ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్‌జాబ్స్‌కు ఇష్టంలేదట!

Steve Jobs: ఐఫోన్ల తయారు చేయాలన్న ఆలోచనను మొదట్లో స్టీవ్‌ జాబ్స్‌ ఒక వృధా పనిగా భావించారట. ఈ విషయాన్ని బ్రియాన్‌ మర్చంట్‌ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.

Published : 10 May 2024 21:55 IST

Steve Jobs | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోని టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుల్లో యాపిల్‌ (Apple) ఒకటి. ఈ కంపెనీ తీసుకొచ్చే ఐఫోన్లకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. మార్కెట్లోకి కొత్త ఫోన్‌ ఎప్పుడొస్తుందా? ఎప్పుడు కొందామా అంటూ టెక్‌ ప్రియులు ఎదురుచూస్తుంటారు. అంతలా ప్రాచుర్యం పొందిన ఐఫోన్‌ను రూపొందించడం కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ (Steve Jobs)కు ఇష్టంలేదట. ఐఫోన్‌ను తయారు చేసే ఆలోచనకు తొలినాళ్లలో ఆయన మద్దతు తెలపలేదట. వాస్తవానికి, యాపిల్ ఫోన్‌ను తయారు చేయాలన్న కాన్సెప్ట్‌ను మొదట్లో ఆయన ఓ వృథా పనిగా భావించారని బ్రియాన్‌ మర్చంట్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. 

ప్రముఖ జర్నలిస్టు బ్రియాన్‌ మర్చంట్‌ రాసిన ‘‘ది వన్ డివైస్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది ఐఫోన్’’ పుస్తకంలో స్టీవ్‌ జాబ్స్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్టీవ్‌ ఎల్లప్పుడూ యాపిల్‌ స్మార్ట్‌ఫోన్లను అభివృద్ధి చేయడానికి మద్దతివ్వలేదని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఇంతలా అభివృద్ధి చెందుతుందని ఆయన భావించలేదని.. కొందరు వ్యక్తులకు మాత్రమే ఈ ఫోన్లు పరిమితం కావచ్చని భావించారని అందులో తెలిపారు. ‘ఐఫోన్‌ను తయారు చేయడం కోసం ఎగ్జిక్యూటివ్‌ బృందం స్టీవ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ అది విజయం సాధిస్తుందని ఆయన భావించలేదు. ఇక చివరగా యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మైఖేల్‌ బెల్‌ 2004 నవంబర్‌ 7న అర్ధరాత్రి ఇ-మెయిల్‌ పంపారు. ఫోన్‌ అభివృద్ధి కోసం వాదించి చివరకు ఒప్పించారు’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని