వస్త్రాలపై ప్రభుత్వం కల్పించిన రాయితీలు సక్రమంగా చెల్లించడం లేదు. అమ్మిన మొత్తాన్ని సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. వడ్డీలు భారంగా మారడం కూడా సంఘాల నిర్వీర్యం కావడం కారణం అవుతుంది. ఇదే కాదు త్రిఫ్ట్‌ఫండ్‌ పథకం బకాయిలు కూడా రూ. కోట్లలో చెల్లించాల్సి ఉంది. ఏడాదికి ఒకొక్కరు 30 నుంచి 60 సాగలు నేస్తారు.వాటి ద్వారా కార్మికులు పొందే వేతనం నుంచి 8శాతం వసూలు చేస్తారు. దానికి ప్రభుత్వం 14శాతం కలిపి కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా సక్రమంగా ఇవ్వడం లేదు. నూలు రాయితీ బకాయిలు కూడా అంతే. నేత వస్త్రాల తయారీకి వినియోగించే నూలు కొనుగోళ్లలో 40శాతం రాయితీ ఇస్తారు. సంఘాలు ముందుకు కొనుగోలు చేస్తే తిరిగి ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఐదేళ్లపైబడి నుంచి ఈ బకాయిలు విడుదల కావడం లేదు.ఇలా మొత్తం కలిపి రూ.36కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. బకాయిలు విడుదల చేయకపోవడం, ఉపాధి కల్పించకపోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పరిశ్రమ మనుగడకే ముప్పు
- కట్టా హేమసుందరరావు, ఏపీ చేనేత కార్మిక సంఘ మాజీ అధ్యక్షుడు

ప్రభుత్వాల తీరుతో పరిశ్రమ మనుగడకే ముప్పువచ్చే ప్రమాదం ఉంది. నేతన్న నేస్తం పథకాన్ని చేనేత పని చేసే అందరికీ వర్తింపచేయాలని కోరుతున్నా పట్టించుకోకుండా కొందరికి ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఉత్పత్తులు కొనుగోళ్లు లేక పలు సంఘాలు మూతపడ్డాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రధానంగా వివిధ పథకాల ద్వారా రావాల్సిన బకాయిలు ఏళ్ల తరబడి విడుదల కావడం లేదు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే చేనేత అనే చారిత్రక కళ అంతరించిపోయే అవకాశం ఉంది.


ఇబ్బందులు పడుతున్నారు
- బూసం శివప్రసాద్‌, నేతకార్మికుడు, మల్లవోలు, గూడూరు మండలం

నేత కార్మికులు గతంలో ఎన్నడూలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పనులు ఉండేవి. భార్య, భర్తలు ఇద్దరికీ చేతినిండా పని ఉండడంతో కార్మికులు సంతోషంగా జీవించేవారు. ప్రస్తుతం ఇంట్లో ఒక్కరికి కూడా పనిదొరకడం లేదు. చాలామంది హైదరాబాదు వెళ్లి ఇతర పనులు చేసుకుంటుంటే, ఇంకొందరు బందరులోని వివిధ హోటళ్లలో పనిచేస్తున్నారు. పలువురు బయటకు వెళ్లలేక అలాగే నెట్టుకొస్తున్నారు. ఇలాగే ఉన్నవాళ్లు కూడా ఊరి వదిలి వెళ్లక తప్పదు.



 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని