logo

హవ్వా! పరీక్షలు లేకుండా శాంపిళ్లా?

కరోనా వైరస్‌ పరీక్షలకు లక్ష్యాలు నిర్ధేశించటంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది.. కొందరికి పరీక్షలు చేయకుండానే చేసినట్లు శాంపిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. ఈ వింత అనుభవం సాక్షాత్తు వైద్య, ఆరోగ్యశాఖ

Published : 18 Jan 2022 03:35 IST

ఈనాడు-అమరావతి

కరోనా వైరస్‌ పరీక్షలకు లక్ష్యాలు నిర్ధేశించటంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది.. కొందరికి పరీక్షలు చేయకుండానే చేసినట్లు శాంపిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. ఈ వింత అనుభవం సాక్షాత్తు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికే ఎదురైంది. శాఖలో పనిచేస్తున్న ఒక ఒప్పంద ఉద్యోగి చరవాణికి సోమవారం కరోనా పరీక్ష నిర్వహించినట్లు శాంఫిల్‌ ఐడీ రావటంతో అవాక్కయ్యారు. బూస్టర్‌ డోస్‌ వేయించుకుని మరీ విధులకు ఆ ఉద్యోగి హాజరవుతున్నారు.

ఇటీవల జిల్లా పాలనాధికారి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రతి పీహెచ్‌సీకి రోజువారీ చేయాల్సిన పరీక్షల లక్ష్యాలు తెలియజేశారు. అందుకు అనుగుణంగా పరీక్షలు చేయాలని లేదంటే బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించటంతో యంత్రాంగం లక్ష్య సాధన కోసం ఇలా అడ్డదారులు తొక్కక తప్పటం లేదని కొందరు ఉద్యోగులు అంటున్నారు. జిల్లాలో గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రితో పాటు తెనాలి జిల్లా ఆసుపత్రి, అన్ని ఏపీవీపీ ఆసుపత్రులు,  87 పీహెచ్‌సీలు, అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైరస్‌ పరీక్షలు చేయాలని ఆదేశించటంతో గత ఐదు రోజులుగా పరీక్షలు వేగవంతం చేశారు. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికే కాదు ఇతరులకు పరీక్షలు చేయకపోయినా చేసినట్లు శాంపిల్‌ ఐడీలు వస్తున్నాయని తెలుస్తోంది.

గతంలో ఎవరికైనా కరోనా నిర్ధారణ అయితే ఆయనతోపాటు ఉన్న ప్రాథమిక, ద్వితీయ కాంటాక్టులకు వైరస్‌ లక్షణాలు ఉన్నా, లేకపోయినా పరీక్షలు చేయాలని గతంలో  ఐసీఎంఆర్‌ నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ థర్డ్‌వేవ్‌లో కచ్చితంగా వైరస్‌ లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మల్లగుల్లాలు పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని