మూడో దశ.. మాటే లేదు

గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది.

Updated : 26 Apr 2024 06:49 IST

ముందుకుసాగని ఇన్నర్‌ రింగు రోడ్డు నిర్మాణం
అంతా వైకాపా నేతలే.. అయినా ఆసక్తి చూపలే
అయిదేళ్లుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే
ఈనాడు, అమరావతి

గుంటూరు నగరానికి అత్యంత కీలకమైన అంతరవలయ రహదారి మూడో దశ నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అయిదేళ్ల వైకాపా పాలనలో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, అభివృద్ధికి ఎంతో కీలకమైన మార్గం విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని వైకాపా ప్రజాప్రతినిధులు ప్రదర్శించారు.


గరంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, గుంటూరు నగర మేయర్‌ ఉన్నప్పటికీ ఒక్కరూ రహదారి నిర్మాణానికి చొరవ చూపకపోవడం దురదృష్టకరం. రెండు దశలు గత ప్రభుత్వాల హయాంలోనే పూర్తయ్యాయి. మూడో దశకు గత ప్రభుత్వమే నిధులు కేటాయించి పనులు మొదలెట్టినా వాటిని పూర్తిచేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైంది. ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు ప్రగతి పనులపై కనీస సమీక్ష కూడా చేయకపోవడం గమనార్హం.

గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పనులు ఆగిపోయి అయిదేళ్లు అవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇది పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆ దిశగా అటు సీఆర్‌డీఏ, ఇటు నగరపాలక సంస్థ చొరవచూపడం లేదు. అంతరవలయ రహదారికి ఇరువైపులా అభివృద్ధి వేగవంతమైనప్పటికీ మూడో దశ నిర్మాణంలో అంతులేని జాప్యం జరుగుతోంది. మూడో దశ పూర్తయితే రాయలసీమ, హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చేవారు గుంటూరు నగరంలోకి రాకుండా నేరుగా అమరావతి, విజయవాడ వైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా చేరుకోవచ్చు. భారీవాహనాలు సైతం నగరంలోకి రాకుండా ఈ మార్గంలో ప్రయాణించవచ్చు. రాజధాని అమరావతి ఏర్పాటైన తర్వాత ఈ మార్గం ప్రాధాన్యత మరింత పెరిగింది. దీనికితోడు నగరంలోని విద్యానగర్‌, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం, ఎస్వీఎన్‌ కాలనీ, స్తంభాలగరువు తదితర ప్రాంతాల నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు నగరంలోకి వెళ్లకుండా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా ట్రాఫిక్‌ రద్దీ లేకుండా ప్రయాణించవచ్చు. దీని వల్ల నగరంలోనూ ట్రాఫిక్‌ సమస్య తగ్గడంతో పాటు ఆయా ప్రాంతాల వారికి రాకపోకలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని వైనం

గుంటూరు నగరానికి అంతర వలయ రహదారిని 2005లో అప్పటి వీజీటీఎం ఉడా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. 2010-14 మధ్యకాలంలో తొలి దశలో 4.7 కి.మీ దూరం ఆటోనగర్‌ నుంచి రెడ్డిపాలెం మీదుగా అమరావతి రోడ్డును అనుసంధానం చేస్తూ నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2014 తర్వాత అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారతినగర్‌ వరకు రెండో దశలో 2 కి.మీ మేర రూ.29.08కోట్లతో చేపట్టి నిర్మించారు. రాజధాని రాకతో ఈ ప్రాంతం సీఆర్‌డీఏ పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలో మూడో దశలో స్వర్ణభారతినగర్‌ నుంచి పలకలూరు మార్గానికి అనుసంధానం చేస్తూ 4.25 కి.మీ దూరం రహదారి నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సీఆర్‌డీఏ రూ.33 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ సైతం పూర్తయింది. సీఆర్‌డీఏ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేసి నిర్మాణ పనులను అప్పగించింది. పెదపలకలూరు వైపు నుంచి గుత్తేదారు కొంతదూరం గ్రావెల్‌ రోడ్డు నిర్మించారు. స్వర్ణభారతినగర్‌ వద్ద ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న కొన్ని ఇళ్లను తొలగించగా అడ్డంకులు ఏర్పడడంతో పనులు అప్పట్లో  ఆగిపోయాయి. అదే సమయంలో 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడంతో ఈ మార్గం గురించి పట్టించుకునేవారే కరవయ్యారు. అప్పటి నుంచి రహదారి నిర్మాణంపై ఎవరూ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఎంతో కీలకమైన రహదారి నిర్మాణం పూర్తి చేస్తే ఆ ప్రాంతానికి అనుసంధానం పెరగడంతో పాటు అభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. నగరం విస్తరిస్తున్న సమయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు మూడోదశ రహదారి నిర్మాణం అత్యంత ఆవశ్యకమని నగరవాసులు కోరుతున్నా ప్రజాప్రతినిధులు కూడా స్పందించడం లేదు.


కీలకమైన మార్గం

హాత్మాగాంధీ అంతర్‌ వలయ రహదారి మూడోదశ నిర్మాణం పూర్తయితే విజయవాడ మార్గంలోని ఆటోనగర్‌ నుంచి పేరేచర్ల వరకు అనుసంధానం సులభమవుతుంది. విజయవాడ వైపు నుంచి నరసరావుపేట, హైదరాబాద్‌ వైపు వెళ్లేవారు నేరుగా ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్‌ రద్దీ తగ్గడంతో పాటు దూరం తగ్గడం వల్ల ఇంధనం, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. పల్నాడు, హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో వెళ్లిపోవడం వల్ల నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది. మూడో దశ నిర్మాణం పూర్తయితే అటు పలకలూరు, ఇటు జేకేసీ కళాశాల రోడ్డు వైపు నుంచి అనుసంధానం ఏర్పడి ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి వేగవంతమవుతుంది. ఇప్పటికే టిడ్కో ఇళ్లు, నల్లపాడు పోలీసుస్టేషన్‌, కొన్ని ప్రైవేటు వెంచర్లు అటువైపుగా ఉన్నాయి. నగరం విస్తరిస్తున్న వేళ ఈ మార్గం ప్రగతికి బాటలు వేస్త్తోంది. నగరవాసులకు కూడా రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయి. రోజురోజుకు నగరంలో వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మూడో దశ నిర్మాణం అత్యంత కీలకంగా మారింది. ఇంతటి కీలకమైన మార్గం నిర్మాణంలోనూ వైకాపా ప్రభుత్వం అంతులేని అలసత్వం ప్రదర్శించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని