logo

‘ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు సరికాదు’

ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ఈ నెల 25న తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Published : 24 Jan 2022 05:45 IST


మాట్లాడుతున్న విద్యాసాగర్‌. చిత్రంలో రాజుబాబు, ఇక్బాల్‌, రమేష్‌, శ్రీరామ్‌, శివలీల తదితరులు

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే : ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఏపీ ఎన్జీవో పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం విజయవాడలో ఈ నెల 25న తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీనగర్‌ ఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ రద్దుతో పాటు కమిషనర్‌ స్కూల్‌ ఎడ్యుకేషనల్‌ పింఛను రద్దు చేసే విషయంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 1958 నుంచి ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరుగుతుండగా, ఇకపై 10ఏళ్లకు మాత్రమే చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10గంటలకు పాతబస్టాండు నుంచి ర్యాలీగా ధర్నా చౌక్‌కు చేరుకుంటామని చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, అన్ని తరగతులకు చెందిన ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విద్యాసాగర్‌ కోరారు. రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజుబాబు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చామని, 7వ తేదీన సమ్మెకు సమాయాత్తమవుతున్నట్లు చెప్పారు. సంఘం జిల్లా కార్యదర్శి ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లకు ఒక సారి వేతన సవరణ జరపాలని, అశుతోష్‌ మిశ్రా నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.రమేష్‌, శ్రీరామ్‌, దిలీప్‌కుమార్‌, మధుసూదనరావు, సతీష్‌కుమార్‌, శివలీల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని