logo

వైకాపా అక్రమాలపై.. కనం, వినం, మాట్లాడం!

చెడు చూడం.. చెడు వినం.. చెడు మాట్లాడం అన్న మూడు కోతుల సిద్ధాంతాన్ని వైకాపా నాయకుల విషయంలో ఉమ్మడి అనంత జిల్లా మైనింగ్‌ అధికారులు సంపూర్ణంగా పాటిస్తున్నారు.

Published : 06 Aug 2023 05:12 IST

కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు
ఎన్‌జీటీ ఆదేశాలు బేఖాతరు
చోద్యం చూస్తున్న అధికారులు

పెద్దపప్పూరు రీచ్‌లో కొనసాగుతున్న తవ్వకాలు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: చెడు చూడం.. చెడు వినం.. చెడు మాట్లాడం అన్న మూడు కోతుల సిద్ధాంతాన్ని వైకాపా నాయకుల విషయంలో ఉమ్మడి అనంత జిల్లా మైనింగ్‌ అధికారులు సంపూర్ణంగా పాటిస్తున్నారు. నాయకులు చేసే అక్రమాలను పరిశీలించే సమయం వారికి ఉండటం లేదు. ఎవరైనా చెప్పినా వినేంత తీరిక లేదు. ఇక అక్రమాలపై వివరణ అడిగితే మాత్రం ఆమడ దూరం పారిపోతారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎస్‌ఈఏఏ) తాజాగా పర్యావరణ అనుమతులు ఇచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌(రేవు)లలో తవ్వకాలు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఉమ్మడి అనంత జిల్లాలో అన్నిచోట్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎన్‌జీటీ ఆదేశాల అమలుపై మైనింగ్‌ అధికారులు నోరు మెదపడం లేదు. సెబ్‌ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రెండు విభాగాలను పర్యవేక్షించాల్సిన కలెక్టర్లు ఎన్‌జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి అనంత జిల్లాలో పెన్నా, చిత్రావతి, వేదవతి నదుల్లో ఎక్కడికక్కడ వైకాపా నాయకులు ఇసుకను కొల్లగొడుతున్నారు. భారీ ఉల్లంఘనల కారణంగా ఇప్పటికే నదులు సహజ స్వరూపాన్ని కోల్పోయాయి. ఉల్లంఘనలపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపానపోలేదు. పైగా అక్రమ తవ్వకాలపై నిరసన వ్యక్తం చేసిన తెదేపా నాయకులపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారు.

చక్రం తిప్పుతున్న మాజీ ఎమ్మెల్యే  

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలన్నీ జేపీ వెంచర్స్‌ సంస్థకు అప్పగించారు. కానీ, ఎక్కడికక్కడ వైకాపా నాయకులు సబ్‌లీజుకు తీసుకుని నిర్వహిస్నున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లోనూ తవ్వి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇటీవల వేదవతి నదిలో అనుమతి లేకుండా తరలించిన ఘటనలో విజిలెన్స్‌ అధికారులు ఆయన పాత్రపై స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సదరు మాజీ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉండటంతో జిల్లా అధికారులు సైతం ఆయన అక్రమాలపై నోరెత్తడం లేదు. ఏడాది కాలంగా జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఇసుక అక్రమ రవాణా విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. దీంతోపాటు శ్రీసత్యసాయి జిల్లాలోని ఉప్పలపాడు రేవును ధర్మవరం కీలక నేత నడిపిస్తున్నారు. ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట తవ్వకాలు జరుపుతున్నారు. రీచ్‌లో 3 అడుగులు (ఒక మీటరు) తవ్వాల్సి ఉండగా.. 10 నుంచి 20 అడుగులు తవ్వుతున్నారు. దీంతో నదులు, చెరువులు సహజ రూపాన్ని కోల్పోతున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలపై ఏడీ మౌనం

వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలను మైన్స్‌ శాఖ ఏడీ నాగయ్య చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నా మౌనంగా ఉంటున్నారని, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పెద్దపప్పూరు మండల కేంద్రం సమీపంలో ఇసుక రేవులో అనుమతులు లేకుండానే నెల రోజుల పాటు తవ్వకాలు జరిగాయి. దీనిపై విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేల్చారు. సుమారు రూ.కోటి విలువైన ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వినట్లు అప్పట్లోనే నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దానిపై కనీస చర్యలు కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంపై ‘ఈనాడు’ వివరణ కోరగా సమాధానం దాటవేశారు.

ప్రేక్షక పాత్రలో సెబ్‌ అధికారులు

అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సెబ్‌ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ధర్మవరం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి నిత్యం కర్ణాటకకు తరలిపోతోంది. ఎక్కడా నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. రాయదుర్గం పరిధిలో వేదవతి నది నుంచి అనతపురం మాజీ ఎమ్మెల్యే అధ్వర్యంలో రోజుకు వంద టిప్పర్లలో సరకు బళ్లారికి తరలిపోతోంది. స్థానికంగా సెబ్‌స్టేషన్‌ ఉన్నా ఎక్కడా అడ్డుకోవడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలపై అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లను వివరణ కోరేందుకు ‘ఈనాడు’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని