logo

చూస్తే రూ.40.. లెక్కిస్తే రూ.కోట్లు!

గ్యాస్‌ సిలిండర్‌ పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో దడ మొదలవుతోంది. ప్రభుత్వం రోజురోజుకూ గ్యాస్‌ ధర పెంచుతోంది. మరోవైపు డెలివరీ బాయ్స్‌ దందా సాగిస్తున్నారు. కంపెనీలు నిర్ణయించిన ధరకు అదనంగా డెలివరీ సమయంలో వసూలు చేస్తున్నారు.

Published : 28 Sep 2022 06:03 IST
గ్యాస్‌బండ డెలివరీ బాయ్‌ల దందా 
పట్టించుకోని అధికార యంత్రాంగం

తనకల్లులో గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

కదిరి, పుట్టపర్తి, తనకల్లు, ఓబుళదేవరచెరువు, అనంత వ్యవసాయం, న్యూస్‌టుడే: గ్యాస్‌ సిలిండర్‌ పేరు వింటేనే సామాన్యుడి గుండెల్లో దడ మొదలవుతోంది. ప్రభుత్వం రోజురోజుకూ గ్యాస్‌ ధర పెంచుతోంది. మరోవైపు డెలివరీ బాయ్స్‌ దందా సాగిస్తున్నారు. కంపెనీలు నిర్ణయించిన ధరకు అదనంగా డెలివరీ సమయంలో వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై సరాసరిన రూ.40 వరకు లబ్ధిదారులపై భారం వేస్తున్నారు. ఇక పల్లెల్లో రూ.100 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ దందాపై ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పౌర సరఫరాల విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సరాసరిన సిలిండర్‌పై రూ.40 లెక్కించినా రూ.కోట్లలో దోపిడీ జరుగుతోంది. అధికారులు స్పందించి డెలివరీ బాయ్స్‌ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని గ్యాస్‌ వినియోగదారులు కోరుతున్నారు.

5 కి.మీ. దాటితేనే రవాణా ఛార్జీలు

ఉమ్మడి అనంత జిల్లాలో రవాణా ఛార్జీల పేరుతో సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన సుమారు 16 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1100 దాటింది. దీనికితోడు కదిరి పట్టణంలోనే రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీకి 5 కి.మీ.ల పరిధిలోని కనెక్షన్లకు రవాణా ఛార్జీలు వసూలు చేయకూడదు. 15 కి.మీ.ల వరకు రూ.20, ఆపైన దూరంలోని కనెక్షన్లకు డోర్‌డెలివరీ చేసేందుకు రూ.30 ఛార్జీలుగా నిర్ణయించారు. గ్యాస్‌బండ తీసుకెళ్లే సిబ్బంది నిబంధనలను పట్టించుకోవడం లేదు. రూ.1,087 బిల్లు ధర ఉన్న హెచ్‌పీగ్యాస్‌ సిలిండరుకు రూ.43, రూ.1,120 బిల్లు ఉన్న భారత్‌గ్యాస్‌కు రూ.1,200 వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే ఇష్టముంటే తీసుకో, లేదంటే వదిలేమంటూ డెలివరీ బాయ్స్‌ బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలకు డోర్‌డెలివరీ లేదు

గ్యాస్‌ బండ డోర్‌డెలివరీ పట్టణాలకే పరిమితమైంది. గ్రామీణ వినియోగదారులు సొంత వాహనంలో తీసుకెళ్లాల్సిందే. గ్యాస్‌ కంపెనీలు నాలుగైదు మండలాలకు కలిపి ఒక ఏజెన్సీకి కనెక్షన్లు కేటాయించాయి. గోడౌన్ల నుంచి వాహనాల ద్వారా మండలాలకు, అక్కడ్నుంచి గ్రామాల తీసుకెళ్లి గ్యాస్‌ బండలను అందజేయాల్సి ఉంది. తక్కువ కనెక్షన్లు ఉన్న గ్రామాల ప్రజలు సమీప రోడ్డు పాయింట్‌లో ఉండి బండ తీసుకోవాల్సి వస్తోంది. కొందరు మండల కేంద్రానికి వెళుతున్నారు.

రూ.1,200 చెల్లిస్తున్నాం - రమణ, తనకల్లు

గ్రామీణ ప్రాంతాల్లో బండపై రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తరచూ సిలిండరు ధర పెంచుతోంది.  దీనికితోడు డెలివరీ ఛార్జీలు భారంగా మారాయి. సంబంధిత అధికారులు చొరవ చూపి, అరికట్టాల్సిన అవసరం ఉంది.

రూ.43 అదనం - అక్కులమ్మ, నారప్పగారిపల్లి

మాకు హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. సిలిండరు రూ.1087 బిల్లు ధరతో రశీదు ఇస్తున్నారు. ఓబుళదేవరచెరువులోని ఏజెన్సీ నుంచి 3 కి.మీ.ల దూరంలోని నారప్పగారిపల్లిలో డెలివరీ చేసేందుకు రూ.1,130 తీసుకుంటున్నారు. దీంతో సిలిండరుపై రూ.43 అదనపు భారం పడుతోంది. దీనిపై ప్రశ్నిస్తే గోదాము వద్దకు వచ్చి తెచ్చుకోండని సమాధానం చెబుతున్నారు. అసలే కరవు ప్రాంతం. పూట గడవడమే కష్టంగా ఉంది.

అనధికార వసూళ్లపై చర్యలు - వంశీకృష్ణారెడ్డి, డీఎస్‌వో, పుట్టపర్తి

సిలిండర్ల సరఫరాపై తరచూ తనిఖీ చేస్తున్నాం. ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. ఎక్కడైనా నిబంధనలను అతిక్రమించి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందితే విచారణ చేపడతాం. ఏజెన్సీలు, పంపిణీలపై నిఘా ఉంచుతాం.

Read latest Anantapur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని