logo

ఆఖరి మజిలీ విషాదాంతం

పండుటాకులు ఒక్కటిగా ప్రాణాలు వదిలారు. ఐదున్నర దశాబ్దాల వివాహ బంధంలో కష్టసుఖాలను సమానంగా అనుభవించారు. వృద్ధాప్యం, అనారోగ్యం భరించలేక బలవంతంగా ప్రాణాలు

Published : 26 Jan 2022 04:21 IST

వృద్ధ దంపతుల బలవన్మరణం

నడకుదుటి రెడ్డయ్య, రేణుకమ్మ (పాత చిత్రం)

దుగ్గిరాల, న్యూస్‌టుడే: పండుటాకులు ఒక్కటిగా ప్రాణాలు వదిలారు. ఐదున్నర దశాబ్దాల వివాహ బంధంలో కష్టసుఖాలను సమానంగా అనుభవించారు. వృద్ధాప్యం, అనారోగ్యం భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసల కథనం.. మండలంలోని గొడవర్రుకు చెందిన నడకుదుటి రెడ్డయ్య (80), ఆయన భార్య రేణుకమ్మ (70) 23వ తేదీన గడ్డి మందు తాగారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం పది నిమిషాల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. కూలీ పనులు చేసుకునే ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబాన్ని పోషించారు. ఐదేళ్ల క్రితం వరకూ ఇద్దరూ శారీరకంగా శ్రమిస్తూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం పెద్ద కొడుకు చనిపోయారు. అతడి కొడుకు నాగరాజుతో కలిసి గుంటుపల్లిలో ఉండేవారు. కొద్ది రోజుల క్రితం గొడవర్రు వచ్చారు. ఇక్కడికి రాగానే రేణుకమ్మకు పక్షవాతం వచ్చింది. వారిని చూడడానికి వచ్చి కూతురు నాలుగు రోజులుగా తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఏం బాధ కలిగిందో 23న కుమార్తె ప్రార్థన మందిరానికి వెళ్లగా ఇంట్లోనే గడ్డి నివారణ మందు తాగారు. ప్రార్థనా మందిరం నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుమార్తె తల్లిదండ్రుల పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. సమాచారం అందుకున్న మనవడు నాగరాజు వారిని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ముందు రెడ్డయ్య ఊపిరి వదిలారు. పది నిమిషాల తర్వాత రేణుకమ్మ ప్రాణాలు విడిచారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని