logo
Updated : 03/12/2021 05:56 IST

నగరానికి ముఠాలొచ్చాయ్..

ఈనాడు - అమరావతి

నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘ఖాకీ’ సినిమా గుర్తుందా..? జాతీయ రహదారుల వెంబడి నిర్మానుష్యంగా ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ఓ ముఠా దోపిడీ చేస్తుంటుంది. అడ్డొచ్చిన వారిని అందులోని సభ్యులు కనికరం లేకుండా అంతమొందిస్తారు. కన్నుమూసి తెరిచేలోగా అక్కడి నుంచి మాయమవుతారు.

విజయవాడ నగర కమిషనరేట్‌ పరిధిలో ఖాకీ సినిమా లాంటి దృశ్యాలే ప్రత్యక్షమవుతున్నాయి. కాకపోతే ప్రాణాలు తీయలేదు. నాలుగు రోజుల తేడాలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. తొలుత సీవీఆర్‌ వంతెన పక్కన ఉన్న శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్‌లోకి నలుగురు సభ్యులు ఉన్న గ్యాంగ్‌ ప్రవేశించింది. 18 గ్రాముల నగలు, రూ. 10 వేలు నగదు దోచుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లోకి వెనుక నుంచి గోడ దూకి వచ్చారు. మూడో ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాటు తలుపు బద్దలు కొట్టేందుకు ఐదుగురి ముఠా ప్రయత్నించింది. ఆ శబ్ధం విని ఇంట్లో వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అప్రమత్తం అయ్యేలోపే ముఠా జారుకుంది. రెండు ఘటనల్లో దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. పెద్ద రాడ్లు పట్టుకుని, చడ్డీ వేసుకుని దోపిడీకి వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. శివారు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్లల్లో ఉండే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇది చెడ్డీ గ్యాంగ్‌ పని అని వదంతులు వస్తున్నాయి.

చెడ్డీ గ్యాంగ్‌ తీరే వేరు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే పార్ధి ముఠా సభ్యులు ఎక్కువగా రహదారి పక్కన ఉండే ప్రాంతాలనే ఎంచుకుంటారు. వీరు తమ రాష్ట్రాల్లో వ్యవసాయం చేసుకుంటూ.. ఇక్కడికి వచ్చి దొంగతనాలకు పాల్పడుతుంటారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా ఎంచుకుని దోపిడీ చేస్తారు. ప్రధానంగా వీరి రాకపోకలు రైళ్ల ద్వారానే సాగుతుంటాయి. ఈ ముఠా ఒక చోట ఉండదు. దోపిడీ చేసిన అనంతరం మరో ప్రాంతానికి వెళ్తుంటారు. సంబంధిత ఇంటిని ఎంచుకుని.. తమ వెంట వీపున రాళ్లను మూటగట్టుకుని వెళ్తారు. అనుకోని ఆపద ఎదురైతే రాళ్లతో దాడి చేస్తారు. కాలువల వెంబడి, పార్కుల్లో ఉంటూ తమ పని కానిచ్చేస్తున్నారు.


సరిపోలని వేలిముద్రలు

గుంటుపల్లిలో చోరీ జరిగిన ఇంటిని పరిశీలిస్తున్న పోలీసులు

గరంలో జరిగిన రెండు ఘటనల్లో నిందితుల వేలిముద్రలు లభించాయి. ఒక చోట వేలిముద్రలు, మరో ఘటనలోని వాటితో సరిపోలలేదు. ఇటీవల ఒంగోలు, విశాఖపట్నంలోనూ ఈ తరహా చోరీలు జరిగాయి. అక్కడి నుంచి తెప్పించిన వాటితోనూ పోల్చినా ఉపయోగం లేకుండా పోయింది. రెండు రాష్ట్రాల్లోని డేటాబేస్‌తోనూ వడపోసినా సరిపోలలేదు. వీటిని ఎన్‌సీఆర్బీ (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో)కు త్వరలో పంపించనున్నారు. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న వాటితో వడపోయనున్నారు. 2005లో నగరంతో పాటు జిల్లాలో చెడ్డీ గ్యాంగ్‌ దోపిడీలకు పాల్పడింది. అప్పట్లో సత్యనారాయణపురంలో ఇద్దరిని చంపారు. నందిగామ ప్రాంతంలోనూ చోరీలకు పాల్పడ్డారు. ఐదేళ్ల క్రితం తెలంగాణతో పాటు, నగరంలోనూ ఓ గ్యాంగ్‌ దొంగతనాలు చేసింది. వీరిని తెలంగాణ, ఆంధ్ర పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాళ్లు లేవు. చెడ్డీ గ్యాంగ్‌ అడ్డొచ్చిన వారిని నిర్దాక్షణ్యంగా చంపేస్తుంది. తాజా ఘటనల్లో.. ప్రాణం తీసేందుకు ప్రయత్నించకపోవడంతో కొత్త ముఠా పని అయి ఉంటుందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని