AP News: పీఆర్సీపై పోరాటం.. ఏపీ వ్యాప్తంగా రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది.

Updated : 20 Jan 2022 14:22 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. మరోవైపు కలెక్టరేట్ల ముట్టడితో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతుందని పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నాయకులను బుధవారం రాత్రి నుంచి అడ్డుకున్నారు. కలెక్టరేట్ల ముట్టడికి అనుమతి లేదని నోటీసులిస్తూ చాలా చోట్ల గృహనిర్బంధాలు చేశారు. నోటీసులు పట్టించుకోకుండా వెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు అన్ని కలెక్టరేట్ల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కలెక్టరేట్లకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేశారు. ఫ్యాప్టో తలపెట్టిన ముట్టడి కార్యక్రమానికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి.

కడప జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజాను గృహనిర్బంధం చేశారు. ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్‌కు వెళుతున్న ఉపాధ్యాయులను కొత్తపల్లె చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ముట్టడి కార్యక్రమాన్ని విరమించే ప్రసక్తే లేదని నాయకులు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలోనూ ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పలువురిని అరెస్టు చేయడంపై వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అక్రమ అరెస్టులు చేయడం సరికాదంటూ నినాదాలు చేశారు. జిల్లాలోని ఆత్మకూరు, సంగం చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. మరోవైపు కలెక్టరేట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఉపాధ్యాయులు బారికేడ్లు తోసుకొని కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతిలో జిల్లా ఎస్‌టీయూ అధ్యక్షుడు జగన్‌, ప్రధాన కార్యదర్శి మధుసూధన్‌లను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కుప్పం, పలమనేరు నుంచి చిత్తూరు వెళ్తున్న ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. బంగారుపాళ్యం సమీపంలో టోల్‌గేట్‌ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేసి ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను నిర్బంధించారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఒంగోలు కలెక్టరేట్‌ వద్దకు భారీగా చేరుకున్న ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. యూటీఎఫ్‌ జిల్లా సహాధ్యక్షుడు బాబూరావు, గౌరవాధ్యక్షుడు భాస్కరరావును గృహనిర్బంధం చేశారు. పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావును గృహనిర్బంధం చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ వద్దకు భారీగా చేరుకున్న ఉపాధ్యాయులు పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్టీయూ నేతలు నారాయణ, పవన్‌కుమార్‌ను ముందస్తు అరెస్టులు చేశారు. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌ ఈ అరెస్టులను ఖండించారు. ఏలూరులో ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. చలో కలెక్టరేట్‌కు వెళ్లకుండా పోలీసులు ముందస్తు నోటీసులిచ్చారు. పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు గృహనిర్బంధంలో ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని