logo

టీడీఆర్‌ కొనుగోలుదారులకు టెండర్‌

కరెన్సీనగర్‌కు చెందిన మహిళ.. మరొకరి భాగస్వామ్యంతో స్థానికంగా గ్రూప్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టారు. అదనపు అంతస్తు వేయడానికి రూ.23 లక్షల విలువైన టీడీఆర్‌ బాండ్లను వేరే వారి వద్ద కొనుగోలు చేశారు. పనులు చేసేందుకు సిద్ధం కాగా, అవి

Published : 19 Jan 2022 03:31 IST

నకిలీలతో మోసపోతున్న నిర్మాణదారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

కరెన్సీనగర్‌కు చెందిన మహిళ.. మరొకరి భాగస్వామ్యంతో స్థానికంగా గ్రూప్‌ హౌస్‌ నిర్మాణం చేపట్టారు. అదనపు అంతస్తు వేయడానికి రూ.23 లక్షల విలువైన టీడీఆర్‌ బాండ్లను వేరే వారి వద్ద కొనుగోలు చేశారు. పనులు చేసేందుకు సిద్ధం కాగా, అవి నకిలీవని తేలడంతో లబోదిబోమన్నారు. రూ.లక్షల వ్యయంతో మళ్లీ అసలు బాండ్లు కొనుగోలు చేసుకున్నారు.

బృందావన్‌ కాలనీలో ఓ వ్యక్తి భవన నిర్మాణం చేపట్టారు. అదనపు అంతస్తు వేసేందుకు బ్రోకర్లను ఆశ్రయించగా, రూ.70 లక్షల విలువైన బాండ్లు అంటగట్టారు. అధికారుల పరిశీలనలో నకిలీవని తేలడంతో అతడు తీవ్రంగా నష్టపోయాడు.
సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి స్థానికంగా భవన నిర్మాణపు ప్లాను తీసుకుని కట్టడం పూర్తిచేశారు. బ్రోకర్ల ద్వారా టీడీఆర్‌ బాండ్లు కొనుగోలు చేసి, అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టారు. వాటికి అధికారులు నిరభ్యంతర సర్టిఫికెట్‌ జారీ చేసే సందర్భంలో అవి నకిలీవని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదార్ల విస్తరణ, డ్రెయిన్ల నిర్మాణాల కోసం స్థానిక కట్టడాలను తొలగించిన సందర్భంలో అధికారులు ఆఫ్‌లైన్‌(మాన్యువల్‌) కింద టీడీఆర్‌ బాండ్లు జారీచేశారు. అదే అదనుగా పట్టణ ప్రణాళికా విభాగంలోని కొందరు ఉద్యోగులు, గుమాస్తాలు, మెస్సెంజర్‌లు అక్రమాలకు పాల్పడ్డారు. కొందరు బ్రోకర్ల సాయంతో రూ.లక్షల విలువైన నకిలీబాండ్ల తయారీ చేసి విక్రయించారు. అటువంటి ఘటనల్లో పట్టణ ప్రణాళికా సిబ్బంది కొందరు గతంలో దొరికారు. ఆపై జారీచేసిన బాండ్ల పూర్తి వివరాలు కావాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించినా, ఫలితం దక్కలేదు. దీంతో విభాగంలోని గుమాస్తాలందరిపైనా ఒక్కసారిగా వేటు వేయాల్సి వచ్చింది. ఇప్పటికే రూ.కోట్ల విలువైన వాటిని మార్కెట్లో చలామణీ చేయగా, అందుకు సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

విచారణకు కౌన్సిల్‌ తీర్మానం
నకిలీ బాండ్ల కుంభకోణంపై ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం వేడెక్కింది. తెదేపాకు చెందిన ఓ కార్పొరేటర్‌ ఈ వ్యవహారంపై నిజాల నిగ్గు తేల్చాలంటూ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఇక వాటిని కొనుగోలు చేసి మోసపోయిన అనేక మంది అమాయకుల విషయం సమావేశంలో వెల్లడైంది. దీంతో దీనిపైౖ విజిలెన్సు, ఏసీబీ విచారణకు కౌన్సిల్‌ తీర్మానించింది. ఈ వ్యవహారంలో అనుమానితులైన పలువురు బిల్డర్లు, బ్రోకర్లు, లైసెన్స్డు ఇంజినీర్లు, లైసెన్స్డు సర్వేయర్లు పాత్రపై ప్రస్తుతం నేరుగా పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను పిలిచి వాస్తవాలు రాబట్టే యత్నం చేస్తున్నారు.

సమాచారం కోరిన అధికారులు
అవగాహన లేకుండా నకిలీబాండ్లు  కొనుగోలు చేసి మోసపోయిన వారు.. పూర్తి సమాచారాన్ని తమకు తెలియజేయాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ప్రకటన జారీచేశారు. దీంతో నష్టపోయినవారిలో ఒక్కొక్కరిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో నకిలీబాండ్ల చలామణీ¨ని పూర్తిగా అడ్డుకునేందుకు వీలు కలుగుతుందని అధికారులు చెపుతున్నారు. అయితే ఇప్పటికే  నిర్మాణాలు కూడా పూర్తిచేసి, ఎన్‌ఓసి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు కూడా పొందారు. ఈ స్థితిలో నకిలీ బాండ్ల వ్యవహారాన్ని ఇప్పుడు అధికారుల దృష్టికి తెస్తే, అసలుకే మోసం వస్తుందని అనేక మంది మిన్నకుండిపోయారనే వాదనా ఉంది.

బ్రోకర్ల హవా..
నగరంలో ఎక్కడ ఏ రహదారి విస్తరించినా, ఏ డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టినా, నష్టపోయి టీడీఆర్‌ బాండ్లు పొందిన భవన, స్థల యజమానుల వివరాలను సేకరిస్తున్న బ్రోకర్లు వారి వద్దకు వాలిపోతున్నారు. వాటి విలువ ఆధారంగా కొంత మొత్తం విక్రయించుకునే వీలు, బాండ్లను బదిలీచేసుకుని ఎక్కడైనా ఉపయోగించుకునే వీలుండడంతో బ్రోకర్లు అతితక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. నగదు ఇస్తుండడంతో యజమానులు కూడా విక్రయాలకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం బాండ్లను 1:4 పద్ధతిన జారీ చేస్తుండగా, వాటిని 28-30 శాతానికి కొనుగోలు చేస్తున్న బ్రోకర్లు ఆపై 40-50 శాతానికి విక్రయిస్తున్నారు. వీరు గతంలో ఆఫ్‌లైన్‌ పద్ధతిన జారీచేసిన బాండ్లను తక్కువ ధరకు కొని, ఉద్యోగుల సహకారంతో నకిలీలను తయారుచేసి విక్రయించారు.

ఆన్‌లైన్‌తో అడ్డుకట్ట..
ఈ వ్యవహారానికి అడ్డుకట్టవేసేందుకు అధికారులు 2020 నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని అమలులోకి తెచ్చారు. గతంలో బాండ్లు పొందినవారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 1900 వరకు ఆన్‌లైన్‌ చేశారు. అనేకమంది ఇంకా ఆన్‌లైన్‌ చేసుకోకుండా మిగిలిపోయారు. అందులో అనేకం నకిలీ బాండ్లు ఉంటాయన్న అంచనా ఉంది. ఇక బ్రోకర్ల నుంచి బాండ్లు కొనుగోలుచేసిన యజమానులు చాలామంది అధికారులు సూచించిన డాక్యుమెంట్లు సమర్పించి, ఆన్‌లైన్‌ చేసుకోలేదు. అటువంటి వారివద్ద నకిలీలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.


విచారణ సాగుతోంది
- ప్రసాద్‌, సిటీ ప్లానర్‌

నగరంలోని కొన్ని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేసే సమయంలో నకిలీబాండ్ల వ్యవహారం బయటపడింది. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ సాగుతోంది. ఇక ఈ వ్యవహారంపై తగిన సమాచారం ఇవ్వాలంటూ తాజాగా నోటిఫికేషన్‌ జారీచేశాం. నకిలీ బాండ్లు కలిగి ఉన్నవారు చాలా మంది ముందుకు రావడం లేదు. దీనిపై పరిశీలించి చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని