Crime News: చావు భయంతో స్నేహితుడినే చంపేశారు
హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: చావు భయంతో స్నేహితుడిని హతమార్చారు. ఏమీ తెలియనట్లు ఏడు నెలలుగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. కేసు వివరాలను హిందూపురం గ్రామీణ మండల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐజి.టి.నాయుడు, ఎస్ఐ అబ్దుల్ కరీం శనివారం వెల్లడించారు. పట్టణంలోని అజాద్ నగర్‌కు చెందిన ముశీరుల్లా (20) చెడు వ్యసనాలకు బానిసై, భార్య అయేషాను తరచూ కొట్టేవాడు. ఓ రోజు స్నేహితుల ఎదురుగానే భార్యను కొడుతుంటే వారు మందలించారు. వారి మధ్య మాట, మాట పెరిగి, ఘర్షణ జరిగింది. స్నేహితులు షబ్బీర్, నయాజుల్లా, ఇమ్రాన్, తబ్రేజ్, రెహమాన్‌లు అతన్ని తీవ్రంగా కొట్టారు. ఏదో ఓ రోజు చంపేస్తా అని, దెబ్బలు తిన్న ముశీరుల్లా వారిని హెచ్చరించడంతోపాటు కత్తి పెట్టుకొని తిరిగే వాడు.
దీంతో వారు అతనికి భయపడి, ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. పార్టీ చేసుకొందామని, మద్యం తాగుదామని అతన్ని వారు మార్చి 21వ తేదీ రాత్రి పట్టణ సమీపంలోని బసవనపల్లి వద్ద లారీ అసోసియేషన్ భవనం వెనుక గల ఖాళీ స్థలానికి పిలిచారు. అక్కడికి రాగానే కళ్లలో కారం చల్లి, కత్తితో గొంతులో పొడవడంతో మృతిచెందాడు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. స్నేహితులే నిందితులని గుర్తించారు. విషయం తెలిసిన నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై బెంగళూరుకు పారిపోవడానికి సిద్ధం చేసుకున్నారు. ఈ సమాచారం పోలీసులకు రావడంతో శనివారం ఆటోనగర్ క్రాస్‌లో ఎస్.ఐ. అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు.