logo

కృష్ణాతో విడదీయని బంధం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. మచిలీపట్నంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు గుడివాడ గున్నయ్యశెట్టితో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.....

Published : 05 Dec 2021 04:56 IST

న్యూస్‌టుడే, మచిలీపట్నం, భవానీపురం, అవనిగడ్డ, గ్రామీణం

మ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. మచిలీపట్నంలో ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు గుడివాడ గున్నయ్యశెట్టితో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్యవైశ్య ప్రముఖులు, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, కొత్తగుండు రమేష్‌, మామిడి మురళీకృష్ణ తదితరులు ఆయనతో సన్నిహితంగా మెలిగారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో 2012లో ఆర్యవైశ్య వసతిగృహ ప్రారంభోత్సవానికి, 2015లో నిర్వహించిన శ్రీలక్ష్మీనృసింహ సోమయాజి వైశ్య సమాజం శతవసంత మహోత్సవాల్లో పాల్గొన్నారు. నగరంలోని మిఠాయిసంస్థల అధినేత శిర్విశెట్టి తాతారావు నిర్వహించిన సేవా కార్యక్రమంలోనూ పాల్గొన్నట్లు ఆర్యవైశ్య ప్రముఖులు తెలిపారు. నగరంలోని గాంధీ విద్యాలయంలో  ఏర్పాటుచేసిన మహాత్మాగాంధీ విగ్రహన్ని ఆప్కో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1995 డిసెంబరు 28న రోశయ్య ఆవిష్కరించారు.

మచిలీపట్నంలో రోశయ్యకు సత్కారం (పాత చిత్రం)

దుర్గగుడి రహదారి విస్తరణకు రోశయ్య కృషి

విజయవాడలోని కనకదుర్గ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రహదారి విస్తరణ చేపట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కృషి చేశారని ఏపీ పీసీసీ మాజీ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్‌  తెలిపారు. అక్కడ రహదారి విస్తరణ చేపట్టాలంటూ 2010 సెప్టెంబరు 25న అప్పటి కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయరహదారుల శాఖ మంత్రి కమల్‌నాథ్‌కు రోశయ్య లేఖ రాశారని చెప్పారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షల విరమణ సమయాలతో పాటు సాధారణ రోజుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారని వివరించారు.


ఎదురుమొండిలోని రిజర్వాయర్‌ను అప్పటి మంత్రి మండలి వెంకట కృష్ణారావుతో కలిసి పరిశీలిస్తూ...

* దివిసీమతో రోశయ్యకు విడదీయరాని అనుబంధం ఉంది. మాజీ మంత్రి దివంగత మండలి వెంకటకృష్ణారావుతో సన్నిహితుడిగా ఉండేవారు. అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన కార్యక్రమాలకు రోశయ్య హాజరయ్యేవారు.

* నాగాయలంక మండలం ఎదురుమొండి జలాశయం నిర్మాణ పనులను మండలి వెంకటకృష్ణారావుతో కలిసి 1985లో పరిశీలించారు. 2005లో ఘంటసాల మండలం శ్రీకాకుళంలో  మండలి బుద్ధప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయలు ఉత్సవాల్లో నాటి ఆర్థిక మంత్రిగా రోశయ్య పాల్గొని డాక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి హాస్య చలోక్తులు విసిరి సభికులను నవ్వించారు.


రామానీడు రాజకీయ బడిలో పాఠాలు

రాజకీయ పార్టీల నాయకుల్లో విలువలతో కూడిన చైతన్యం నింపేందుకు 1933లో  గుంటూరు జిల్లా  పొన్నూరు పట్టణం, నిడుబ్రోలులో రామానీడు విద్యాలయాన్ని రైతు బాంధవుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ఆచార్య ఎన్‌జీ రంగా స్థాపించారు. దాన్ని 1933లో  మహాత్మాగాంధీ సందర్శించి, ఇక్కడి నేతలకు దిశా నిర్దేశం చేశారు.  రామానీడు విద్యాలయంలో చేరి, ఎన్నో విషయాలు కొణిజేటి నేర్చుకున్నారు. అప్పట్లో వేమూరు నుంచి నిడుబ్రోలుకు సైకిల్‌పై వచ్చి, రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు.  2014లో ఆచార్య రంగా జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్‌ హోదాలో హాజరై ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

గుంటూరు జిల్లా వేమూరులోని రోశయ్య ఇల్లు


సన్నిహిత సంబంధాలు

- బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఉపసభాపతి

నేను 1989 నుంచి ఆయనతో కలిసి రాజకీయాల్లో పనిచేసే అవకాశం దక్కింది. పెడన నియోజకవర్గంలోని మల్లవోలు, బంటుమిల్లి, బల్లిపర్రు తదితర గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన హాజరయ్యారు. మాతో సన్నిహితంగా ఉండే ఆయన మరణం కలచివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని