logo

ఆపదలో..ఆదుకుని..ఆపదలో..చిక్కుకుని !

కరోనా అందర్నీ వణికించింది.. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం చేసింది.. కొవిడ్‌ బారిన పడిన బాధితులు ఆర్తనాదాలు పెట్టినా ఇరుగుపొరుగు వారు కనీసం కన్నెత్తి చూడని ఘటనలు అనేకం.. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ ఫోన్‌ కాల్‌ రాగానే ప్రైవేటు

Published : 05 Dec 2021 04:48 IST

కరోనా బాధితులకు ప్రైవేటు అంబులెన్సుల సేవలు

బిల్లులు అందక అప్పుల్లో కూరుకుపోయిన నిర్వాహకులు

ఈటీవీ, అనంతపురం, న్యూస్‌టుడే, హిందూపురం పట్టణం: కరోనా అందర్నీ వణికించింది.. లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితం చేసింది.. కొవిడ్‌ బారిన పడిన బాధితులు ఆర్తనాదాలు పెట్టినా ఇరుగుపొరుగు వారు కనీసం కన్నెత్తి చూడని ఘటనలు అనేకం.. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ ఫోన్‌ కాల్‌ రాగానే ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లు ఇంటికెళ్లి రోగులను వాహనంలో ఎక్కించుకుని ఆసుపత్రులకు చేరవేసి వేలాది మంది ప్రాణాలను కాపాడారు.. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ కన్నుమూసిన బాధితులను బంధువులు కూడా చూడటానికి భయపడిన అనేక సందర్భాల్లో డ్రైవర్లే అంత్యక్రియలు జరిపించారు.. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన అంబులెన్సు డ్రైవర్లు, యజమానులను ప్రభుత్వం మరిచిపోయింది. కరోనా రోగులకు సేవలందించిన అంబులెన్సు నిర్వాహకులకు బిల్లులు చెల్లించకుండా తిప్పుకొంటున్నారు. అప్పట్లో పనిచేసిన జిల్లా ఉన్నతాధికారులు బదిలీపై వెళ్లిపోయారు. పెట్టిన బిల్లులు ట్రెజరీలో నిలిచిపోయాయి. డీజిల్‌ నింపుకొని వాహనాలను నడిపిన వారంతా అప్పులపాలై అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

అత్యవసర పరిస్థితిలో అండగా..

జిల్లాలో 2020 మార్చి నెలాఖరులో లేపాక్షి మండలంలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత జిల్లా అంతటా వైరస్‌ వ్యాప్తి చెందింది. వైరస్‌ సోకిన బాధితుల ప్రాణాలు కాపాడటానికి అత్యవసర వాహన సేవలు అందించే శక్తి ప్రభుత్వం కోల్పోయింది. ఆ సమయంలో జిల్లాలోని ప్రైవేట్‌ అంబులెన్సు డ్రైవర్లు, యజమానులను రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు పిలిపించారు. బాధితులు సకాలంలో ఆసుపత్రికి రాకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, వారికి అండగా నిలవాలని చెప్పారు. కోరినంత డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు 15 అంబులెన్సులను బలవంతంగా లాక్కున్నారు. రోగులకు రాత్రింబవళ్లు అంబులెన్సు సేవలతోపాటు, మృతదేహాలను అంత్యక్రియలకు తరలించే పనులు చేయించారు.

చెల్లింపుల్లో లెక్కలేనితనం

ప్రైవేట్‌ అంబులెన్సు యజమానులను పిలిచి రోజుకు రూ.1000 బాడుగ, డ్రైవర్‌ బత్తా రూ.375గా నిర్ణయించారు. అనంతపురం, హిందూపురం కొవిడ్‌ ఆసుపత్రులకు బాధితులను తరలించడానికి ప్రభుత్వ అనుమతితో తొలుత 15 ప్రైవేట్‌ అంబులెన్సులను తీసుకున్నారు. హిందూపురం ప్రాంతంలో కేసులు అధికం కావడంతో అదనంగా తొమ్మిది వాహనాలను ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వం 153 రోజులు పనిచేయించుకుంది. హిందూపురానికి చెందిన తొమ్మిది వాహనాలకు డీజిల్‌ ఖర్చులు ఏరోజుకారోజు చెల్లించారు. అద్దెగా దాదాపు రూ.12 లక్షలు అయింది. ఏడాదిపాటు అధికారుల చుట్టూ తిరగ్గా రూ.5.22 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.6.53 లక్షల కోసం ఏడాదిన్నరపైగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు 15 ప్రైవేట్‌ అంబులెన్సుల యజమానుల ఒత్తిడితో ఇటీవల రూ.85 లక్షలు చెల్లించారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించి రూ.2.60 లక్షలు, ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు రూ.12 లక్షలు.. మొత్తంగా అన్ని వాహనాలకు కలిపి రూ.21.13 లక్షలు బకాయి ఉంది. పలువురు యజమానులు ప్రైవేట్‌గా రూ.లక్షలు అప్పులు చేసి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనుగోలు చేశారు. రూ.వేల ఖర్చుతో మరమ్మతులు చేయించి ప్రభుత్వానికి అప్పగించారు. వారంతా బిల్లులు అందక అప్పులపాలయ్యారు. వడ్డీ భారంతో కుదేలవుతున్నారు.

మృతుల తరలింపులో ప్రైవేట్‌ అంబులెన్సు

బిల్లులన్నీ ఉన్నతాధికారులకు పంపించాం

- శివరాంప్రసాద్‌, డీటీసీ, అనంతపురం, శ్రీనివాసులు, తహసీల్దార్‌, హిందూపురం

ప్రైవేట్‌ అంబులెన్సు యజమానులకు బిల్లుల బకాయి వాస్తవమే. గతేడాది కొంత చెల్లించాం. ఇంకా రూ.20 లక్షలు పైగా చెల్లించాల్సి ఉంది. యజమానులు రోజూ కార్యాలయానికి వచ్చి అడుగుతున్నారు. మేము ఎప్పటికప్పుడు బిల్లును ఉన్నతాధికారులకు పంపించాం. కొన్ని బిల్లులకు సంబంధించి సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి చెల్లింపులు జరగాల్సి ఉంది. మరికొన్ని ఖజానా కార్యాలయంలో నిచిపోయాయి. మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సొమ్ము అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

పోలీసులతో దెబ్బలు తిన్నాం

- మహబూబ్‌ బాషా, హిందూపురం

మృత దేహాలను తరలించే క్రమంలో పోలీసులతో అనేకమార్లు దెబ్బలుతిన్నాను. బంధువులు భయంతో దూరంగా నిల్చొని నాతోనే అంత్యక్రియలు చేయించారు. ప్రాణాలకు తెగించి రాత్రి, పగలు తేడాలేకుండా కరోనా మృతులను మోసుకెళ్లాం. మీరు అడిగినంత డబ్బు ఇస్తామని అధికారులు చెప్పారు. కనీసం బత్తా కూడా ఇవ్వలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

అప్పులకు వడ్డీ కడుతున్నాం

- అహ్మద్‌, అంబులెన్సు యజమాని

అధికారులు పిలిచి కరోనా రోగులకు సేవలందించాలని చెప్పిన వెంటనే సైనికుల్లా పనిచేశాం. డీజిల్‌ పోయించారే తప్ప వాహనం అద్దె, డ్రైవర్‌ బత్తా ఇవ్వలేదు. ఏడాదిపాటు అధికారుల చుట్టూ తిరిగితే 2020 మే, జూన్‌ నెలల బిల్లులు కొంత చెల్లించారు. అందరికీ దాదాపు రూ.6.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రోజూ తహసీల్దార్‌ వద్దకు వెళ్లి వస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని