logo

ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం ఏదీ?

ప్రజారోగ్యం దృష్ట్యా గుంటూరులో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని రెండు నెలల క్రితం నగరపాలకసంస్థ ఆర్భాటం చేసినా ఇప్పటికీ అది గాడిలోపడలేదు. ఎక్కడ చూసినా వాటి వినియోగం యథేచ్ఛగానే

Published : 18 Jan 2022 03:35 IST

యథేచ్ఛగా వినియోగం

నగరపాలక సంస్థకు పట్టని వైనం

ఈనాడు-అమరావతి

ప్రజారోగ్యం దృష్ట్యా గుంటూరులో ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తున్నామని రెండు నెలల క్రితం నగరపాలకసంస్థ ఆర్భాటం చేసినా ఇప్పటికీ అది గాడిలోపడలేదు. ఎక్కడ చూసినా వాటి వినియోగం యథేచ్ఛగానే ఉంటోంది. ప్లాస్టిక్‌ కవర్ల విక్రేతలకే కాదు.. వాటిని వినియోగించే ప్రజలకు పెనాల్టీలు విధించి మరీ వినియోగానికి స్వస్తి పలికిస్తామని నగరపాలక ఆర్భాటం చేసింది. యంత్రాంగం ఉన్నా దాన్ని అమలు చేయటంలో వైఫల్యం కనిపిస్తోంది. !

వ్యాపారులను పిలిచి సమావేశాలు ఏర్పాటు చేయడం, వారితో రాతపూర్వక హామీలు తీసుకునే విషయంలో చూపిన శ్రద్ధ ఆ తర్వాత లేకపోవటంతో వాటి విక్రయాలు చాపకిందనీరులా కొనసాగుతున్నాయి. రూ.2500 నుంచి 50 వేల దాకా పెనాల్టీలు విధించాలని నిర్ణయించుకున్నారు. నెలకో ప్లాస్టిక్‌ ఉత్పత్తిని నిషేధిస్తూ అంచలంచెలుగా మొత్తం నిఫేధించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. తొలుత ప్లాస్టిక్‌ కవర్లు,  ఆ తర్వాత ప్లాస్టిక్‌ కప్పులు, గ్లాసులు, భోజనం ప్లేట్లు వంటివి నిషేధిస్తామని చెప్పిన యంత్రాంగం మొదటి అడుగే వేయలేకపోయింది. వ్యాపారులు ఎవరైనా వాటి విక్రయాలు చేస్తూ పట్టుబడితే నగరపాలక జారీ చేసిన ట్రేడ్‌ లైసెన్స్‌ను రద్దుచేస్తామని అధికారులు హెచ్చరించారు.. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌, సాలిడ్‌ వేస్ట్‌ నిబంధనల అమల్లో భాగంగానే దీని అమలుకు ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు ఎంతమంది వ్యాపారులపై చర్యలు తీసుకున్నారో వారికే తెలియాలి. నగరంలో రోజుకు 450 టన్నుల పైబడి చెత్త వస్తోంది  కాల్వల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. నవంబరు 9 నాటికి వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలను ఖాళీ చేయించారు. అ తరువాత డంప్‌ అయిన నిల్వలు ఏమయ్యాయో చెప్పలేకపోతున్నారు.  ప్రతి డివిజన్‌లో వార్డు సెక్రటరీల నుంచి వలంటీర్ల దాకా ప్రతి ఒక్కరూ నిత్యం షాపుల్లో వాటి విక్రయాలకు తావు లేకుండా పరిశీలన జరపాలనే ఆదేశాలను యంత్రాంగం విస్మరించింది. నగరంలో 500 కు పైగా హోల్‌సేల్‌ దుకాణాలు, 10 మంది తయారీదారులు ఉన్నారు.
ప్రస్తుతం కొవిడ్‌ నియంత్రణపై ఎక్కువ దృష్టిపెట్టిన దృష్ట్యా ప్లాస్టిక్‌ నిషేధం కొంత మందగించిన మాట వాస్తవమేనని ప్రజారోగ్య ముఖ్య అధికారి విజయలక్ష్మి చెప్పారు. ఇప్పుడు కొవిడ్‌ కార్యకపాలతోపాటు ప్లాస్టిక్‌ నిషేధంపైనా చర్యలు చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు