AP News: 2 గంటల్లో వివాహం.. చెప్పులు మార్చుకొస్తానంటూ వెళ్లి వరుడు పరార్
శింగనమల, న్యూస్టుడే: మరో రెండు గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ మండపం ఒక్కసారిగా మూగబోయింది. వరుడు కనిపించడం లేదంటూ కుటుంబీకులు చెప్పడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. శింగనమల మండలంలోని ఓ గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన ఓ యువకుడికి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిర్ణయించారు. ఈనెల 9వ తేదీ ముహూర్తం, 10వతేదీ బుధవారం 10 గంటలకు వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వధువును తీసుకొని బంధువులు మంగళవారం రాత్రికే వరుడి స్వగ్రామానికి చేరుకొన్నారు. ఉదయం అల్పాహారం ఆరగించి వధువును పెళ్లికి సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వరుడు 8 గంటల సమయంలో చెప్పులు సరిగా లేవు.. పామిడికి వెళ్లి మార్చుకొస్తానని ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్లిపోయాడు. వివాహ సమయం దగ్గర పడుతున్నా రాలేదు. కుటుంబీకులు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు సాయంత్రం వరుడి ఆచూకీని కనుగొని గ్రామపెద్దల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఈ వివాహం ఇష్టం లేదని అతడు చెప్పినట్లు సమాచారం. గ్రామపెద్దలు ఇరు కుటుంబాలతో చర్చలు జరిపి వివాహం రద్దు చేసినట్లు తెలిసింది.