logo

ట్రాఫిక్‌ పనులకు రెడ్‌ సిగ్నల్‌!

విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు.

Updated : 18 May 2024 05:44 IST

బిల్లులు రాలేదని ప్రాజెక్టు ఆపేసిన ఏజెన్సీరి

అతీగతీ లేని ఐటీఎంఎస్‌

 

బెంజి సర్కిల్‌లో స్తంభానికే పరిమితమైన సిగ్నల్‌

ఈనాడు, అమరావతి: విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీరుస్తుందని భావించిన ఐటీఎంఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ప్రాజెక్టు ఎంతకూ పూర్తి కావడం లేదు. ఇది ఏడాది క్రితమే పూర్తయి.. అందుబాటులోకి రావాల్సింది. ఇప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. గుత్తేదారుపై అటు నగరపాలక యంత్రాంగం, ఇటు పోలీసు యంత్రాంగం పర్యవేక్షణ లేక ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటివరకు సమర్పించిన బిల్లులు మంజూరు కాలేదన్న కారణంతో గుత్తేదారు పనులు ఆపేశారు. అసలిది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి.

ప్రణాళిక ఘనం.. ఐటీఎంఎస్‌ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి రూ. 5 కోట్లను నగరపాలక సంస్థ కేటాయించింది. తర్వాత నిధుల లభ్యతను బట్టి మిగిలిన కూడళ్లలో రూ. 10 కోట్లు వ్యయం చేయాలన్నది ప్రణాళిక. మొదటి విడతలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని 17 కూడళ్లను ఎంపిక చేశారు. బెంజి సర్కిల్‌, నిర్మలా జంక్షన్‌, రమేష్‌ ఆసుపత్రి, మహానాడు, చల్లపల్లి బంగ్లా, పోలీస్‌ కంట్రోల్‌ రూం, డీసీపీ బంగ్లా, ఆంజనేయస్వామి కూడలి, చుట్టుగుంట జంక్షన్‌, విజయా టాకీస్‌, శారదా కళాశాల కూడళ్లు, సీతారాంపురం, సీతన్నపేటగేట్‌, పడవలరేవు, అప్సర, ఫుడ్‌ జంక్షన్‌, మధురానగర్‌ సర్కిల్స్‌లో తొలి దశలో ఆధునిక ట్రాఫిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది.  

పురోగతి పూజ్యం

ఈ ప్రాజెక్టు టెండర్లను వీఎంసీ, నగర పోలీసులు 2022 నవంబరులో ఆహ్వానించారు. గుత్తేదారు ఎంపికలోనూ ఆలస్యం జరిగింది. గత ఏడాది జనవరిలో ఏజెన్సీని ఖరారు చేశారు. రూ. 3.90 కోట్లతో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌పీటీ నెట్‌వర్క్స్‌ సంస్థ పనులు దక్కించుకుంది. అదే సంవత్సరం ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి. గుంతలు తవ్వి స్తంభాలను పాతారు. అనంతరం రూ. 1.40 కోట్ల విలువైన బిల్లులను వీఎంసీకి సమర్పించారు. నగరపాలక ఇంజినీరింగ్‌ విభాగం పనులను పరిశీలించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాటిల్లో నాణ్యత లేదని నిర్ధరించి, సరిచేయాలని ఆదేశించింది. ఆ తర్వాత చాలా కాలానికి గానీ గుత్తేదారు వాటిని సరిచేయలేదు. అనంతరం షరా మామూలే అన్నట్లు మళ్లీ పనులను నిలిపేశారు. బిల్లులు మంజూరయ్యాకే మిగిలిన వాటిని ప్రారంభించాలని గుత్తేదారు చూస్తున్నారు. దీంతో తర్వాత స్టేజి పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అంతిమంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజల గురించి నగరపాలిక కానీ ఏజెన్సీ కానీ పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని