logo

చేతులెత్తేశారు..!

పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చిలోగా ఖర్చు పెట్టాలి. చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు చేయడానికి తుది గడవు మార్చి 31. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉండదని తెలిసినా

Published : 27 Jan 2022 05:34 IST

బిల్లులు రావని గుత్తేదారులు... సమయం చాలదని అధికారులు
14వ ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే ప్రమాదం
ఈనాడు, అమరావతి

పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చిలోగా ఖర్చు పెట్టాలి. చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు చేయడానికి తుది గడవు మార్చి 31. ఆ తర్వాత టెండర్లు పిలిచి పనులు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉండదని తెలిసినా జిల్లాలో మున్సిపల్‌ యంత్రాంగం అప్రమత్తం కాలేదు. ఇప్పటికీ సుమారు రూ.40కోట్ల పనులకు అసలు టెండర్లే పిలవలేదు. పనుల నిర్వహణకు సమయం లేదని, ఒకవేళ టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఇంత తక్కువ వ్యవధిలో వాటిని చేసే పరిస్థితి ఉండదని ఇంజినీరింగ్‌ వర్గాలు అంటున్నాయి. పురపాలికల్లో అభివృద్ధి పనుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. దీంతో గుత్తేదారులు పనుల కోసం పోటీ పడడం లేదు. ఒకరిద్దరు గుత్తేదారులే చేజిక్కించుకుంటూ పనుల నిర్వహణను ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. గుంటూరు, మంగళగిరి నగరపాలక, నరసరావుపేట తర్వాత జిల్లాలో అతిపెద్ద పురపాలిక తెనాలి. ఇక్కడే సుమారు రూ.7-8 కోట్లకు టెండర్లు పిలవలేదు. ఒకవైపు ఆయా పురపాలికల్లో జనం పలు సమస్యలతో సతమతమవుతున్నారు. నిధులు ఉండి కూడా పనులు నిర్వహించలేని పరిస్థితిపై విస్మయం వ్యక్తమవుతోంది. అధికారులేమో బిల్లులు పేరుకుపోవడంతో పనులు చేయడానికి గుత్తేదారులు రావడం లేదని, అనేకసార్లు టెండర్లు పిలిచామని చెప్పుకొస్తున్నారు. గుత్తేదారుల అభిప్రాయం మరోలా ఉంది. చాలా పురపాలికల్లో పనులు చేయటానికి ముందుకొస్తున్నా యంత్రాంగం నుంచి సహకారం కొరవడిందని, పనులు పూర్తి చేసినా వాటి ఎంబుక్కు రికార్డులు చేయించుకోవడానికి, బిల్లులు పెట్టించుకోవటానికి వారిని బతిమిలాడుకోవాల్సి వస్తోందంటున్నారు.

తెనాలిలో పునాదులకే పరిమితమైన గ్యాస్‌ ఆధారిత దహన వాటిక

ఆ దహన వాటికకు అతీగతి లేదు

తెనాలి పురపాలకలో ఐతానగర్‌లో రూ.1.4కోట్లతో గ్యాస్‌ ఆధారిత హిందూ దహన వాటిక నిర్మాణానికి ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. ఆ పనులు పునాది దశకు చేరుకోగానే రూ.10లక్షల బిల్లులు చెల్లించాలని గుత్తేదారు ప్రతిపాదించారు. ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ బిల్లు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఎండకు ఎండి వర్షానికి తడుస్తూ ఆ నిర్మాణం కూడా తన పటిష్టతను కోల్పోతోంది. ఇది నిర్మితమైతే హిందూ శ్మశానంలో దహన సంస్కారాలకు పట్టణవాసులకు బాగా ఉపయోగపడుతుంది. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణంలో ఒక్క గ్యాస్‌ ఆధారిత దహన వాటిక లేదని స్థానికులు తెలిపారు. వెంటనే దాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

* గుంటూరు నగరంలో రామనాథ క్షేత్రం రోడ్డులో రూ.2కోట్లతో సైడు కాల్వలు, బీటీ రహదారి నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. సైడు కాల్వల నిర్మాణం పూర్తయినా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆ రహదారిలో వెట్‌మిక్స్‌ వేసి వదిలేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం తారు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇన్నర్‌రింగ్‌ రోడ్డులో సుమారు రూ.1.5లక్షలకు సైడు కాల్వల పనులు చేపట్టాల్సి ఉన్నా వాటికి ఇప్పటిదాకా ఒప్పందాలు చేసుకోలేదు. ఆ పనులు అయ్యే పరిస్థితి లేదు. నెహ్రూనగర్‌లో సైడుకాల్వల నిర్మాణానికి టెండర్లు పిలిచినా సమయం లేదని గుత్తేదారు మందుకు రాలేదు. నగరంలో ఇంకా చేపట్టాల్సిన పనులు రూ.10కోట్లకు పైగా ఉన్నాయి.
* తెనాలి పురపాలికలో రూ.29 కోట్లు ఖర్చయింది. ఇంకా రూ.5-6 కోట్లకు టెండర్లు పిలవాల్సి ఉన్నా ఆ పనులు చేయలేమని వాటి జోలికి వెళ్లడం లేదు.
* సత్తెనపల్లి పురపాలికలో రూ.1.5 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియే నిర్వహించలేదు.
* పొన్నూరు పురపాలకలో నిడుబ్రోలులో రూ.2.5కోట్లతో తాగునీటి పథకం నిర్మాణ పనులు చేపట్టాలనుకున్నా సమయం లేదని కనీసం టెండర్లు పిలవలేదు. ఆ ప్రాంతంలో మరికొన్ని సైడు కాల్వల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసి ఇప్పుడు టెండర్లు పిలిచి పనులు నిర్వహించలేమని అధికారులే వాటి ఊసెత్తటం లేదు.
* నరసరావుపేటలో రూ.25కోట్లకు రూ.15కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం రూ.2కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా రూ.8 కోట్లకు పనులు నిర్వహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని