logo

పండగ వేళ.. మృత్యు హేల

పండగ పూట జరిగిన రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో పెను విషాదం నింపాయి. జిల్లాలో గత రెండ్రోజుల్లో చోటుచేసుకున్న ఆయా ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం

Published : 17 Jan 2022 04:55 IST

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఏడుగురి దుర్మరణం

ఏలియా (పాతచిత్రం)

వినుకొండ రూరల్‌, న్యూస్‌టుడే : పండగ పూట జరిగిన రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో పెను విషాదం నింపాయి. జిల్లాలో గత రెండ్రోజుల్లో చోటుచేసుకున్న ఆయా ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం కనమర్లపూడికి చెందిన ముట్లూరి సామ్యేల్‌ (32) శుక్రవారం తన అత్తను బొల్లాపల్లి మండలం పంపడానికి వినుకొండ వెళ్లి ఆమెను బస్సు ఎక్కించి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. విఠంరాజుపల్లి సమీపంలో పంది అడ్డుగా వచ్చి వాహనాన్ని ఢీకొనడంతో బోల్తా పడి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్థులు వినుకొండ ప్రైవేటు వైద్యశాలలో చేర్చగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపారు. మృతునికి భార్య, అబ్బాయి, అమ్మాయి ఉన్నారు.

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని..శావల్యాపురం : ఎదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనదారున్ని బలంగా ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. శావల్యాపురం మండలం శానంపూడి ఎస్సీకాలనీకి చెందిన కల్పూకూరి ఏలియా(33) డోజరు డ్రైవరు. పండగ కావడంతో భార్య పుట్టినిల్లు అయిన నరసరావుపేట మండలం గురువాయపాలెం పిల్లలతో వెళ్లింది. వారిని చూసేందుకు ద్విచక్ర వాహనంపై శనివారం బయలుదేరాడు. అయితే ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువు వద్ద కారు ఢీకొని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్య కుమారి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ట్రాక్టర్‌ ఢీకొట్టి.. : యడ్లపాడు : ట్రాక్టర్‌ ఢీకొనటంతో ఓ వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... యడ్లపాడుకు చెందిన షేక్‌ ఛాన్‌బాషా (49) శనివారం ద్విచక్ర వాహనంపై ఎర్రచెరువు నుంచి జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపైకి వస్తున్నాడు. అదే సమయంలో బోయపాలెం నుంచి కంకర లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ఛాన్‌బాషా కాలు విరిగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. 108లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయాడు. మృతునికి భార్య రుకియాబీ, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.


మాచర్లలో నల్గొండ జిల్లా వాసులిద్దరు..

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే : వేగంగా వస్తున్న కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మాచర్లలో ఇద్దరు మృతి చెందారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగుల్లా గ్రామానికి చెందిన ఆంగోతు మోతీరాంనాయక్‌, అంగోతు బాబూరావునాయక్‌ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుర్గి మండలం నెహ్రూనగర్‌కు తండాకు వచ్చారు. అక్కడి నుంచి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ద్విచక్ర వాహనం మాచర్ల పట్టణంలోని రింగురోడ్డు ప్రాంతంలోని సాగర్‌ రహదారి వైపు వెళ్తుండగా అటువైపు నుంచి వస్తున్న ఓ కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితుల్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. జరిగిన సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.


ద్విచక్ర వాహనం పైనుంచి పడి..

నెహ్రూనగర్‌: ద్విచక్ర వాహనంపై నుంచి పడిన వ్యక్తి మృతి చెందిన ఘటనపై సోమవారం కొత్తపేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మోతీలాల్‌నగర్‌కు చెందిన ప్రసంగిరావు (29) ఈ నెల 15న ద్విచక్ర వాహనంపై నుంచి పడటంతో జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి చెప్పారు.


రైలు ఢీకొని యువకుడు..

పెదకాకాని, న్యూస్‌టుడే: రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం గుంటూరు ఆటోనగర్‌ వద్ద చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన కారుమూరి మాధవ శివనాగిరెడ్డి(21) కొన్నేళ్ల నుంచి గుంటూరులోని శ్రీరామ్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఈయన కొన్ని గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారారు. ఆటోనగర్‌ శివారులోని రైలు పట్టాలపై ఈయన మృతదేహాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ యువకుడు ప్రమాదవశాత్తూ మృతిచెందారా? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయమై విచారణ సాగిస్తున్నట్టు రైల్వే పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని