logo

ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ పేరిట రూ. కోట్ల వసూళ్లు

తాము అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి రిజిస్ట్రేషన్లకు రేటు కట్టడం శోచనీయమని సీపీఎం

Published : 20 Jan 2022 03:29 IST

అంబేడ్కర్‌ కాలనీ వాసులతో మాట్లాడుతున్న బాబూరావు

మధురానగర్‌, న్యూస్‌టుడే: తాము అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పి రిజిస్ట్రేషన్లకు రేటు కట్టడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. బుధవారం ఉదయం ఆయన ముత్యాలంపాడు అంబేడ్కర్‌ కాలనీలో పర్యటించారు. ప్రభుత్వ నోటీసులకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టగా వారికి సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఖజానా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఎత్తులు వేస్తోందన్నారు. ఓటీఎస్‌ పేరుతో రూ.5వేల కోట్లకు పైగా వసూళ్లకు ప్రభుత్వం పూనుకొందని భూమి విలువ ప్రకారం డబ్బు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడం గర్హనీయమన్నారు. అంబేడ్కర్‌కాలనీలో కొన్ని ఇళ్లకు రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు చెల్లించాలని నోటీసులు ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అంబేడ్కర్‌ కాలనీలోనే రూ.5కోట్లకు పైగా రిజిస్ట్రేషన్‌ కోసం డబ్బు చెల్లించాలని నోటీసులు జారీ చేశారని తెలిపారు. గత 50 సంవత్సరాల నుంచి దళితులు నివసిస్తున్న ఈ కాలనీవాసులకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని మాట ఇచ్చి ఓట్లు పొందారని గుర్తు చేశారు. ఇపుడు జీవో 225 పేరుతో తెల్లకార్డు లేదని, 75 గజాలకు మించి స్థలం ఉందనే సాకుతో నోటీసులు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న గోగులమూడి మోతి 88 చదరపు గజాల ఇంటికి గజానికి రూ.19వేల చొప్పున రూ.16.83లక్షలు చెల్లించాలని నోటీసు జారీ చేయడం ఒక ఉదాహరణ అన్నారు. ఒక్క అంబేడ్కర్‌ కాలనీకే కాకుండా నగరంలోని అనేక కాలనీల్లో గతంలో బిఫారం పట్టాలు ఉన్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి దరఖాస్తులు పెట్టించి ఇపుడు రూ.లక్షలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి జీవో 225లో మార్పులు చేసి అందరికీ ఉచితంగా రిజస్ట్రేషన్‌ చేయాలని బాబూరావు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని